చేతులారా హైప్ ని చంపుకుంటున్న లోకేష్
సాధారణంగా ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలి. 'విక్రమ్' క్లైమాక్స్ లో రోలెక్స్ ఎంట్రీ చూశాక, జనం వెంటనే ఖైదీ 2నో, సూర్యతో 'రోలెక్స్' స్టాండలోన్ మూవీనో, లేదా విక్రమ్ 2నో వస్తుందని ఆశపడ్డారు.
By: M Prashanth | 28 Nov 2025 12:34 PM IST'విక్రమ్' సినిమాతో ఇండియన్ స్క్రీన్ మీద ఒక కొత్త చరిత్ర సృష్టించాడు లోకేష్ కనకరాజు. అప్పటి వరకు కేవలం హాలీవుడ్, బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ ను మన నేటివిటీకి తగ్గట్టుగా మలిచాడు. కమల్ హాసన్, సూర్య, కార్తీ.. ఇలా స్టార్లందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి LCU అనే బ్రాండ్ క్రియేట్ చేసినప్పుడు, ప్రేక్షకుల్లో కిక్కు హై రేంజ్ కి వెళ్లింది. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం నీరుగారిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
సాధారణంగా ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలి. 'విక్రమ్' క్లైమాక్స్ లో రోలెక్స్ ఎంట్రీ చూశాక, జనం వెంటనే ఖైదీ 2నో, సూర్యతో 'రోలెక్స్' స్టాండలోన్ మూవీనో, లేదా విక్రమ్ 2నో వస్తుందని ఆశపడ్డారు. ఆ హైప్ ను వాడుకుని ఉంటే బాక్సాఫీస్ రికార్డులు వేరేలా ఉండేవి. కానీ లోకేష్ మాత్రం ఆ అంచనాలను పక్కన పెట్టి, అనవసరమైన ప్రయోగాలు చేస్తూ ఆ యూనివర్స్ కు ఉన్న క్రేజ్ ను తగ్గిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి.
విజయ్ తో చేసిన 'లియో' సినిమాను బలవంతంగా ఎల్ సీ యూలో ఇరికించారనే టాక్ అప్పట్లో గట్టిగానే వినిపించింది. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు సరికదా, యూనివర్స్ మీద ఉన్న నమ్మకాన్ని కొంచెం దెబ్బతీసింది. ఆ తర్వాత రజినీకాంత్ తో చేసిన 'కూలీ' సినిమా ఫలితం కూడా బెడిసికొట్టింది. ఇది LCU కాకపోయినా, దర్శకుడి గ్రాఫ్ ను పడేసింది. ఇలా వరుసగా అంచనాలు తప్పుతుండటంతో అసలు లోకేష్ మాస్టర్ ప్లాన్ ఏంటి అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి.
పోనీ ఇప్పుడైనా దారిలో పడతారా అంటే, మళ్ళీ ఇంకో కొత్త రూట్ తీసుకున్నారు. పెండింగ్ లో ఉన్న LCU సినిమాలను పక్కన పెట్టి, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వస్తోంది. ఇది కూడా ఆ యూనివర్స్ లో భాగం కాదని సమాచారం. అసలు మెయిన్ స్టోరీని, ఆడియన్స్ కోరుకుంటున్న క్యారెక్టర్లను వదిలేసి, ఇలా పక్క దారుల్లో వెళ్తుంటే.. అసలు సిసలైన 'రోలెక్స్', 'ఢిల్లీ' పాత్రలపై జనం ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది.
మరోవైపు LCU బ్రాండ్ ను వాడుకుని వేరే దర్శకులతో సినిమాలు తీయించడం కూడా ప్రేక్షకులకు రుచించడం లేదు. రాఘవ లారెన్స్ హీరోగా, వేరే దర్శకుడితో వస్తున్న 'బెంజ్' సినిమా LCU లో భాగమే అని చెప్పినా, ఆడియన్స్ లో మాత్రం అస్సలు ఆసక్తి లేదు. లోకేష్ డైరెక్షన్ లేకుండా కేవలం యూనివర్స్ ట్యాగ్ ఉంటే సరిపోదని, కంటెంట్ ముఖ్యమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి లోకేష్ తన చేతులారా LCU హైప్ ను కిల్ చేస్తున్నాడా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతోంది. ఇప్పటికైనా ఆయన మేల్కొని ఖైదీ, విక్రమ్ సీక్వెల్స్ మీద ఫోకస్ పెడితే బాక్సాఫీస్ వద్ద మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేయవచ్చు. మరి లోకేష్ ఏం చేస్తాడో చూడాలి.
