ఇండస్ట్రీలో విషాదం.. లెజెండ్రీ నిర్మాత కన్నుమూత!
గత కొన్ని సంవత్సరాలుగా వయోభారంతో.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరవణన్ నేడు తెల్లవారుజామున చెన్నైలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.
By: Madhu Reddy | 4 Dec 2025 10:01 AM ISTచిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తే.. మరికొంతమంది వృద్ధాప్య సమస్యలతో తుది శ్వాస విడుస్తున్నారు. ఇప్పుడు మరొక లెజెండ్రీ నిర్మాత వయోభారరీత్యా కన్నుమూశారు. దాదాపు 300కు పైగా చిత్రాలను తన నిర్మాణ సంస్థ ద్వారా ప్రేక్షకులకు అందించి, భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ అధినేత ఏవీఎమ్ శరవణన్ తుది శ్వాస విడిచారు.
గత కొన్ని సంవత్సరాలుగా వయోభారంతో.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరవణన్ నేడు తెల్లవారుజామున చెన్నైలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 85 సంవత్సరాలు. శరవణన్ మరణంతో తమిళ్, తెలుగు చిత్ర పరిశ్రమలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
శరవణన్ విషయానికి వస్తే.. అగ్ర నిర్మాతగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. దక్షిణాది సినీ పరిశ్రమలోనే మొదటి అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా తన ఏవీఎం ప్రొడక్షన్ సంస్థను తీర్చిదిద్దారు. ఇకపోతే ఈయన ఎవరో కాదు ఏవీఎం స్టూడియోస్, ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఏవి మెయ్యప్పన్ చెట్టియార్ తనయుడే. తండ్రి బాటలోనే తండ్రి తదనంతరం ఏవీఎం సంస్థ బాధ్యతలను తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న ఈయన. దాదాపు 300కు పైగా చిత్రాలను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ బెంగాలీ, మలయాళం, సింహళ భాషలలో నిర్మించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఇకపోతే ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన శరవణన్.. ముఖ్యంగా తెలుగులో జెమిని, ఆ ఒక్కటి అడక్కు, లీడర్, బామ్మ మాట బంగారు బాట, ఎవరైనా ఎప్పుడైనా లాంటి సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక అలాగే తమిళంలో మెరుపు కలలు, అయాన్, శివాజీ వంటి చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు. ఏదేమైనా ఒక లెజెండ్రీ నిర్మాత వయోభారరీత్యా స్వర్గస్తులవడంతో అభిమానులు, సినీ సెలెబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ .. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఏవీఎం శరవణన్ వారసుల విషయానికి వస్తే.. ప్రముఖ సినిమా నిర్మాత ఏవీఎం గుహన్ తండ్రి. ఈయన చెన్నైలో ఏవీఎం స్టూడియోస్ కి యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఏవీఎం శరవణన్ నిర్మాతగా రెండు ఫిలింఫేర్ అవార్డులను దక్షిణాది సినీ పరిశ్రమలో గెలుచుకున్నారు. 1986లో మద్రాసు షెరీఫ్ గా కూడా పనిచేశారు ఏవీఎం శరవణన్. ఇక్కడ మరో అద్భుతమైన విషయం ఏమిటంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్, సూపర్ స్టార్ శివాజీ గణేషన్ వంటి దిగ్గజ నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా ఈయనదే కావడం గమనార్హం.
