మార్కో సీక్వెల్‌లో ఉన్ని ముకుందన్ నటించడం లేదా?
ఒక సాధారణ కథానాయకుడిని కూడా యాక్షన్ కంటెంట్ అసాధారణ హీరోగా మార్చేస్తుంది. దీనికి ఉదాహరణ - మార్కో.
By: Sivaji Kontham | 19 Sept 2025 10:29 AM ISTఒక సాధారణ కథానాయకుడిని కూడా యాక్షన్ కంటెంట్ అసాధారణ హీరోగా మార్చేస్తుంది. దీనికి ఉదాహరణ - మార్కో. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లకు జనం రావడానికి కారణం ఇందులో ఉన్న మాస్ యాక్షన్ కంటెంట్. కానీ అదుపు తప్పిన హింస, క్రూరత్వం, రక్తపాతం తీవ్ర విమర్శల్ని కొని తెచ్చాయి. మార్కో చిత్రంలో ఉన్ని ముకుందన్ నటనకు పేరొచ్చింది. అతడు అంతకుముందు అంత ఫేమస్ హీరో కానే కాదు. కానీ ఓవర్ నైట్ లో అతడి జాతకం మారిపోయింది. అయితే అదే సమయంలో ఉన్ని ముకుందన్ అదుపు తప్పిన హింస విషయంలో విమర్శల్ని కూడా ఎదుర్కొన్నాడు.
ఇక అదంతా అటుంచితే మార్కో నిర్మాతలు ఇప్పుడు `లార్డ్ మార్కో` అనే టైటిల్ ని మలయాళ ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయడం చర్చగా మారింది. అయితే ఇది మార్కోకి సీక్వెల్ సినిమా కాబట్టి ఉన్ని ముకుందన్ తిరిగి నటిస్తారని కూడా అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇంతలోనే ఊహించని రీతిలో ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించిన నిర్మాతలు కాస్టింగ్ ఎవరో వివరాలను వెల్లడించలేదు. టైటిల్ ప్రకటన ప్రెస్ నోట్‌లో ఉన్ని ముకుందన్ పేరు కూడా కనిపించలేదు. దీంతో మార్కో నిర్మాతలతో ఉన్ని ముకుందన్ కి ఏవైనా వివాదాలున్నాయా? అందుకే పేరు వేయలేదా? అని కొన్ని డౌట్లు వచ్చాయి.
ఈ సీక్వెల్ లో ఉన్ని ముకుందన్ నటించరని కూడా అందరూ భావించారు. అయితే దీనికి ఉన్ని ముకుందన్ నుంచి స్పష్ఠమైన సమాధానం ఉంది. గతంలో ఓ ప్రకటనలో ఉన్ని ముకుందన్ కూడా తాను మార్కో సీక్వెల్ లో నటించబోనని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ పై నెగెటివిటీ ఉంది.. అందుకే ముందుకు వెళ్లడాన్ని విరమించుకున్నాను! అని చెప్పాడు. ఇప్పుడు నిర్మాతలు ఉన్ని ముకుందన్ పేరును ప్రకటించలేదు. అయితే మాతృకలో నటించిన హీరో లేకుండా ఇప్పుడు సీక్వెల్ ని ఎలా నడిపిస్తారు? అన్నది వేచి చూడాలి. `లార్డ్ మార్కో` టైటిల్ ఆకర్షణీయంగా ఉంది.. ఇందులో నటించే హీరో ఎవరో తేలాల్సి ఉంది. ఓవర్ నైట్ లో ఉన్ని ముకుందన్ లాంటి టూటైర్ హీరో రేంజ్ ను పెంచిన ఈ సినిమా సీక్వెల్ ఎవరి జాతాకాన్ని మారుస్తుందో వేచి చూడాలి.
