Begin typing your search above and press return to search.

ఆ హీరోకు ఎవ‌రూ సాటి లేరు

ఇప్పటి ట్రెండ్‌ను గమనిస్తే, సీనియర్ హీరోలు తమ వయసుకు దగ్గరగా ఉన్న హీరోయిన్లతో జోడీ కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   11 Feb 2026 6:00 AM IST
ఆ హీరోకు ఎవ‌రూ సాటి లేరు
X

ఒకప్పుడు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి లయ… దాదాపు పదేళ్ల క్రితం సినిమాలకు గుడ్‌బై చెప్పి అమెరికాలో స్థిరపడ్డ సంగతి తెలిసిందే. కుటుంబ జీవితం, వ్యక్తిగత ప్రాధాన్యాలకే ఎక్కువ సమయం కేటాయించిన లయ, మళ్లీ సినిమాల వైపు చూస్తార‌ని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. కానీ కాలం మారింది. సోషల్ మీడియాలో ఆమె చేసిన డ్యాన్స్ రీల్స్ ఒక్కసారిగా వైరల్ కావడంతో, లయ పేరు మళ్లీ ఇండస్ట్రీలో చర్చకు వచ్చింది. అదే పాపులారిటీ ఇప్పుడు ఆమె రీ-ఎంట్రీకి బలమైన పునాది అయింది.

విజ‌యేంద్ర‌వర్మ‌లో బాల‌య్య‌తో క‌లిసి న‌టించిన ల‌య‌

ప్రస్తుతం లయ, శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సాంప్రదాయిని సుప్పిణి సుద్ధపూసణి అనే వెబ్ ఫిల్మ్‌తో గ్లామర్ ప్రపంచంలోకి మ‌రోసారి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో లయ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 2004లో విడుదలైన విజయేంద్ర వర్మ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న లయ, ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఆయ‌న చాలా ప్రొఫెష‌న‌ల్

బాలకృష్ణ గారు ఎంతో ప్రొఫెషనల్ అని, సెట్స్‌లో ఆయ‌నతో క‌లిసి పని చేయడం చాలా సులువుగా ఉంటుంద‌ని, ఆయన అందరినీ నవ్విస్తూ, పాజిటివ్ ఎనర్జీతో వాతావరణాన్ని హాయిగా ఉంచుతారని, డిసిప్లిన్, టాలెంట్ విషయంలో ఆయనకు ఎవ‌రూ సాటి లేరంటూ లయ చెప్పుకొచ్చారు. ఫ్యూచ‌ర్ లో మళ్లీ ఆయనతో కలిసి నటించాలని తన కోరికను కూడా ఆమె ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌పెట్టారు.

ఆ కాంబో మ‌ళ్లీ కుదిరేనా?

ఇప్పటి ట్రెండ్‌ను గమనిస్తే, సీనియర్ హీరోలు తమ వయసుకు దగ్గరగా ఉన్న హీరోయిన్లతో జోడీ కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ లాంటి స్టార్, డబుల్ రోల్స్ చేసే కథల్లో లయ లాంటి సీనియర్ హీరోయిన్ తో అయితే స్క్రీన్‌పై మంచి బ్యాలెన్స్ కుదిరే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. లయ–బాలయ్య కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయితే ప్రేక్షకుల్లో నాస్టాల్జియా ఫీలింగ్‌తో పాటు కొత్త ఇంట్రెస్ట్ కూడా ఏర్పడే అవకాశముంది.

అయితే లయ రీ-ఎంట్రీ విషయానికి వస్తే, నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. అయినప్పటికీ ఆమె ఆశలు ఇప్పుడు శివాజీ వెబ్ ప్రాజెక్ట్‌పైనే ఉన్నాయి. ఈ సినిమా గనుక హిట్ అయితే, లయ కెరీర్‌కు ఇది టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు ఆమెకు మళ్లీ పెద్ద సినిమాల నుంచి, ముఖ్యంగా సీనియర్ హీరోల సరసన నటించే ఆఫర్లు వ‌చ్చే ఛాన్సుంది. మొత్తానికి, లయ సెకండ్ ఇన్నింగ్స్‌పై టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.