Begin typing your search above and press return to search.

ఆ రోజు అలా మీమ్స్ చేసిన వాళ్లే..

మౌళి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. క్రియేటివ్‌గా సాగే అతడి వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి.

By:  Garuda Media   |   8 Sept 2025 4:39 PM IST
ఆ రోజు అలా మీమ్స్ చేసిన వాళ్లే..
X

సోషల్ మీడియా ఊపందుకున్నాక మీమ్స్ చేసే వాళ్లకు మాంచి డిమాండ్ ఏర్పడింది. కొందరు ఊరికే సరదాగా మీమ్స్ చేస్తుంటారు. కొందరు దాన్నే కెరీర్‌గా మార్చుకుంటారు. వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో పేజీలు, ఛానెళ్లు మొదలుపెట్టి ఫాలోవర్స్‌ను పెంచుకుని దాన్నొక ఆదాయ మార్గంగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ వేదికలనే వాడుకుని సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది యువత. ‘లిటిల్ హార్ట్స్’ అనే సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయం అయిన మౌళి, సాయి మార్తాండ్ ఇద్దరూ కూడా మీమర్సే కావడం విశేషం.

మౌళి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. క్రియేటివ్‌గా సాగే అతడి వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి. ఇప్పటికీ వాటిలో కొన్ని టెంప్లేట్స్ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటాయి. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్‌తో నటుడిగా పరిచయం అయిన అతను.. మంచి పేరు సంపాదించాడు. ఆ గుర్తింపుతోనే ‘లిటిల్ హార్ట్స్’లో హీరోగా అవకాశం సంపాదించాడు.

ఇక సాయి మార్తాండ్ విషయానికి వస్తే.. అతను కూడా మీమ్స్‌తోనే పేరు సంపాదించాడు. ఒక మీమర్‌కు దర్శకుడిగా అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు. నిజానికి అతను ముందు నటుడు కావాలనుకున్నాడట. కానీ తన కోసం ఎవరు కథ రాసి సినిమా తీస్తారని.. తనే స్టోరీ రాసుకుని నిర్మాణ సంస్థల చుట్టూ తిరిగాడట. కానీ ఎవ్వరూ అతడికి అవకాశమివ్వలేదు. చివరికి మౌళి హీరోగా సినిమా చేద్దామని అతడికి కథ వినిపిస్తే.. తను ‘నైంటీస్’ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్‌ దగ్గరికి తీసుకెళ్లడం.. అతను వీళ్లిద్దరితో సినిమాను ప్రొడ్యూస్ చేయడం జరిగింది.

సాయి మార్తాండ్ తాతయ్య ప్రముఖ దర్శకుడు కావడం విశేషం. ఆయన పేరు.. బి.వి.ప్రసాద్. సీనియర్ ఎన్టీఆర్‌తో ‘ఆరాధన’, కృష్ణతో ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమాలు తీశారాయన. కానీ సాయి మార్తాండ్ తన సొంత టాలెంట్‌తోనే అవకాశం సంపాదించాడు. ‘లిటిల్ హార్ట్స్’లో కీలక పాత్ర చేసిన రాజీవ్ కనకాల మీద సాయి మార్తాండ్ ఒకప్పుడు ఫన్నీ మీమ్స్ వేయడం విశేషం.

ఆయన చాలా సినిమాల్లో చనిపోయే క్యారెక్టర్లే వేయడం గురించి మార్తాండ్ చేసిన మీమ్స్‌ను ‘లిటిల్ హార్ట్స్’ ప్రి రిలీజ్ ప్రమోషనల్ ఈవెంట్లో ప్రదర్శించడంతో రాజీవ్ సహా అందరూ తెగ నవ్వుకున్నారు. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చి ఒక బ్లాక్ బస్టర్ మూవీ తీయడమంటే మాటలు కాదు.