'రామాయణం' లో కైకేయి-మంథర పాత్రల ఎంపిక సరైనదేనా?
తాజాగా విడుదలైన మహారాణి కైకేయి, మంథర పాత్రల పోస్టర్లు రామాయణ కథలో అత్యంత కీలకమైన మలుపులను కళ్లకు కట్టేలా ఉన్నాయి.
By: Sivaji Kontham | 9 Oct 2026 9:16 PM ISTబాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా మైథలాజికల్ చిత్రం `రామాయణం`కి సంబంధించిన అప్‌డేట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా నుంచి మేకర్స్ వరుసగా విడుదల చేస్తున్న క్యారెక్టర్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన మహారాణి కైకేయి, మంథర పాత్రల పోస్టర్లు రామాయణ కథలో అత్యంత కీలకమైన మలుపులను కళ్లకు కట్టేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో `రామాయణ` ఇతిహాసంలో ఈ రెండు పాత్రలు పోషించిన పాత్ర ఎంతటి ప్రాముఖ్యమైనదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
రామాయణ కథా గమనాన్ని పూర్తిగా మార్చివేసిన ప్రధాన ఘట్టాలలో కైకేయి, మంథరల పాత్రలది అగ్రస్థానం. అయోధ్య చక్రవర్తి దశరథుడి ముగ్గురు భార్యలలో ఒకరైన కైకేయి, తన కొడుకు భరతుడికి సింహాసనం దక్కాలనే ఆశతో రాముడిని పద్నాలుగు సంవత్సరాలు అడవులకు పంపాలని కోరడం రామాయణంలో అతిపెద్ద మలుపు. ఈ అనూహ్య పరిణామమే సీతాపహరణం, రావణ వధ వంటి తదుపరి చారిత్రాత్మక సంఘటనలకు దారితీసింది. ఒక తల్లిగా, రాణిగా కైకేయి తీసుకున్న ఆ నిర్ణయం రామాయణ ఇతిహాసానికి ఒక ఉత్కంఠభరితమైన- భావోద్వేగమైన మలుపును ఇస్తుంది.
అయితే ఇంతటి తీవ్రమైన నిర్ణయం వెనుక ప్రేరేపక శక్తిగా నిలిచిన కుటిల మంత్రాంగం మంథరదే. అయోధ్య రాజ్యంలో ఉంటూ తన కుటిల ఆలోచనలతో కైకేయి మనసును విషపూరితం చేసిన మంథర పాత్ర, కుట్రలకు .. దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీకగా నిలుస్తుంది. మంథర వేసిన అడుగులు, ఆమె చేసిన గుసగుసలు కేవలం ఒక రాజ్యాన్ని అల్లకల్లోలం చేయడమే కాకుండా.. రాముడి జీవితాన్ని వనవాసం వైపు నడిపించాయి. రామాయణంలో ఎలాంటి విధ్వంసకర మార్పులు రావడానికైనా ఒక చిన్న కుట్ర ఎంతలా కారణమవుతుందో మంథర పాత్ర నిరూపిస్తుంది.
ఈ నేపథ్యంలో నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న `రామాయణం` చిత్రంలో ఈ పాత్రల ఎంపిక చాలా కచ్చితంగా కుదిరింది. మహారాణి కైకేయి పాత్రలో నటి లారా దత్తా రాజసం ఉట్టిపడే సాంప్రదాయ వస్త్రధారణ.. భారీ ఆభరణాలతో రాయల్ లుక్‌లో కనిపిస్తుండగా... ``ఒక రాణి.. ఒక తల్లి.. రాముడి గమనాన్నే మార్చేసి, తండ్రి ప్రేమను వంచించిన రెండు కోరికలు`` అంటూ విడుదల చేసిన క్యాప్షన్ సినిమాపై అంచనాలను పెంచింది. అలాగే అయోధ్య రాజ్యంలో కుట్రలకు తెరతీసే మంథర పాత్రలో షీబా చద్దా చేతిలో కర్రతో కుటిలమైన ఆలోచనలు గల రూపంలో కనిపిస్తూ ``ఒక కుటిలమైన మనసు.. తల్లి ప్రేమను, రాజ్యాన్ని అత్యంత చీకటి గంటలుగా మార్చిన గుసగుసలు`` అనే పంక్తులకు పూర్తి న్యాయం చేసేలా ఉన్నారు.
ఇదిలాఉంటే, ఈ చిత్రంలో శ్రీరాముడు (రణ్‌బీర్ కపూర్), సీతాదేవి (సాయి పల్లవి) పాత్రల ఎంపికపై కొందరిలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మిగతా పాత్రల ఎంపిక మాత్రం అత్యంత సముచితంగా సాగింది. రావణాసురుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, దశరథుడిగా అరుణ్ గోవిల్ వంటి ప్రముఖుల ఎంపిక సినిమా స్థాయిని పెంచింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా వస్తుండగా పార్ట్ 1 ఈ ఏడాది దీపావళికి ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఐమ్యాక్స్ లో విడుదల కానుండగా.. `పార్ట్ 2` దీపావళి 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
