లోకేష్ ఆ మాటకు కట్టుబడి ఉన్నాడా?
ప్రారంభ సినిమాలకు వేర్వేరు సంగీత దర్శకులతో పని చేసిన లోకేష్ కనగరాజ్ ఇటీవల అనిరుధ్ రవిచందర్ తో కలిసి పని చేస్తున్నాడు.
By: Sivaji Kontham | 2 Sept 2025 9:19 AM ISTప్రారంభ సినిమాలకు వేర్వేరు సంగీత దర్శకులతో పని చేసిన లోకేష్ కనగరాజ్ ఇటీవల అనిరుధ్ రవిచందర్ తో కలిసి పని చేస్తున్నాడు. లోకేష్ దర్శకత్వం వహించిన ఇటీవలి నాలుగు వరుస సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించాడు. కానీ అంతకుముందు `ఖైదీ` సినిమా కోసం సామ్ సిఎస్‌తో కలిసి పని చేసాడు లోకేష్. ఆ సినిమా రీరికార్డింగ్, పాటలు సినిమా విజయానికి ప్లస్ అయ్యాయి. ఇప్పుడు `ఖైదీ 2` కోసం తిరిగి సామ్ సీఎస్ నే ఎంచుకుంటాడా లేక ఎవరిని ఎంపిక చేయబోతున్నాడు? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఖైది సినిమా సీక్వెల్ ని తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్ ఈసారి అనిరుధ్ రవిచంద్రన్ ని ఎంపిక చేస్తాడంటూ మీడియాలో కథనాలొస్తున్నాయి.
అయితే ఈ కథనాల్లో ఎలాంటి నిజం లేదని తాజాగా రివీలైంది. ఒక తమిళ మీడియా కథనం ప్రకారం... ఖైది 2 కోసం తిరిగి సామ్ సి.ఎస్ ని బరిలో దించాలని లోకేష్ కనగరాజ్ ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అతడు హీరోగా నటించే సినిమాకి, అలాగే దర్శకుడిగా రూపొందించే సినిమాలకు అనిరుధ్ రవిచందర్ తో కలిసి పని చేయాలని భావిస్తున్నాడు. తాను భవిష్యత్ లో అనిరుధ్ తో తప్ప ఇంకెవరితోను పని చేయనని లోకేష్ ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. ఆ మాటకు అతడు కట్టుబడి ఉన్నాడు. ఒక్క `ఖైది 2` తప్ప ఇతర సినిమాలన్నిటికీ అనిరుధ్ ని ఎంపిక చేయాలనే పట్టుదలగా ఉన్నట్టు తెలిసింది.
తదుపరి లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ లో హీరోగా ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు శ్రుతిహాసన్ తో కలిసి ఒక సింగిల్ ఆల్బమ్ లో నటించినప్పుడే లోకేష్ లోని అసలు హీరో బయటికొచ్చాడు. ముఖానికి రంగేసుకుని అందమైన కథానాయికల సరసన నటిస్తే ఉండే కిక్కేంటో తెలుసుకున్నాడు. అందుకే ఇప్పుడు అనుకున్నదే తడవుగా తనను హీరోని చేసే దర్శకుడిని కూడా వెతికి పట్టుకున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ హీరోగా మారుతున్నాడు. ఒకసారి హీరోగా సక్సెసైతే ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడనే సందేహం ఇన్ సైడ్ సర్కిల్స్ లో వ్యక్తమైంది.
