Begin typing your search above and press return to search.

A రేటింగ్ కార‌ణంగా ర‌జ‌నీ సినిమాకు 50 కోట్లు న‌ష్టం?

ర‌జ‌నీకాంత్ న‌టించిన `కూలీ` చిత్రం మిశ్రమ సమీక్షలతో ర‌న్ అయినా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది.

By:  Sivaji Kontham   |   29 Jan 2026 10:08 AM IST
A రేటింగ్ కార‌ణంగా ర‌జ‌నీ సినిమాకు 50 కోట్లు న‌ష్టం?
X

సూపర్ స్టార్ రజనీకాంత్ - లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబినేషన్‌లో వచ్చిన `కూలీ` మిశ్ర‌మ సమీక్ష‌లు అందుకున్నా, ర‌జ‌నీ మానియాతో భారీ ఓపెనింగుల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా ఒక ప్ర‌త్యేక అంశం కార‌ణంగా తీవ్రంగానే న‌ష్ట‌పోయింది. ఈ న‌ష్టం ఏమిటి? దీనికి అస‌లు కార‌ణ‌మేమిటో ఇప్ప‌టివ‌ర‌కూ లోకేష్‌ వెల్ల‌డించ‌లేదు. తాజా ఇంట‌ర్వ్యూలో లోకేష్ క‌నగ‌రాజ్ మాట్లాడుతూ.. సూప‌ర్ స్టార్ న‌టించిన కూలీ చిత్రానికి సెన్సార్ బోర్డు `A` (పెద్ద‌ల‌కు మాత్ర‌మే) రేటింగ్ ఇవ్వడం వల్ల సుమారు రూ.40 -50 కోట్ల వరకు వసూళ్లు తగ్గాయని అన్నారు.

సెన్సార్ బోర్డు సినిమాలో సుమారు 35 కట్స్ సూచించింది. ముఖ్యంగా కూలీ చిత్రంలో చూపించిన `ఎలక్ట్రిక్ క్రిమేషన్` సీన్ స‌హా కొన్ని హింసాత్మక దృశ్యాలపై బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సీన్లను తొలగిస్తే సినిమా ఇంపాక్ట్ తగ్గిపోతుందని భావించిన లోకేష్ వాటిని ఎడిట్ చేయడానికి ఒప్పుకోలేదు. ఫలితంగా సినిమాకు `ఏ` రేటింగ్ వచ్చింది. దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు థియేటర్లకు రావడం తగ్గింది. దాని కార‌ణంగా కొంత‌ రెవెన్యూ కోల్పోయామని ఆయన తెలిపారు.

ర‌జ‌నీకాంత్ న‌టించిన `కూలీ` చిత్రం మిశ్రమ సమీక్షలతో ర‌న్ అయినా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఈ సినిమాను దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించడంతో అది కాస్ట్ ఫెయిల్యూర్ గా మారి, కొంద‌రు పంపిణీదారుల‌కు అంత‌గా లాభాలు రాలేద‌న్న చ‌ర్చా సాగింది.

లోకేష్ కనగరాజ్ తదుపరి చిత్రాలు

లోకేష్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. అత‌డి లైన‌ప్ ప‌రిశీలిస్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో లోకేష్ క‌న‌గ‌రాజ్ ఒక సినిమా చేయబోతున్నా (తాత్కాలికంగా #AA23) మ‌ని ప్ర‌క‌టించారు. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా తర్వాత కార్తీతో `ఖైదీ 2` షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇది LCU -లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్శ్ లో భాగం. సూర్యతో `రోలెక్స్- స్టాండ్ అలోన్` సినిమా, కమల్ హాసన్‌తో `విక్రమ్ 2` కూడా ప్లానింగ్ ద‌శ‌లో ఉన్నాయి. అలాగే లారెన్స్ ప్రధాన పాత్రలో లోకేష్ కథ అందిస్తున్న చిత్రం `బెంజ్`పైనా ఉత్కంఠ నెల‌కొంది.

న‌ట‌న‌లోకి వ‌స్తున్నాడా?

నిజానికి లోకేష్ క‌న‌గ‌రాజ్ కేవ‌లం ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాదు.. న‌టుడు కూడా. ఇంత‌కుముందు శ్రుతిహాస‌న్ తో క‌లిసి ఓ సింగిల్ ఆల్బ‌మ్ లో కూడా న‌టించాడు. అత‌డు రజనీకాంత్‌కు పెద్ద ఫ్యాన్. `కూలీ` షూటింగ్ సమయంలో రజనీకాంత్ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని.. తన పనితీరును మెచ్చుకున్నారని లోకేష్ ఎప్పుడూ చెబుతుంటారు. లోకేష్ త‌దుప‌రి అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే రజనీకాంత్ తదుపరి చిత్రాల్లో లోకేష్ నటిస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

రజనీకాంత్ -కమల్ హాసన్‌లతో లోకేష్ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ వారు `లైట్ హార్టెడ్` (వినోదాత్మక) సినిమా కోరుకోగా, తాను కేవలం యాక్షన్ చిత్రాలే తీయగలనని చెప్పి ఆ ప్రాజెక్ట్ నుండి లోకేష్ తప్పుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాను సిబి చక్రవర్తి డైరెక్ట్ చేస్తున్నారు.