Begin typing your search above and press return to search.

క్రేజీ కాంబో... అప్పుడు కావాలన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు!

విక్రమ్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఆయనతో వర్క్ చేసేందుకు దాదాపు అందరు హీరోలు ఉవ్విల్లూరిన విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   6 Nov 2025 11:59 AM IST
క్రేజీ కాంబో... అప్పుడు కావాలన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు!
X

ఖైదీ సినిమాతో దర్శకుడిగా ఒక్కసారిగా పాన్‌ ఇండియా రేంజ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌. ఈ తమిళ దర్శకుడు ఖైదీ తర్వాత వెంటనే సూపర్‌ స్టార్‌ విజయ్‌తో తీసిన మాస్టర్‌ సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో విజయ్‌ని చూపించిన తీరు, విలన్‌ను ప్రజెంట్‌ చేసిన తీరుకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ అంటూ తనకంటూ ప్రత్యేకంగా సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్‌ చేసి అందులో యూనివర్శల్ స్టార్‌ కమల్‌ హాసన్‌తో 'విక్రమ్‌' సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే. కమల్‌ కెరీర్‌ ఖతం అవుతుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా విక్రమ్‌ భావిజయాన్ని సొంతం చేసుకుని ఆయన పూర్వపు ఉత్తేజంను పొందాడు. విక్రమ్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఆయనతో వర్క్ చేసేందుకు దాదాపు అందరు హీరోలు ఉవ్విల్లూరిన విషయం తెల్సిందే.

లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో...

కోలీవుడ్‌ హీరోలు మాత్రమే కాకుండా టాలీవుడ్‌ హీరోలు కూడా కొందరు లోకేష్ కనగరాజ్ తో సినిమాను చేసేందుకు ఆసక్తి చూపించారు. ఒకరు ఇద్దరు తమ మనుషులను ఏకంగా లోకేష్ వద్దకు పంపించారు అనే వార్తలు వచ్చాయి. లోకేష్ తెలుగు హీరోలతోనూ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించాడు. అయితే ఆయనకు ముందుగా ఉన్న కమిట్‌మెంట్స్ను పూర్తి చేయాల్సిన అవసరం ఉండటంతో అప్పుడు తెలుగు సినిమాను కమిట్‌ కాలేదు. ఇప్పుడు తెలుగు సినిమాను చేయాలని అనుకున్నా, తెలుగు హీరోలతో టచ్‌ లోకి వెళ్లాలని ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఆయన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. ముఖ్యంగా రజనీకాంత్‌ తో లోకేష్ కనగరాజ్ రూపొందించిన కూలీ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. స్టార్‌ కాస్ట్‌కి ఓపెనింగ్స్ బాగానే ఉన్నా సినిమాకు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ దక్కలేదు.

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ల మల్టీస్టారర్‌..

కూలీ సినిమా మేకింగ్‌ సమయంలోనే అమీర్‌ ఖాన్‌ తో ఈయన సినిమా అనుకున్నారు. కానీ ఆ సినిమా ఫైనల్‌ కాలేదు. అంతే కాకుండా కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లు హీరోలుగా ఒక భారీ మల్టీస్టారర్‌ సినిమాను ప్లాన్‌ చేశారు. కానీ కూలీ సినిమా ఫలితం కారణంగా ఆ సినిమా అటకెక్కింది. రజనీకాంత్‌ హీరోగా కమల్‌ హాసన్ నిర్మాణంలో సుందర్‌ సి దర్శకత్వంలో ఒక సినిమా కన్ఫర్మ్‌ అయింది. ఆ ప్రాజెక్ట్‌ను లోకేష్ కనగరాజ్‌ చేయాల్సింది అంటున్నారు. ఇక రెండు మూడు ఏళ్ల క్రితం అజిత్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడు లోకేష్ కనగరాజ్‌ మా అభిమాన హీరోతో సినిమా చేస్తాడా అని ఎదురు చూశారు. త్వరలో అది సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ సమయంలో అజిత్‌ ఫ్యాన్స్ బాబోయ్ వద్దు అంటున్నారు. అజిత్‌ తో లోకేష్ కనగరాజ్ సినిమా ఇప్పుడు అవసరం లేదు అన్నట్లుగా అభిమానులు తెగ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అజిత్‌ హీరోగా లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో...

రజనీకాంత్‌, కమల్‌ హాసన్ కాంబోలో చేయాల్సిన బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్ మూవీ క్యాన్సల్‌ కావడంతో చేసేది లేక ఖైదీ సినిమా సీక్వెల్‌ ను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని లోకేష్ కనగరాజ్‌ అనుకుంటున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు కార్తీ సీక్వెల్‌ కు సంబంధించిన డేట్లు ఇవ్వడం లేదట. దాంతో అజిత్‌ తో సినిమాకు లోకేష్ కనగరాజ్‌ రెడీ అవుతున్నాడు అని, ఇటీవలే అజిత్‌ కు ఒక కథను లోకేష్‌ కనగరాజ్‌ చెప్పడం, ఆయన నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం అన్నీ జరిగి పోయాయట. వచ్చే ఏడాది ఆరంభంలోనే వీరి కాంబోలో మూవీ పట్టాలెక్కుతుందని కోలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్‌ మాత్రం ఇప్పుడు లోకేష్ దర్శకత్వంలో సినిమా విషయంలో అజిత్‌ ఆలోచించుకోవాలంటూ సూచిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మరి ఇంతకు ఈ సినిమా సెట్స్ పైకి ఎక్కేనా? లేదా అభిమానుల కోరిక మేరకు అజిత్‌ సినిమాను పక్కన పెడుతాడా అనేది చూడాలి.