కాలంతో పోటీ పడుతోన్న కల్పన!
ఆధునిక సినిమా ప్రపంచంలో కంటెంట్ వేగంగా మారిపోతోంది. ప్రేక్షకుల అభిరుచులు, సాంకేతికత నెలల వ్యవధిలోనే కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
By: Srikanth Kontham | 13 April 2026 9:31 AM ISTఆధునిక సినిమా ప్రపంచంలో కంటెంట్ వేగంగా మారిపోతోంది. ప్రేక్షకుల అభిరుచులు, సాంకేతికత నెలల వ్యవధిలోనే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇలాంటి వేగవంతమైన మార్కెట్‌లో పౌరాణిక లేదా ఫాంటసీ చిత్రాల కోసం దర్శకులు ఏళ్ల తరబడి సమయం కేటాయించడం అనేది సాహసోపేతమైన నిర్ణయం. అశ్వత్థామ, రామాయణం వంటి భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో దర్శకులు తీసుకుంటోన్న సుదీర్ఘ విరామం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం నాణ్యత. అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ ఎఫెక్ట్స్ అందించాలంటే ఆ మాత్రం సమయం తప్పనిసరని మేకర్స్ భావిస్తున్నారు.
దర్శకులు తీసుకునే ఈ సుదీర్ఘ సమయం సినిమాపై అంచనాలను భారీగా పెంచుతుంది. ఒక ప్రాజెక్ట్ గురించి నిరంతరం చర్చ జరుగుతుంటే ప్రేక్షకుల్లో ఆ సినిమాపై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతుంటాయి. `ఇంత కాలం ఏం తీస్తున్నారు`? అనే ఉత్సాహం సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడానికి దోహదపడుతుంది. `బాహుబలి` రాజమౌళి చిత్రాల విషయంలో ఇదే సన్నివేశం కనిపించింది. దర్శకుడు వెచ్చించే ప్రతి నిమిషం వెండితెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందనే నమ్మకం కుదిరితే ప్రేక్షకులు ఎంత కాలమైనా వేచి చూడటానికి సిద్ధంగా ఉంటారు.
అయితే ఈ సుదీర్ఘ నిరీక్షణలో ఒక పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంది. కాలం గడిచేకొద్దీ టెక్నాలజీ మారుతుంది. రెండేళ్ల క్రితం అద్భుతం అనుకున్న గ్రాఫిక్స్ సినిమా విడుదలయ్యే సమయానికి పాతబడిపోయే అవకాశం ఉంది. అలాగే నటీనటుల క్రేజ్ కూడా మారుతూ ఉంటుంది. సుదీర్ఘ కాలం ఒకే ప్రాజెక్ట్ మీద పనిచేయడం వల్ల మేకర్స్ సృజనాత్మక అలసటకు లోనయ్యే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఒక్కోసారి ఆసక్తి పెరగడానికి బదులు, సినిమాపై హైప్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ఆర్థిక కోణంలో చూస్తే సినిమా ఆలస్యమయ్యే కొద్దీ బడ్జెట్ పై భారం పెరుగుతుంది. వడ్డీలు, నిర్మాణ ఖర్చులు రెట్టింపు అవుతాయి. దీనివల్ల బాక్సాఫీస్ వద్ద సినిమా సాధించాల్సిన టార్గెట్ కూడా పెరుగుతుంది. మార్కెట్ వేగంగా ఉన్నప్పుడు ఒక స్టార్ హీరో సినిమా కోసం మూడేళ్లు వేచి చూడటం అంటే? ఆ హీరో మార్కెట్ విలువను కూడా పణంగా పెట్టడమే. అందుకే దర్శకులు కేవలం సృజనాత్మకతపైనే కాకుండా మారుతోన్న మార్కెట్ ట్రెండ్స్‌పై కూడా ఓ కన్ను వేసి ఉంచాలి.
నిజానికి పౌరాణిక చిత్రాలకు ఎటర్నల్ అప్పీల్ అనేది ఉంటుంది. కథలు పాతవైనా? వాటిని చెప్పే విధానం కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కాబట్టి దర్శకులు కేవలం విజువల్స్ మీద మాత్రమే కాకుండా కథలోని భావోద్వేగాల మీద కూడా అంతే సమయం వెచ్చిస్తే సినిమా ఆలస్యమైనా అది క్లాసిక్‌గా నిలిచిపోతుంది. నాణ్యమైన విజువల్స్ కోసం సమయం తీసుకోవడం తప్పు కాదు. కానీ అది ప్రస్తుత జనరేషన్ వేగాన్ని తట్టుకునేలా ఉండాలి.
భారీ చిత్రాల కోసం తీసుకునే సమయం అనేది రెండంచుల కత్తి లాంటిది. అది సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లవచ్చు లేదా అంచనాల భారంతో కుంగదీయోచ్చు. దర్శకుడు తన విజన్ పట్ల ఎంత స్పష్టంగా ఉన్నాడు? మారుతోన్న టెక్నాలజీని ఎలా? అందిపుచ్చుకుంటున్నాడు అనే దానిపైనే సుదీర్ఘ నిరీక్షణ ఫలితం ఆధారపడి ఉంటుంది. పట్టుదల ఉంటే ఈ నిరీక్షణ వెండితెర అద్భుతానికి నాంది అవుతుంది అన్నది అంతే వాస్తవం.
