ఆల్ టైం రికార్డ్ కొట్టేసిన చిన్న సినిమా..!
గత నెలలో మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన 'లోకా' సినిమా ఏకంగా ఆల్ టైం రికార్డ్‌ను నమోదు చేసింది.
By: Ramesh Palla | 16 Sept 2025 11:10 AM ISTఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే రికార్డ్‌లు నమోదు అయ్యేవి, స్టార్ హీరోల సినిమాలు మాత్రమే భారీ వసూళ్లు నమోదు చేసేవి, కానీ ఇప్పుడు అలా కాదు. స్టార్ హీరోల సినిమాల్లో కంటెంట్ లేకుంటే బొక్క బోర్లా పడుతున్నాయి, బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లు రాబట్టలేక పోతున్నాయి. ఇదే సమయంలో చిన్న హీరోల సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు మంచి కంటెంట్ తో వస్తే భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. కంటెంట్‌కు ప్రేక్షకులు ఇప్పుడు ఫిదా అవుతున్నారు. స్టార్ కాస్ట్ అవసరం లేదు, అందులో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ అక్కర్లేదు, కేవలం కంటెంట్ బలంగా ఉంటే, ఎంగేజింగ్‌గా ఉంటే ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సర్‌ప్రైజింగ్ వసూళ్లు సాధిస్తున్న విషయం తెల్సిందే.
మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన లోకా
గత నెలలో మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన 'లోకా' సినిమా ఏకంగా ఆల్ టైం రికార్డ్‌ను నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా చూడని నెంబర్స్ ను చూసే దిశగా పరుగులు తీస్తోంది. అంతే కాకుండా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో లో ఇప్పటి వరకు తుడారుమ్ సినిమా 4.51 మిలియన్‌ల టికెట్ల బుకింగ్స్ తో నెం.1 స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఆ స్థానంను లోకా దక్కించుకుంది. మొన్న వీకెండ్ వరకు 4.51 మిలియన్‌ల టికెట్లు బుకింగ్ పూర్తి చేసుకుంది. లాంగ్ రన్‌లో 5 మిలియన్‌ల టికెట్లు బుక్ అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. బుక్ మై షో ద్వారా ఒక మలయాళ సినిమాకు ఈ స్థాయిలో టికెట్ల బుక్ కావడం అనేది రికార్డ్‌గా చెబుతున్నారు. మంజుమ్మెల్ బాయ్స్ సినిమాకు దాదాపుగా 4.30 మిలియన్‌ల టికెట్లు బుక్ మై షో ద్వారా బుక్ అయ్యాయి.
మలయాళంలో స్టార్ హీరోల సినిమాల రికార్డ్‌లు బ్రేక్
ఇక వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు సినిమా దాదాపు రూ.205 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కేవలం మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. తెలుగులోనూ సినిమాను ఆదరిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన డబ్బింగ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా లోకా నిలిచింది. మూడు వారాల తర్వాత కూడా ఆ మంచి దూకుడు మీద ఉన్న లోకా జోరు చూస్తూ ఉంటే లాంగ్ రన్‌లో సినిమా రూ.250 కోట్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన స్టార్ హీరోల రికార్డ్‌లను లోకా మెల్ల మెల్లగా బ్రేక్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ముందు ముందు మరిన్ని రికార్డ్‌లను లోకా సినిమా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ మలయాళ బాక్సాఫీస్ వర్గాల వారు, సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా లోకా
కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. లోకా యూనివర్శ్ లో మొత్తం అయిదు సినిమాలు రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇది లోకా : చాప్టర్ 1 - చంద్ర టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. తర్వాత రాబోతున్నది ఏంటి అంటూ అంతా ఇప్పటి నుంచే ఆసక్తిని కనబరుస్తున్నారు. కేవలం రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన లోకా 1 బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా రాబట్టడంతో పాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా రూ.50 కోట్లకు మించి రాబట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమా తో ఏకంగా రూ.200 కోట్ల లాభం అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మించిన విషయం తెల్సిందే. నిర్మాతగా తన టేస్ట్‌ను నిరూపించుకున్న దుల్కర్ సల్మాన్ ను ప్రేక్షకులు అభినందిస్తున్నారు.
