టాప్ స్టోరి: బొజ్జ గణేశుని కథలతో క్లాసిక్స్ ఎన్నో.. జెన్-Z దర్శకులు పట్టించుకోరా?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తొలి పూజ్యుడైన వినాయకుడి (గణేశుడు) కథాంశంతో.. పౌరాణిక నేపథ్యంలో .. భక్తి ప్రధానంగా పలు చిత్రాలు తెరకెక్కాయి.
By: Sivaji Kontham | 14 Sept 2026 10:07 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో తొలి పూజ్యుడైన వినాయకుడి (గణేశుడు) కథాంశంతో.. పౌరాణిక నేపథ్యంలో .. భక్తి ప్రధానంగా పలు చిత్రాలు తెరకెక్కాయి. వినాయకుడి మహిమలు.. బాల్యంలో లీలలు.. వినాయక చవితి ప్రాముఖ్యతను తెలియజేస్తూ టాలీవుడ్, బాలీవుడ్ సహా పలు భాషల్లో వచ్చిన ఈ సినిమాలు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి.
దేశీ సినీపరిశ్రమలో బొజ్జ గణపయ్య స్థానం ఎంతో విశిష్ఠమైనది. వినాయకుడిని పూజించాకే కొత్త సినిమాని ప్రారంభించే మన దేశ సంస్కృతిలో గణేశుడి పాత్రను పౌరాణిక చిత్రాల్లో మొదట్నుంచీ విడదీయరాని భాగంగా చూపిస్తూ వచ్చారు. తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన `వినాయక చవితి` (1957) చిత్రం వినాయక వ్రత కల్పం, శమంతకమణి ఘట్టం , చంద్రుడి శాప వృత్తాంతాన్ని అత్యంత అద్భుతంగా తెరకెక్కించింది. సమద్రాల రాఘవాచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చిత్తూరు నాగయ్య, కాంతారావు వంటి దిగ్గజ నటులు నటించి ప్రేక్షకులను మెప్పించారు.
అలాగే పూర్తిగా వినాయకుడి మహిమలను, భక్తి తత్త్వాన్ని చాటిచెప్పేలా వచ్చిన `శ్రీ వినాయక విజయం` (1979) చిత్రం కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కంబాలపల్లి లక్ష్మణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాంతారావు, రాజబాబు వంటి నటీనటులు తమ నటనతో వినాయకుడి భక్తి మహిమలను వెండితెరపై ఆవిష్కరించారు.
కాలం మారుతున్న కొద్దీ సాంకేతికతను జోడించి యానిమేషన్ రూపంలో కూడా వినాయకుడి కథలను బాలీవుడ్ తెరపైకి తెచ్చింది. పంకజ్ శర్మ దర్శకత్వంలో వచ్చిన `బాల గణేష్` (2007) యానిమేషన్ చిత్రం పిల్లలను విశేషంగా ఆకట్టుకుంది. వినాయకుడి బాల్య లీలలు, రాక్షస సంహార ఘట్టాలను అందంగా మలచడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గణేశుడిని కేవలం దైవంగానే కాకుండా.. విఘ్నాలను తొలగించే అధిపతిగా ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక రూపంలో స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పౌరాణిక సినిమాల నుంచి ఆధునిక యానిమేషన్ చిత్రాల వరకు వినాయకుడి ఆధారంగా వచ్చిన ఈ చిత్రాలన్నీ భారతదేశంలోని ప్రతి ఇంటిలోనూ భక్తి భావాలను నింపడంలో కీలక పాత్ర పోషించాయి.
వినాయకుడి కథల్ని విస్మరించారు:
ఇటీవలి కాలంలో దేవుళ్ల కథలతో సినిమాలు తీసే ట్రెండ్ విస్త్రతంగా ఉంది. ఇదే ట్రెండ్ లో జెన్- జీ దర్శకులు కూడా వినాయకుడి కథలతో సినిమాలు తీస్తే అవి గొప్ప విజయం సాధించే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ నచ్చే, అందరూ పూజించే దేవుడిని లైట్ తీస్కోకుండా వందల కోట్లు కొల్లగొట్టే గొప్ప కథల నిధి వినాయకుడి చెంత ఉంది. అందుకే బొజ్జ గణపయ్య సినిమాలను యానిమేషన్ కేటగిరీ లేదా స్ట్రెయిట్ ఫీచర్ ఫిలింస్ గా మలిచే ప్రయత్నం చేయాలని ఆశిద్దాం.
ఖాన్‌లు కూడా వినాయకుడి భక్తులే:
దేశవ్యాప్తంగా వినాయక చవితిని ఎంతో పవిత్రంగా విశిష్ఠమైన పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీపరిశ్రమలలో వినాయక చవితికి ప్రత్యేక స్థానం ఉంది. ఆసక్తికరంగా ముంబైలోని హిందీ చిత్రపరిశ్రమ ప్రముఖులు వినాయక చవితిని ఎంతో విశిష్ఠంగా జరుపుకుంటారు. ఖాన్ ల త్రయం సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా ఈ ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ మతతత్వానికి అతీతంగా పూజలాచరించడం బొజ్జ గణేషుని ప్రత్యేకతను ఆవిష్కరిస్తుంది.
