ఆ స్టార్ల కలయిక లోకేష్ కోసం కాదా?
కూలీ కోసం వివిధ భాషల నుంచి స్టార్లను తీసుకొచ్చి సినిమాలో భాగం చేసి కూలీపై విపరీతమైన అంచనాలు పెంచారు లోకేష్.
By: Sravani Lakshmi Srungarapu | 18 Sept 2025 8:15 AM ISTలోకేష్ కనగరాజ్. తీసింది తక్కువ సినిమాలే. కానీ క్రేజ్, డిమాండ్ మాత్రం లెక్కలేనంత. సినిమాటిక్ యూనివర్స్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో సినిమాలు చేస్తూ తన సినిమాలకు మంచి హైప్ ను తెచ్చుకునే లోకేష్ దర్శకత్వంలో తమ హీరో కనీసం ఒక్కసారైనా వర్క్ చేయాలని అందరు హీరోల ఫ్యాన్స్ కోరుకుంటారు.
మా నగరంతో డైరెక్టర్ గా మొదటి సక్సెస్
లోకేష్ కు అంత క్రేజుంది. సినిమా సినిమాకీ హైప్ పెంచడం, ఆ తర్వాత వాటితో ఆ అంచనాలకు తగ్గ రిజల్ట్ ఇవ్వలేకపోవడం లోకేష్ కు మామూలైపోయింది. మా నగరం సినిమాతో డైరెక్టర్ గా మొదటి సక్సెస్ ను అందుకున్న లోకేష్, ఆ తర్వాత కార్తీతో తీసిన ఖైదీతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఖైదీతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ తర్వాత విజయ్ తో మాస్టర్, కమల్ తో విక్రమ్ చేశారు.
భారీ హైప్ తో వచ్చిన లియో, కూలీ
అయితే లోకేష్ నుంచి ఆఖరిగా వచ్చిన రెండు సినిమాలూ రిలీజ్ కు ముందు భారీ క్రేజ్ తో వచ్చాయి. విక్రమ్ హీరోగా తెరకెక్కిన లియో సినిమాకు రిలీజ్ కు ముందు ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. రిలీజయ్యాక లియో హిట్ అయినప్పటికీ ముందు ఉన్న హైప్ కు తగ్గ హిట్ అయితే కాలేదు. ఇక రీసెంట్ గా రజినీకాంత్ తో చేసిన కూలీ గురించి మాట్లాడాలంటే ఆ సినిమా ఎంత క్రేజ్ తో వచ్చిందో చెప్పే పన్లేదు.
కార్తీతో ఖైదీ2
కూలీ కోసం వివిధ భాషల నుంచి స్టార్లను తీసుకొచ్చి సినిమాలో భాగం చేసి కూలీపై విపరీతమైన అంచనాలు పెంచారు లోకేష్. కానీ కూలీ రిలీజయ్యాక సినిమా చూసిన అందరూ మూవీలో లోకేష్ మార్క్ మిస్సైందని చెప్పారు. అయితే కూలీ ప్రమోషన్స్ లో లోకేష్ తన నెక్ట్స్ మూవీగా కార్తీతో ఖైదీకి సీక్వెల్ గా ఖైదీ2 చేస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ కూలీ రిలీజయ్యాక తన నెక్ట్స్ మూవీ ఖైదీ2 కాదని, రజినీకాంత్- కమల్ హాసన్ తో కలిసి ఓ మల్టీస్టారర్ ను చేయబోతున్నారని అన్నారు.
లోకేష్ నెక్ట్స్ ఏంటి?
సడెన్ గా రజినీ- కమల్ సినిమా వార్తల్లోకి రావడంతో ఖైదీ2 ఆగిపోయిందని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఖైదీ2 సినిమా ఆగిపోలేదని, లోకేష్ నెక్ట్స్ చేయబోయే సినిమా కార్తీతో, అది కూడా ఖైదీ2నే అని అంటున్నారు. అంతేకాదు, రజినీ- కమల్ చేయనున్న మల్టీస్టారర్ కు డైరెక్టర్ కూడా లోకేష్ కాదని, అందుకే లోకేష్ ఖైదీ2 వర్క్ ను స్టార్ట్ చేశారని, నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో ఖైదీ2 మూవీ మొదలవుతుందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత రజినీ- కమల్ కాంబినేషన్ లో సినిమా చేయాలనే ఆలోచనే లోకేష్‌ది. మరి ఇప్పుడు డైరెక్టర్ అతను కాదంటే ఆ మల్టీస్టారర్ ను ఎవరు డైరెక్ట్ చేయనున్నారు? ఒకవేళ లోకేష్ కథ ఇస్తే వేరే డైరెక్టర్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తారా అంటే ఇద్దరు స్టార్లను డైరెక్ట్ చేసే ఛాన్స్ ను లోకేష్ మిస్ చేసుకోరు. లేదంటే కూలీ రిజల్ట్ చూసి సదరు హీరోలే తమ ఆలోచనను మార్చుకున్నారా? ఏదైనా ఈ విషయంలో అసలు విషయం ఏంటనేది తెలియాల్సి ఉంది.
