బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే దానికే ఎక్కువ విలువిస్తా
డైరెక్టర్లు ముందు ఒకటి అనుకుని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తమ ఆలోచనలను మార్చుకుంటూ ఉంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 2 Aug 2025 11:12 AM ISTడైరెక్టర్లు ముందు ఒకటి అనుకుని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తమ ఆలోచనలను మార్చుకుంటూ ఉంటారు. ఒక్కోసారి నిర్మాత కోసమని, మరోసారి హీరో కోసమని ఇలా కారణాలేమైనా సరే కొన్నిసార్లు తాము అనుకున్నది అనుకున్నట్టు స్క్రీన్ పై ప్రెజెంట్ చేయలేకపోతారు. అయితే కొందరు డైరెక్టర్లు మాత్రమే తాము అనుకున్నది అనుకున్నట్టు రావడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అందులో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు.
అందరినీ షాక్ కు గురిచేసిన కూలీ
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న తాజా సినిమా కూలీ. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా సెన్సారు పూర్తి చేసుకున్న కూలీ సినిమా సెన్సార్ బోర్డు నుంచి A సర్టిఫికెట్ పొందినట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్ లో వెల్లడించగా అందరూ అది చూసి షాకయ్యారు.
రజినీకాంత్ 50 ఏళ్ల కెరీర్లోనే మొదటిసారి
ఈ విషయం అందరికీ షాక్ కలిగించడానికి కారణం రజనీ 50 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఏ సినిమాకూ ఆయన A సర్టిఫికెట్ ను అందుకుంది లేదు. కూలీ సినిమాకు మొదటిసారి రజినీ A సర్టిఫికెట్ ను అందుకున్నారు. దీంతో ఈ విషయంలో ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. అసలే కూలీ సినిమా కోలీవుడ్ లో మొదటి రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ఆశ పడుతుంటే ఇప్పుడు ఈ A సర్టిఫికెట్ ఏంటని అంతా ఆలోచనలో పడ్డారు.
రూ.1000 కోట్ల క్లబ్ పై సందేహాలు
ఇప్పటివరకు A సర్టిఫికెట్ తో రిలీజైన ఏ సినిమా రూ.1000 కోట్ల మార్కును తాకకపోవడంతో కూలీ కూడా వాటిలానే మిగిలిపోతుందేమోననే డౌట్స్ ఆడియన్స్ లో మొదలయ్యాయి. దానికి తోడు రీసెంట్ గా మేకర్స్ రివీల్ చేసిన రెండు వయొలెన్స్ పోస్టర్లు కూడా కూలీ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కాదని సూచించేలా ఉన్నాయి. రీసెంట్ గా కూలీ ప్రమోషన్స్ లో లోకేష్ మాట్లాడుతూ, తనకు బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే ఆడియన్స్ తనను నమ్మి తన టికెట్ కోసం పెట్టే రూ.150కే ఎక్కువ విలువనిస్తానని, రూ.1000 కోట్ల క్లబ్ గురించి చెప్పేపన్లేదని అన్నారు.
ఎక్కడా కాంప్రమైజ్ అవను
తాను తీసే సినిమాకు సంబంధించి తానెక్కడా రాజీపడనని, వయొలెన్స్ కూడా అందుకు మినహాయింపు కాదని చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే కూలీ సినిమాకు ఎ సర్టిఫికెట్ వస్తుందని లోకేష్ కు ముందే తెలుసని, ముందు నుంచి అతను తన సిద్ధాంతలకు కట్టుబడి ఉన్నారని అర్థమవుతుంది. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ లాంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
