ఫ్యామిలీ సినిమాలు తీయడానికి ఫ్యామిలీస్ ఎక్కడ?
ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా రిలీజ్ అయ్యేవి. అప్పటి ట్రెండ్ లో ఆ జానర్ చిత్రాలకే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండేది. కొత్త కొత్త ప్రయోగాలు చేసినా ఫలించేవి కాదు.
By: Srikanth Kontham | 1 Dec 2025 8:00 AM ISTఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా రిలీజ్ అయ్యేవి. అప్పటి ట్రెండ్ లో ఆ జానర్ చిత్రాలకే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండేది. కొత్త కొత్త ప్రయోగాలు చేసినా ఫలించేవి కాదు. ఆదరణ అంతగా ఉండేది కాదు. వెరసి నిర్మాతకు నష్టం తప్ప రూపాయి లాభం ఉండేది కాదు. స్టార్ హీరోలు కొత్తగా ప్రయత్నించినా? ప్రేక్షకులు ఆదరించే వారు కాదు. దీంతో సక్సస్ ఫార్ములా ఫ్యామిలీ జానర్ ఒక్కటే పట్టుకుని సినిమాలు చేసేవారు. చిరంజీవి తరం హీరోల నుంచి తర్వాత తరం వరకూ చాలా మంది స్టార్లు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతో సక్సెస్ అయిన వాళ్లే.
ఫ్యామిలీ కథలపై ఆయన అభిప్రాయం:
అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకు అనుగుణంగా సినిమాలు చేస్తున్నారు. కొత్త కొత్త ప్రయోగాలకు మంచి ఆదరణ దక్కుతుంది. మరి ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు చేస్తే సక్సెస్ అవ్వవా? అంటే నో అని చెప్పలేం. ఫ్యామిలీ కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కాకపోతే ఆ కథల్ని కొత్తగా చెప్పగలగాలి. అప్పుడే వాటి సక్సెస్ కు అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఏ దర్శకుడు ట్రై చేయడం లేదు. తాజాగా ఇదే అంశంపై నటుడు, రైటర్, డైరెక్టర్ ఎల్ . బి శ్రీరాం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. `కుటుంబ కథా చిత్రాలు రావడం లేదంటున్నారు?
పిల్లలు అలా ..పెద్దలు ఇలా:
అసలు కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. కుటుంబంలో పెద్ద వాళ్లను అనాద శరణాలయాల్లో చేర్చుతున్నారు. పిల్లల్ని హాస్టల్స్ లో పెడుతున్నారు. చిన్న వయసులోనే వారు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. అక్కడ నుంచి కళాశాల జీవితం. అక్కడా వసతి గృహానికే పరిమితమవుతున్నారన్నారు. భార్యా భర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. డే డ్యూటీ ఒకరు చేస్తే నైట్ డ్యూటీకి మరొకరు వెళ్లిపోతున్నారు. ఒకర్ని ఒకరు చూసుకోవడమే కష్టమవుతుంది. కులాశాగా కూర్చుని కబుర్లు చెప్పుకునే సమయం కూడా దొరకడం లేదు. ఇదంతా దేనికోసమే అర్దం కావడం లేదన్నారు.
చదువు కోసమే పిల్లలా:
ఇంట్లో ఎంత మంది ఉంటే వారందరి దగ్గర ఎవరి ఫోన్లు వారికి ఉంటున్నాయి. అవి వచ్చిన తర్వాత టీవీలు కూడా కలిసి చూడటం మానేసారు. ఎవరి ఫోన్ తో వారు బిజీగా ఉంటున్నారన్నారు. పెద్ద వాళ్లు చెప్పే పరిస్థితుల్లో లేరు. చెబితే వినే పరిస్థితుల్లో పిల్లలు లేరు. పిల్లలను విదేశాల్లో చదివించడం కోసమే పెంచుతున్నట్లు కనిపిస్తుంది. దేశంలో భార్యభర్తలు విడిపోవడం కూడా పెరిగిపోయింది. విదేశీ కల్చర్ భారత్ లోనూ కనిపిస్తోంది. ఇలా కుటుంబ జీవితంలో ఎన్నో మార్పులొచ్చేసాయి. అలాంటప్పుడు ఫ్యామిలీ సినిమాలకు ఆదరణ కష్టమే అన్నారు.
