Begin typing your search above and press return to search.

తొలి సినిమాతోనే సెంచ‌రీ కొట్టిన సంచ‌ల‌నం!

తమిళ చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటుడిగా తెరంగేట్రం చేసిన‌ తొలి చిత్రం `డిసి` బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.

By:  Srikanth Kontham   |   21 Aug 2026 10:39 PM IST
తొలి సినిమాతోనే సెంచ‌రీ కొట్టిన సంచ‌ల‌నం!
X

తమిళ చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటుడిగా తెరంగేట్రం చేసిన‌ తొలి చిత్రం `డిసి` బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.





ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే? శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన ప్రసిద్ధ బెంగాలీ నవల `దేవదాస్` కొత్త రూపం. అయితే అరుణ్ మాథేశ్వరన్ ఈ కథను సంప్రదాయబద్ధంగా కాకుండా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో అత్యంత ఆసక్తికరంగా మలిచారు. ఇందులో లోకేష్ కనగరాజ్ దేవదాస్ అలియాస్ దాస్ అనే గ్యాంగ్‌స్టర్‌గా నటించగా, వామికా గబ్బి ..సంజన కృష్ణమూర్తి హీరోయిన్ల‌గా నటించారు. చిత్రంలో లోకేష్ కనగరాజ్ నటన ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. గ్యాంగ్ సభ్యుడిగా ఏదైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న పాత్రలో ఆయన చూపిన పరిణితి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచింది. సన్నివేశాలకు తగ్గట్టుగా ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేసింది. ఒక వైపు యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటూనే మరోవైపు పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాలను ముఖ్యంగా దాస్, పార్వతి , చంద్రల మధ్య ఉన్న సంబంధాన్ని దర్శకుడు అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. క్లాసిక్ కథను ఆధునిక ప్రేక్షకులకు నచ్చేలా మార్చడంలో దర్శకుడు చూపిన ప్రతిభ భారీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.

ఈ విజయంతో తమిళ పరిశ్రమలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా `డిసి` నిలిచింది. విజయ్ నటించిన `జన నాయగన్`, సూర్య నటించిన `కరుప్పు` వంటి పెద్ద సినిమాల తర్వాత ఈ సినిమా నాలుగో స్థానంలో ఉండటం విశేషం. ప‌రిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చిన పెద్ద సినిమాలకు గట్టి పోటీనిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

చిత్రం విజయంపై దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ సంతోషం వ్యక్తం చేసారు. అలాగే ప్రేక్షకులిచ్చిన ఈ అనూహ్య స్పందన పట్ల లోకేష్ కనగరాజ్ కృతజ్ఞతలను తెలిపారు. సోషల్ మీడియాలో అభిమానుల నుండి వస్తున్న అభినందనలు చిత్ర యూనిట్‌ను మరింత ఉత్సాహపరుస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు మూడవ వారంలో కూడా కొనసాగుతుందనే నమ్మకాన్ని ట్రేడ్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.