రూ.30 కోట్ల సినిమా రూ.200 కోట్లకు పరుగులు
కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 3 Sept 2025 12:37 PM ISTకరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. దేశవ్యాప్తంగా థియేటర్లకు జనాలు రావడం చాలా తగ్గిందని, 2020 కి ముందుతో పోల్చితే గడచిన ఐదేళ్లలో థియేటర్‌కి వచ్చే వారి సంఖ్య దాదాపుగా 40 నుంచి 50 శాతం తగ్గిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే చాలా సినిమాలు పాజిటివ్ టాక్ దక్కించుకున్నా మినిమం వసూళ్లు సైతం రాబట్టలేక పోతున్నాయి. బాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోల సినిమాలు మినిమం వసూళ్లు సాధించలేక కింద మీద పడ్డ సందర్భాలు ఈ ఐదేళ్ల కాలంలో చాలా చూశాం. అయితే కొన్ని చిన్న సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్‌ను దున్నేస్తున్నాయి. హిందీలోనే కాకుండా ఇతర భాషల్లోనూ వచ్చిన చిన్న సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుని వందల కోట్ల వసూళ్లు సాధించిన దాఖలాలు చాలానే ఉన్నాయి.
లోకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్
కంటెంట్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు అని మరోసారి నిరూపించిన చిన్న చిత్రం 'లోకా : చాప్టర్ 1'. ఈ సినిమా మలయాళంలో రూపొంది ప్రస్తుతం అన్ని భాషల్లోనూ తెగ సందడి చేస్తూ ఉంది. లేడీ ఓరియంటెడ్ మూవీగా విడుదలైన ఈ సినిమా మలయాళ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియంటెడ్ సినిమాగా ఇప్పటికే నిలిచింది. మొదటి వారం రోజుల్లో దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టడం ద్వారా అరుదైన రికార్డ్‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది. లాంగ్ రన్‌లో ఈజీగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు తమిళ ప్రేక్షకులు మాత్రం లోకా సినిమా ను చూశారు, రాబోయే రోజుల్లో ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఈ సినిమా ను చూడబోతున్నారు. కనుక ఖచ్చితంగా లోకా సినిమా రూ.200 కోట్లకు మించి వసూళ్లు రాబట్టడం పెద్ద కష్టం ఏమీ కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా
ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో వచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో చాలా తక్కువ మాత్రమే వంద కోట్ల వసూళ్లకు చేరువ అయ్యాయి. కానీ లోకా సినిమా మాత్రం ఏకంగా వంద కోట్ల వసూళ్లు క్రాస్ చేసి, రూ.200 కోట్ల వసూళ్ల దిశగా దూసుకు పోతుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వసూళ్లు సాధించడంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాగా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. లోకా సినిమాలో హీరోయిన్ గా నటించిన కళ్యాణి ప్రియదర్శన్ ఆకట్టుకుంది. ఆమె కెరీర్ ఆరంభం అయ్యి చాలా సంవత్సరాలు అయింది. ఇన్నాళ్లకు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దక్కింది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు మంచి అవకాశం ఈ సినిమాతో దక్కింది. ఈ థ్రిల్లర్ సినిమాలో చంద్ర పాత్రను ఆమె పోషించడం ద్వారా మంచి పేరును సొంతం చేసుకుంది.
దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో లోకా
డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్‌లో నిర్మించాడు. లోకా సినిమా ను ఒక ప్రాంచైజీ గా దర్శకుడు రూపొందించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అందులో భాగంగా వచ్చిన మొదటి సినిమా ఇది. లోకా చాప్టర్ 1 : చంద్ర సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ లోకా చాప్టర్ 2 ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ముందు ముందు ఈ యూనివర్శ్‌లో రాబోతున్న సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయి అని నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాను ముందుగానే పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేసి ఉండాల్సిందని కొందరు అంటున్నారు. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ద్వారా దాదాపుగా రూ.200 కోట్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇతర మార్గాల ద్వారా సినిమా మరో రూ.50 కోట్లకు మించి రాబట్టిన ఆశ్చర్యం లేదు. అంటే కంటెంట్ బాగుంటే సినిమా ఏ స్థాయిలో బిజినెస్ చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
