కూలి దెబ్బ కొట్టినా రెమ్యునరేషన్ తగ్గలేదా..?
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమా ఎవరితో ఉండబోతుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
By: M Prashanth | 13 Jan 2026 9:47 AM ISTకోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమా ఎవరితో ఉండబోతుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఆయన ఒక సినిమా చేసే అవకాశం ఉందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే, లోకేష్ తీసుకోబోయే పారితోషికం గురించి వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
నిజానికి లోకేష్ లియో, కూలీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించినప్పటికీ, కంటెంట్ పరంగా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయనే అభిప్రాయాలు ఉన్నాయి. సాధారణంగా ఒక దర్శకుడి సినిమాలకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పుడు వారి డిమాండ్ కొంత తగ్గుతుంది. కానీ లోకేష్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. బన్నీతో చేయబోయే సినిమా కోసం అతను తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఫిలిం నగర్ టాక్ ప్రకారం, రజినీకాంత్ సినిమాకు 50 కోట్లు తీసుకున్న లోకేష్, అల్లు అర్జున్ సినిమా కోసం ఏకంగా 75 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుల జాబితాలో ఆయన చేరిపోతారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని, లోకేష్ చెప్పిన లైన్ బన్నీకి నచ్చిందని అనుకుంటున్నప్పటికీ, ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు.
మరోవైపు లోకేష్ తన 'ఖైదీ 2' ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి మరీ ఈ సినిమా వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. రజినీకాంత్‌తో అనుకున్న మరో ప్రాజెక్ట్ సెట్ కాకపోవడం వల్లే ఈ క్రేజీ కాంబో లైన్ లోకి వచ్చిందని కొందరి అంచనా. అయితే బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సాధారణంగా ఇలాంటి పెద్ద కాంబినేషన్లు సెట్ అయ్యేటప్పుడు రెమ్యూనరేషన్ గురించి రకరకాల నంబర్లు బయటకు రావడం సహజం. ప్రస్తుతం వినిపిస్తున్న 75 కోట్ల నంబర్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం ఇది ఒక భారీ పాన్ ఇండియా ఫిల్మ్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక మరోవైపు బన్నీ లిస్టులో మరికొందరు దర్శకులు కూడా ఉన్నారు. రీసెంట్ గా త్రివిక్రమ్ తో మళ్ళీ కలవబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. 1000 కోట్లతో మైథలజికల్ సినిమా చేయనున్నట్లు రకరకాల వార్తలు వచ్చాయి. అలాగే సందీప్ రెడ్డి వంగాతో కూడా ఓ సినిమా ఉంది. మరి ఈ లైనప్ లో లోకేష్ ఎప్పుడు కలుస్తాడో చూడాలి.
