Begin typing your search above and press return to search.

టీవీ నటుడు లోబోకు జైలుశిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పు

టీవీ నటుడు కం బిగ్ బాస్ ఫేం లోబో అలియాస్ ఖయుమ్ కు జనగామ కోర్టు ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పును ఇచ్చింది.

By:  Garuda Media   |   29 Aug 2025 9:58 AM IST
టీవీ నటుడు లోబోకు జైలుశిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పు
X

టీవీ నటుడు కం బిగ్ బాస్ ఫేం లోబో అలియాస్ ఖయుమ్ కు జనగామ కోర్టు ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పును ఇచ్చింది. ఒక రోడ్డు ప్రమాదానికి కారణం కావటంతో పాటు.. ఇద్దరి మరణానికి.. పలువురు గాయాల బారిన పడిన ఉదంతంలో లోబోను బాధ్యుడ్ని చేస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. 2018 మే 21న ఒక టీవీ చానల్ తరఫు షూటింగ్ కోసం లోబో టీం రామప్ప.. లక్నవరం.. భద్రకాళి చెరువు.. వేయిస్తంభాల ఆలయాల పరిసరాల్లో పర్యటించింది.

ఈ సందర్భంగా లోబో స్వయంగా కారు నడుపుతూ వరంగల్ నుంచి హైదరాబాద్ కు వెళుతున్నాడు. ఈ సమయంలో రఘనాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను ఢీ కొట్టాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మేడె కుమార్.. పెంబర్తి మణెమ్మలు తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ ఉదంతంలో పలువురికి గాయాలు అయ్యాయి. కారు కూడా బోల్తా పడటంతో లోబోతో పాటు.. అందులో ప్రయాణిస్తున్న వారు కూడా గాయాలపాలయ్యారు.

ఈ ప్రమాదానికి సంబంధించి మరణించిన కుటుంబాల వారి ఫిర్యాదు మేరకు లోబో మీద కేసు నమోదు చేశారు.దీనిపై విచారణ సాగింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి జనగామ కోర్టు తీర్పును ఇచ్చింది. ప్రమాదానికి కారణమై.. ఇద్దరి మరణానికి బాధ్యత వహిస్తూ లోబోకు ఏడాది జైలుతో పాటు.. రూ.12,500 జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చారు. ఈ వివరాల్ని జనగామ జిల్లా రఘునాథ పల్లి సీఐ శ్రీనివాసరెడ్డి.. ఎస్ఐ నరేష్ లు ధ్రువీకరించారు.