లోకేష్ దానిపై ఫోకస్ చేస్తేనే బెటర్!
వరుస సక్సెస్‌లతో ఇండియన్ సినిమాలో సూపర్ క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.
By: Sravani Lakshmi Srungarapu | 21 Sept 2025 12:00 AM ISTవరుస సక్సెస్‌లతో ఇండియన్ సినిమాలో సూపర్ క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. మా నగరం సినిమాతో డైరెక్టర్ గా మొదటి సక్సెస్ ను అందుకున్న లోకేష్ ఆ తర్వాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో తన సక్సెస్ ను కంటిన్యూ చేశారు. లియో తర్వాత ఏకంగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను హీరోగా పెట్టి కూలీ సినిమా చేశారు లోకేష్.
రజినీతో ఆగకుండా ఆ సినిమాలో ఎంతోమంది స్టార్లను భాగం చేసి కూలీపై విపరీతమైన అంచనాలను పెంచారు లోకేష్. భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూలీ సినిమా ఆశించిన ఫలితాల్ని అందుకోలేకపోయింది. కూలీ చూసిన వాళ్లంతా ఇది లోకేష్ స్థాయి సినిమా కాదని, లోకేష్ కెరీర్లో వచ్చిన అతి తక్కువ స్థాయి సినిమా ఇదేనని అన్నారు.
కూలీతో విమర్శల పాలైన లోకేష్
కూలీ రిలీజ్ ముందు వరకు లోకేష్ ను విపరీతంగా పొగిడిన ప్రేక్షకులు, నెటిజన్లే కూలీ రిలీజ్ తర్వాత విమర్శిస్తున్నారు. దానికి తోడు కూలీ రిలీజ్ తర్వాత తాను కేవలం ఆడియన్స్ అంచనాలను అందుకోవడం కోసం మాత్రమే సినిమాలు చేయలేనని లోకేష్ చెప్పడం ఆ విమర్శలకు ఆజ్యం పోసింది. వీటన్నింటి నుంచీ బయటపడటానికి లోకేష్ అర్జెంట్ గా సాలిడ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సినిమా
అయితే లోకేష్ ఓ వైపు డైరెక్టర్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోగా సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ మిల్లర్, సాని కాయిధమ్ సినిమాల ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ ఓ సినిమా చేయాల్సి ఉండగా, కూలీ రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందన్నారు. దీంతో లోకేష్ డైరెక్టర్ గా కాకపోయినా హీరోగా అయినా తన మార్క్ చూపిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను పరిచయం చేసి అందులో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేస్తున్న లోకేష్ కూలీ సినిమాతో తాను సంపాదించుకున్న పేరంతటినీ పోగొట్టుకున్నారు. స్టార్ క్యాస్టింగ్ పై మాత్రమే ఫోకస్ చేయడంతో కథ పక్క దారి పట్టి కూలీ ఫెయిలైంది. కాబట్టి లోకేష్ మళ్లీ హిట్ కొట్టాలంటే తనకు బాగా పట్టున్న సినిమాటిక్ యూనివర్స్ తోనే సాధ్యమవుతుందని, అందుకే లోకేష్ ఇకమీదట దానిపైనే ఫోకస్ చేస్తే బావుంటుందని సూచిస్తున్నారు. కాగా లోకేష్ తన తర్వాతి ప్రాజెక్టును కార్తీతో ఖైదీకి సీక్వెల్ గా ఖైదీ2 చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఖైదీ2 లోకేష్ కు డైరెక్టర్ గా పూర్వ వైభవాన్ని తెస్తుందని అందరూ నమ్ముతున్నారు. చూడాలి మరి ఏమవుతుందో.
