నటుడు రంగనాథ్ జీవితంలోని ఆసక్తికర కోణం!
అలాంటి క్లిష్టమైన సమయంలో రంగనాద్ కు గృహ సహాయకురాలిగా ఉన్న మీనాక్షి ఎంతో అండగా నిలిచారు. సుమారు ఆరేళ్లపాటు ఆయన బాగోగులను దగ్గరుండి చూసుకున్నారు.
By: Srikanth Kontham | 6 Aug 2026 1:41 PM ISTప్రముఖ దివంగత నటుడు రంగనాథ్ సుదీర్ఘ నటనా ప్రయాణంలో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే రంగనాద్ కెరీర్ విజయాల కంటే ఆయన మరణానంతరం వెలుగులోకి వచ్చిన వ్యక్తిగత విషయాలు నేటికీ ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. సినిమాల్లో విభిన్న పాత్రలతో మెప్పించిన రంగనాథ్ వ్యక్తిగత జీవితం మాత్రం పలు సవాళ్లతో సాగింది.
ముఖ్యంగా 2009లో రంగనాద్ సతీమణి మరణించిన తర్వాత ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఒంటరితనం రంగనాద్ ను మానసికంగా కుంగదీసింది.
అలాంటి క్లిష్టమైన సమయంలో రంగనాద్ కు గృహ సహాయకురాలిగా ఉన్న మీనాక్షి ఎంతో అండగా నిలిచారు. సుమారు ఆరేళ్లపాటు ఆయన బాగోగులను దగ్గరుండి చూసుకున్నారు. అనారోగ్య సమయాల్లోనూ, కష్టకాలంలోనూ రంగనాద్ కు చేదోడు వాదోడుగా నిలమబడి కుటుంబ సభ్యురాలిలా సేవలు అందించారు.
ఆమె చూపిన నిస్వార్థ ప్రేమకు,సేవకు కృతజ్ఞతగా రంగనాథ్ తన చివరి కోరికను ప్రకటించారు. రంగనాద్ కు జీవితంలోని అత్యంత కష్టకాలంలో తోడుగా నిలిచిన ఆ గృహ సహాయకురాలికే తన మొత్తం పొదుపు సొమ్ము చెందాలని కోరుకున్నారు అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
తండ్రి మరణం తర్వాత రంగనాథ్ కుమారుడు టి. నాగేంద్ర కుమార్ కూడా ఈ నిర్ణయాన్ని గౌరవించి అందరికీ ఆదర్శంగా నిలవడం విశేషం. తన తండ్రి చివరి కోరికను మన్నించి, ఆ కష్టకాలంలో ఆయనకు సేవ చేసిన మీనాక్షికే పొదుపు సొమ్మును అందజేస్తామని తెలిపారు. కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఒక నటుడి వ్యక్తిగత నిర్ణయమే కాదు. మానవ సంబంధాల విలువను, కృతజ్ఞతాభావాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. రక్తసంబంధాలు కాకపోయినా? కష్టసమయాల్లో ఆప్యాయత పంచిన వ్యక్తులకు ఇచ్చిన గౌరవంగా ఇది నిలిచిపోయింది.
రంగనాథ్ చలనచిత్ర ప్రస్థానం ఎంత గొప్పదో? ఆయన తీసుకున్న నిర్ణయం కూడా అంతే చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇంత వరకూ ఏ సెలబ్రిటీ..ధనికుడు ఇలా సహాయకుల పట్ల వ్యవహరించింది లేదు. అలా చేయాలంటే ఎంతో దాతృహృదం..మనుషుల పట్ల ప్రత్యేకమైన ప్రేమాభి మానాలు ఉంటేనే సాధ్యమవుతుంది. నేటి సమాజం తీరు ఎలా ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. మనిషికి విలువల లేని రోజులివి. కేవలం డబ్బు, పేరు పరపతి అనే వ్యామోహంలో పడి మానవత్వ విలువలు మర్చిపోతున్న తరుణంలో రంగనాధ్ లో ఊహించని కోణం నిజంగా ఓ సంచలనమే.
