న్యూ ట్రెండ్: స్టోరీ రివీలింగ్ - లాంగ్ గ్లిమ్స్/టీజర్స్!
ఒకప్పుడు ప్రచార చిత్రాలు అంటే ? కొన్ని ఆకర్షణీయమైన షాట్లు, వేగవంతమైన కట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన నిమిషం లోపు ఉండే టీజర్లు మాత్రమే.
By: Srikanth Kontham | 23 May 2026 12:00 AM ISTఒకప్పుడు ప్రచార చిత్రాలు అంటే ? కొన్ని ఆకర్షణీయమైన షాట్లు, వేగవంతమైన కట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన నిమిషం లోపు ఉండే టీజర్లు మాత్రమే. సినిమా కథ ఏంటనేది థియేటర్లలోనే చూడాలనే ఉత్సుకతను పెంచేలా మేకర్స్ జాగ్రత్తపడేవారు. కానీ మారుతోన్న కాలంతో పాటు ప్రేక్షకుల ఆలోచనా విధానంలో సినిమా చూసే శైలిలో భారీ మార్పులు వచ్చాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కథను రహస్యంగా ఉంచడం కంటే? అసలు తాము ఏం చెప్పబోతున్నామో? ముందే ప్రేక్షకులకు ఓ స్పష్టమైన అవగాహన కల్పించడమే విజయానికి తొలిమెట్టుగా భావిస్తున్నారు. ఈ సరికొత్త ఆలోచన నుంచే లాంగ్ గ్లిమ్స్ , లాంగ్ టీజర్స్ అనే సరికొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది.
రెండు, మూడు నిమిషాల పరిమితిని దాటి ఏకంగా నాలుగు నుండి ఐదు నిమిషాల నిడివితో ప్రచార చిత్రాలను విడుదల చేయడానికి దర్శకులు వెనుకాడటం లేదు. హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాకుండా సినిమా ఏ నేపథ్యంలో సాగుతుంది. పాత్రల స్వభావం ఏంటి? కథలోని కాన్ఫ్లిక్ట్ దేని చుట్టూ తిరుగుతుంది? అనేది లాంగ్ గ్లిమ్స్ ద్వారా స్పష్టంగా వివరిస్తున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన .. రాబోతున్న భారీ చిత్రాల ప్రచార సరళిని గమనిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సుదీర్ఘమైన విజువల్స్ ద్వారా సినిమా అసలు కథా నేపథ్యాన్ని, ఆ ప్రపంచాన్ని ముందే ఆవిష్కరిస్తున్నారు.
దీంతో ప్రేక్షకుడికి సినిమా స్పాన్ ఎంత? మేకర్స్ ఎంతటి భారీ కాన్వాస్‌పై కథను తెరకెక్కిస్తున్నారు అనే విషయాలపై ముందే ఓ అంచనా వచ్చేస్తోంది. కథను దాచడం వల్ల వచ్చే సర్ ప్రైజ్ కంటే కథపై ముందే క్లారిటీ ఇవ్వడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని నమ్ముతున్నారు. ఈ సరికొత్త ప్రయోగంలో దర్శకుల శైలి కూడా విభిన్నంగా ఉంటోంది. కొందరు దర్శకులు భారీ విజువల్స్, సుదీర్ఘ మైన సీన్ల ద్వారా హీరో జర్నీని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంటే.. మరికొందరు దర్శకులు వాయిస్ ఓవర్ లేదా వినూత్నమైన కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ ద్వారా సినిమా థీమ్‌ను రివీల్ చేస్తున్నారు. నిడివి ఎక్కువైనా? అందులోని కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు దాన్ని లూప్‌లో చూస్తారని తద్వారా సినిమాపై సోషల్ మీడియాలో జరిగే చర్చ మరింత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ట్రైలర్ కంటే ముందే వచ్చే గ్లిమ్స్ .. కాన్సెప్ట్ వీడియోలు సినిమా మార్కెటింగ్‌లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో థియేట్రికల్ ,నాన్-థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అవ్వడానికి కూడా సుదీర్ఘ విజువల్స్ ఎంతో దోహదపడుతున్నాయి. తాము పెట్టే పెట్టుబడికి ఎలాంటి అవుట్‌పుట్ రాబోతుందో డిస్ట్రిబ్యూటర్లకు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కు ముందే ఓ నమ్మకం కలుగుతోంది. అలాగే డిజిటల్ మాధ్యమాలలో ఈ లాంగ్ వీడియోలు సృష్టించే రికార్డులు సినిమా ఓపెనింగ్స్‌పై నేరుగా ప్రభావం చూపుతున్నాయి.
సస్పెన్స్ కంటే స్పష్టతకే ప్రేక్షకులు ఓటేస్తున్న రోజుల్లో లాంగ్ గ్లిమ్స్ ట్రెండ్ అనేది సినిమా ప్రచార రంగంలో విప్లవాత్మక మార్పుగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ చిత్రాలు ఇదే బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథను ముందే చెప్పడం అనేది సినిమా ఫలితాన్ని దెబ్బతీయకపోగా సరైన ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో బలమైన ఆయుధంగా మారుతోంది.
