రజినీ-కమల్ సినిమా.. లోకేష్ ఎందుకు చేయలేదంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో తెరకెక్కే సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తాడని గత ఏడాది జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.
By: Garuda Media | 26 Jan 2026 6:30 PM ISTసూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో తెరకెక్కే సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తాడని గత ఏడాది జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ‘కూలీ’ రిలీజ్‌కు ముందు లోకేష్ స్వయంగా ఈ సినిమా గురించి మాట్లాడాడు. వీరి కలయికలో సినిమా కోసం స్క్రిప్టు రాస్తున్నట్లు చెప్పాడు. రజినీ, కమల్ కూడా ఆ ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా ఉన్నట్లు కూడా వెల్లడించాడు.
కానీ ‘కూలీ’ రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది. ఆ సినిమా ఆశించినట్లు లేకపోవడంతో లోకేష్ చేతి నుంచి ఈ ప్రాజెక్టు జారిపోయినట్లుగా కనిపించింది. కమల్ నిర్మాణంలో రజినీ నటించే సినిమాకు సుందర్‌ను దర్శకుడిగా ప్రకటించారు. తర్వాతేమో శిబి చక్రవర్తి లైన్లోకి వచ్చాడు. రజినీ, కమల్ కలిసి నటించే సినిమా సంగతి ఎటూ తేలకుండా పోయింది.
ఐతే రజినీ, కమల్‌లతో తాను చేయాల్సిన సినిమా ఎందుకు ముందుకు కదల్లేదో లోకేష్ కనకరాజ్ తాజాగా వెల్లడించాడు. వీరి కలయికలో సినిమా కోసం తాను ఒక భారీ యాక్షన్ కథను రెడీ చేశానని.. కమల్, రజినీ కూడా ఆ కథ విషయంలో ఎగ్జైట్ అయ్యారని.. కానీ అంత యాక్షన్ వద్దు, ఒక లైట్ హార్ట్ కథ కావాలని అనడంతో తాను ఆ సినిమా చేయలేకపోయానని లోకేష్ వెల్లడించాడు. ‘కూలీ’ సినిమా మీద విమర్శలను తాను అంగీకరిస్తానని, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతానని అతను మరోసారి స్పష్టం చేశాడు. ఇది నిర్మాతలకు మాత్రం లాభదాయకమైన సినిమానే అని అతను చెప్పాడు.
సెన్సార్ బోర్డు 35 కట్స్ సూచించిందని.. ఆ కట్స్‌కు ఓకే చెప్పకపోవడం వల్ల ‘ఎ’ సర్టిఫికెట్‌తో సినిమా రిలీజైందని.. లేదంటే ‘కూలీ’ ఇంకో 35-40 కోట్ల దాకా కలెక్షన్ వచ్చేదని లోకేష్ అభిప్రాయపడ్డాడు. తాను ‘ఖైదీ-2’ సినిమాను పక్కన పెట్టినట్లు వస్తున్న వార్తలను అతను ఖండించాడు. అల్లు అర్జున్ తర్వాత తాను చేసే సినిమా అదే అన్నాడు. దీంతో పాటుగా విక్రమ్-2, రోలెక్స్ సినిమాలు కూడా చేయాలని.. అవి పూర్తి కాకుండా తాను సినీ రంగం నుంచి వెళ్లనని.. ఎల్‌సీయూ మూత పడుతుందనే ప్రచారం కూడా నిజం కాదని.. ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న చిత్రం కూడా అందులో భాగమే అని అతను స్పష్టం చేశాడు.
