క్షమాపణలు చెప్పాల్సినంత పెద్ద తప్పు స్టార్ హీరో ఏం చేసాడు?
స్నేహితురాలు కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో దుల్కార్ సల్మాన్ నిర్మించిన సూపర్ హీరో చిత్రం `లోకా: చాప్టర్ వన్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 4 Sept 2025 12:00 AM ISTస్నేహితురాలు కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో దుల్కార్ సల్మాన్ నిర్మించిన సూపర్ హీరో చిత్రం `లోకా: చాప్టర్ వన్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కళ్యాణి కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంగా నిలవడంతో ఇప్పుడు ఇదే జోష్‌లో ఫ్రాంఛైజీలో తదుపరి చిత్రాలలో నటించేందుకు సిద్ధమవుతోంది. దుల్కార్ ఈ ఫ్రాంఛైజీని రాజీ లేకుండా ముందుకు నడిపించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాడు.
అయితే ఇలాంటి శుభతరుణంలో ఒక చిన్న అపశ్రుతి. ఈ సినిమాలోని ఒక యువకుడి పాత్ర కన్నడిగుల మనుసుల్ని గాయపరిచింది. సినిమా ఆద్యంతం ఆస్వాధించిన కర్ణాటక ప్రజలకు ఒకే ఒక్క డైలాగ్ మాత్రం చికాకు పెట్టింది. ఒక యువకుడిని తన తల్లి ఇలా అడుగుతుంది. ఎవరైనా బెంగళూరు అమ్మాయిని పెళ్లాడి జీవితంలో సెటిలవ్వాల్సిందిగా తల్లి కోరగా, అతడు ఇలా అంటాడు. ''నేను పెళ్లి చేసుకోనని చెప్పడం లేదు.. కానీ ఈ నగరానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోను.. ఎందుకంటే వారంతా చవకబారు..'' అని కామెంట్ చేస్తాడు. తన తల్లి సహా మహిళాధికారులు ఇతర మహిళలపైనా ద్వేషంతో ఉండే పాత్రలో అతడు నటించాడు. బెంగళూరు అమ్మాయిల క్యారెక్టర్‌ని అవమానిస్తూ చేసిన అతడి కామెంట్లు ప్రస్తుతం కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బ తీసాయి. కన్నడిగులు లోకా డైలాగ్ విషయంలోనే కాదు.. నస్లెన్ పాత్ర (సన్నీ నటించారు) పార్టీలు, మాదకద్రవ్యాల వాడకం సన్నివేశాలలో కనిపించడంపైనా ఎక్స్ లో విమర్శించారు.
అయితే కర్ణాటక వ్యాప్తంగా ఎదురైన ఈ నిరసనల సెగను గమనించిన దుల్కార్ సల్మాన్ అతడి టీమ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పారు. లోకాలో ఒక పాత్ర చెప్పిన డైలాగ్ కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బ తీసిందని మా దృష్టికి వచ్చింది. దానికి మేం హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాం. దీనిని వెంటనే తొలగిస్తున్నాం.. ఈ డైలాగ్ రాయడంలో ఎలాంటి ఉద్దేశాలు లేవు.. మాకు ప్రజలు చాలా ముఖ్యం`` అని ప్రకటించారు. వేఫేరర్ ఫిలింస్ ఇకపై ఇలాంటి తప్పు చేయదని కూడా దుల్కార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
