Begin typing your search above and press return to search.

ఈ వీకెండ్ బాక్సాఫీస్.. సర్ప్రైజ్ విన్నర్

శుక్రవారం సిటీల్లో ‘లిటిల్ హార్ట్స్’ నైట్ షోలు అన్నీ జనాలతో కళకళలాడాయి. ఈ సినిమా మేకింగ్ చూస్తే.. కోటి రూపాయలైనా ఖర్చయి ఉంటుందా అన్న సందేహాలు కలిగాయి.

By:  Garuda Media   |   6 Sept 2025 6:07 PM IST
ఈ వీకెండ్ బాక్సాఫీస్.. సర్ప్రైజ్ విన్నర్
X

ఓ పక్క అనుష్క-క్రిష్ జాగర్లమూడిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఘాటి’.. ఇంకోవైపు మురుగదాస్ లాంటి గ్రేట్ డైరెక్టర్, సినిమా సినిమాకూ ఇమేజ్ పెంచుకుంటున్న శివకార్తికేయన్ కలిసి చేసిన ‘మదరాసి’.. ఇలాంటి పెద్ద సినిమాల ముందు ‘లిటిల్ హార్ట్స్’ లాంటి చిన్న చిత్రం ఏం నిలబడుతుందో అని సందేహించారు అందరూ. ‘లిటిల్ హార్ట్స్’ ట్రైలర్ బాగున్నా సరే.. అది వెబ్ ఫిలింలా కనిపించింది తప్ప.. థియేటర్ వ్యూకు సరిపోయే ఫీచర్ ఫిలింలా అనిపించలేదు. రిలీజ్ ముంగిట దీనిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ తర్వాత మొత్తం కథ మారిపోయింది. ‘లిటిల్ హార్ట్స్’కు రిలీజ్ రోజు కంటే ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. వాటికి మంచి స్పందన వచ్చింది. అక్కడ్నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ మొదలైంది. ఇక శుక్రవారం ‘ఘాటి’, ‘మదరాసి’ చిత్రాలకు మిక్స్డ్ టాక్ రాగా.. ‘లిటిల్ హార్ట్స్’ పాజిటివ్ టాక్ మరింత స్ప్రెడ్ అయింది. సాయంత్రానికి ఈ సినిమా థియేటర్లు నిండిపోయాయి.

శుక్రవారం సిటీల్లో ‘లిటిల్ హార్ట్స్’ నైట్ షోలు అన్నీ జనాలతో కళకళలాడాయి. ఈ సినిమా మేకింగ్ చూస్తే.. కోటి రూపాయలైనా ఖర్చయి ఉంటుందా అన్న సందేహాలు కలిగాయి. అంత సింపుల్‌గా సినిమా తీసేశారు. నటీనటులందరూ కొత్తవాళ్లు. ఒక కాలనీలో మూణ్నాలుగు లొకేషన్లలో సినిమా లాగించేసినట్లు అనిపించింది. కానీ నాన్ స్టాప్ కామెడీతో సినిమా అలరించడం.. ముఖ్యంగా యూత్‌కు కిక్కెక్కించే సీన్లు ఉండడంతో ఆ విషయాలేవీ జనం పట్టించుకోవడం లేదు. సినిమాకు మంచి స్పందన వస్తోంది. తొలి రోజు ‘లిటిల్ హార్ట్స్’కు కోటిన్నర దాకా గ్రాస్ వచ్చినట్లు అంచనా. ఈ సినిమా స్థాయికి ఇది పెద్ద నంబరే. పాజిటివ్ టాక్ అంతకంతకూ పెరుగుతుండడంతో వసూళ్లు ఇంకా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.10 కోట్ల మార్కును దాటితే ఆశ్చర్యమేమీ లేదు. శని, ఆదివారాల్లో సినిమాకు ఊహించని వసూళ్లు రావడం గ్యారెంటీ.