Begin typing your search above and press return to search.

ఈసారి తగ్గిన వర్షాలు.. పెరిగిన హిట్లు

ఆగస్టు అంటే హైదరాబాద్‌లో వర్షాలు, రోడ్లపై నీళ్లు, ట్రాఫిక్ జామ్‌లు కామన్. సినిమాలకూ ఈ నెల ఎప్పుడూ అంత ఈజీ కాదు.

By:  M Prashanth   |   22 Aug 2026 9:58 AM IST
ఈసారి తగ్గిన వర్షాలు.. పెరిగిన హిట్లు
X

ఆగస్టు అంటే హైదరాబాద్‌లో వర్షాలు, రోడ్లపై నీళ్లు, ట్రాఫిక్ జామ్‌లు కామన్. సినిమాలకూ ఈ నెల ఎప్పుడూ అంత ఈజీ కాదు. భారీ వర్షాలు పడితే ఈవెనింగ్ షోలు, నైట్ షోల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈసారి ఆగస్టు మాత్రం రెండింట్లోనూ కాస్త రివర్స్‌గా కనిపిస్తోంది. వర్షాలు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉండగా, థియేటర్ల దగ్గర మాత్రం వరుసగా సినిమాలు నిలబడుతున్నాయి.

గత ఆగస్టు పరిస్థితి చూస్తే తేడా ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది. 2025 ఆగస్టులో హైదరాబాద్‌ను పలుమార్లు భారీ వర్షాలు ముంచెత్తాయి. కొన్ని రోజుల వరకు రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలిసి రాలేదు. ఎన్టీఆర్ ‘వార్ 2’, రజనీకాంత్ ‘కూలీ’ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా తర్వాత నిలబడలేదు. ‘బకాసుర రెస్టారెంట్’, ‘పరదా’, ‘సుందరకాండ’ వంటి చిన్న సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఆ నెల మొత్తం చూసుకుంటే టాలీవుడ్‌కు పెద్దగా కలిసి రాలేదు.

ఈసారి మాత్రం జూలై చివరి నుంచి టాలీవుడ్‌కు మంచి రన్ మొదలైంది. ‘లెనిన్’తో అఖిల్‌కు చాలా రోజుల తర్వాత హిట్ వచ్చింది. ఆ తర్వాత ఆగష్టులోకి రాగానే వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ కూడా మంచి రిజల్ట్ అందుకుంది. సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగులో కూడా బాగా ఆడింది. ఇప్పుడు రవితేజ ‘ఇరుముడి’కి మొదటి రోజు నుంచే మంచి టాక్ వస్తోంది.

వాతావరణం కూడా ఈసారి కాస్త సహకరిస్తోంది. అయితే ఆగస్ట్, సెప్టెంబర్‌లో వర్షాలు తక్కువగా ఉండొచ్చనే అంచనాలు ముందే వచ్చాయి. కానీ మధ్యలో భారీ వర్షాలు పడినా గత ఏడాది తరహాలో వరుసగా థియేటర్ ప్లాన్లు మార్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పటివరకు పెద్దగా రాలేదు. అయితే సినిమా బాగుంటేనే ప్రేక్షకుడు వస్తాడు. కానీ మంచి సినిమాలు వరుసగా వచ్చిన టైమ్‌లో వాతావరణం కూడా పెద్ద అడ్డంకిగా మారకపోవడం థియేటర్లకు ప్లస్ అయింది.

ముఖ్యంగా వీకెండ్స్‌లో షోలు సాఫీగా వాతావరణం ఉపయోగపడుతోంది. గత ఆగస్టులో బయట వర్షాలు ఎక్కువ.. థియేటర్లలో మాత్రం పరిస్థితి డ్రైగా ఉంది. ఈసారి బయట వర్షాలు తగ్గాయి.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం వరుసగా హిట్లు పడుతున్నాయి. ‘ఇరుముడి’ కూడా ఈ రన్‌ను కొనసాగిస్తే ఈ ఆగస్టు టాలీవుడ్‌కు నిజంగానే బాగా గుర్తుండిపోయే నెల అవుతుంది.

అలాగే ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందనే కామెంట్స్ ఈమధ్య తరచుగా వినిపిస్తున్నాయి. కానీ సినిమా నచ్చితే మాత్రం వాళ్లు వెనక్కి తగ్గడం లేదని ఈ రిజల్ట్స్ చెబుతున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మంచి టాక్ వచ్చిన వాటికి షోలు పెరుగుతున్నాయి. అంటే ఆడియన్స్ థియేటర్‌ను వదిలేయలేదు.. వాళ్లను రప్పించే సినిమా పడాలి అంతే.