3 సినిమాలకు వసూళ్లే వసూళ్లు.. OG వరకు అదే ఊపు!
రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఆ సినిమా.. మూడో రోజు నుంచి లాభాలు అందిస్తోంది. బడ్జెట్ కు అనేక రెట్లు లాభాలు రాబడుతూ దూసుకుపోతోంది.
By: M Prashanth | 14 Sept 2025 3:09 PM ISTఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లు.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్నీ ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. దాదాపు అన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అందుకు కారణమేంటో అందరికీ తెలిసిందే. మంచి కంటెంట్ ఉన్న మూడు సినిమాలు ఇప్పుడు సందడి చేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతున్నాయి.
అవే లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి చిత్రాలు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ తనూజ్ మౌళి, శివాని నాగరం జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లిటిల్ హార్ట్స్.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ రెండో వీకెండ్ ను కూడా కంప్లీట్ చేసింది! ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఆ సినిమా.. పెద్ద విజయం సాధించింది.
రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఆ సినిమా.. మూడో రోజు నుంచి లాభాలు అందిస్తోంది. బడ్జెట్ కు అనేక రెట్లు లాభాలు రాబడుతూ దూసుకుపోతోంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భారీ ప్రాఫిట్ జోన్ లో ఉన్నారు. ఈ వారం రెండు చిత్రాలు మిరాయ్, కిష్కింధపురి రిలీజ్ అయినప్పటికీ.. లిటిల్ హార్ట్స్ ఇంకా సందడి చేస్తూనే ఉంది.
అయితే ఆ రెండు సినిమాలు కూడా తక్కువేం కాదు. పోటీగా ఒకే రోజు ప్రేక్షకుల ముందు వచ్చినా.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద మిరాయ్, కిష్కింధపురి మంచి ఓపెనింగ్స్ సాధించగా.. రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్ సాధించాయి. తొలి రోజు కన్నా ఎక్కువ రాబట్టడం గమనార్హం.
మిరాయ్ లో యంగ్ హీరో తేజ సజ్జా, రితికా నాయక్ లీడ్ రోల్స్ పోషించగా.. సూపర్ హీరో జోనర్ లో ఫాంటసీ ఫిల్మ్ గా రూపొందింది. మరోవైపు మరో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కిష్కింధపురిలో ప్రధాన పాత్రలు పోషించగా.. హారర్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కింది.
మొత్తానికి లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి సినిమాలు.. దానికవే సెపరేట్ జోనర్ లో గ్రాండ్ గా రూపొంది ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులు ఆస్వాదించేలా చేస్తున్నాయి. మరి కొన్ని రోజుల పాటు ఫుల్ గా సందడి చేయనున్నాయి. సెప్టెంబర్ 25న గ్యాంగ్ స్టర్ డ్రామా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే వరకు అదే ఊపు కొనసాగించనున్నాయి.
