Begin typing your search above and press return to search.

'కొత్త లోక' కొత్త చరిత్ర.. సూపర్ స్టార్ మూవీకి బిగ్ షాక్!

అయితే కొత్త లోక మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ మూవీకి షాక్ ఇచ్చింది. ఆయన నటించిన ఎల్ 2: ఎంపురాన్ మూవీని వెనక్కి నెట్టింది.

By:  M Prashanth   |   20 Sept 2025 10:54 PM IST
కొత్త లోక కొత్త చరిత్ర.. సూపర్ స్టార్ మూవీకి బిగ్ షాక్!
X

యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో నటించిన కొత్త లోక చాప్టర్ 1 మూవీ కొత్త చరిత్ర సృష్టించింది. మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. ఆగస్టు 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాలుగు వారాలుగా మంచి వసూళ్లను రాబడుతోంది.

రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కొత్త లోక చాప్టర్ 1 సినిమా.. ఇప్పటి వరకు రూ.267 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అందులో కేరళ నుంచే రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఆ ఫీట్ సాధించిన రెండో సినిమాగా నిలిచింది. తుడరుమ్ రూ.119 కోట్ల వసూలు చేసి టాప్ లో ఉండగా.. లాంగ్ రన్ లో కొత్త లోక ఆ రికార్డును అధిగమించనుంది.

అయితే కొత్త లోక మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ మూవీకి షాక్ ఇచ్చింది. ఆయన నటించిన ఎల్ 2: ఎంపురాన్ మూవీని వెనక్కి నెట్టింది. మోహన్‌ లాల్ లీడ్ రోల్ లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించిన ఆ మూవీ ఇప్పటి వరకు మాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు (రూ.265.5 కోట్లు) రాబట్టిన మూవీగా ఉంది. ఆ రికార్డును ఇప్పుడు కొత్త లోక బద్దలు కొట్టింది.

ఎంపురాన్ ను దాటేసి ఆ సినిమాను రెండో స్థానంలోకి వెళ్లేలా చేసింది. ఎంపురాన్ రూ.265 కోట్లు వసూల్ చేసింది. అలా ఇప్పుడు మాలీవుడ్ లో కొత్త లోక అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా టాప్ లో కొనసాగుతుండగా, ఎంపురాన్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత సూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ రూ.243 కోట్లతో మూడో స్థానంలో ఉంది.

కాగా, కొత్త లోక మూవీని డైరెక్టర్ డొమినిక్ అరుణ్ తెరకెక్కించగా.. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ పై నిర్మించారు. నస్లెన్, చందు సలీం కుమార్ కీలక పాత్రలు పోషించారు. తమిళ కొరియోగ్రాఫర్ శాండీ విలన్ పాత్రలో నటించగా, దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ అతిథి పాత్రల్లో సందడి చేశారు.

అయితే రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ నెలకొనగా.. దాని మధ్యే మూవీ రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే సూపర్ రెస్పాన్స్ అందుకుంది. మలయాళంతో పాటు, ఇతర భాషల్లోని ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. తెలుగులో కూడా మంచి స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కొత్త లోక కాసుల వర్షం కురిపిస్తోంది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.