Begin typing your search above and press return to search.

IPL సృష్టికర్త లలిత్ మోదీ బయోపిక్: ఆ అగ్ర హీరో రిక్వెస్ట్.. అండర్ వరల్డ్ టార్గెట్!?

ఈ బయోపిక్ వివరాలతో పాటు లలిత్ మోదీ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకు సంబంధించి కొన్ని షాకింగ్ నిజాలను మొదటిసారిగా బయటపెట్టారు.

By:  Sivaji Kontham   |   8 Jun 2026 12:14 PM IST
IPL సృష్టికర్త లలిత్ మోదీ బయోపిక్: ఆ అగ్ర హీరో రిక్వెస్ట్.. అండర్ వరల్డ్ టార్గెట్!?
X

ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ `ఐపీఎల్` (IPL) సృష్టికర్త, మాజీ కమిషనర్ లలిత్ మోదీ జీవితం ఆధారంగా ఒక భారీ బయోపిక్ తెరకెక్కబోతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉందని స్వయంగా లలిత్ మోదీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన వ్యాపార ప్రస్థానం, క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ .. నాటి వివాదాల చుట్టూ ఈ క‌థాంశం ఉంటుంద‌ని .. సోనీ సంస్థ మాజీ అధినేత్రి స్నేహా రజని నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం భారీ పరిశోధనలు, వందలాది ఇంటర్వ్యూల ఆధారంగా స్క్రీన్‌ప్లేను సిద్ధం చేస్తోందని మోదీ స్వ‌యంగా పేర్కొన్నారు. ఈ ప్రకటనతో బాలీవుడ్‌లో ఈ బయోపిక్ పై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.

ఈ బయోపిక్‌లో లలిత్ మోదీ పాత్రను పోషించే ఆ అగ్ర హీరో ఎవరో కూడా ఆయనే స్వయంగా బయటపెట్టారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ గతంలో తనను లండన్‌లో కలిసి `లలిత్ మోదీ పాత్ర`లో నటించడానికి చాలా ఆసక్తిని కనబరిచారని వెల్లడించారు. ``రణ్‌వీర్ నా పాత్రను పోషించాలని ఆశపడుతున్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఆయనే స్వయంగా లండన్‌లోని నా నివాసానికి వచ్చి కలిశాడు. నా కెరీర్ లో ఒక గొప్ప సెన్సేష‌న‌ల్ రోల్ ఏదైనా ఉంది అంటే అది ల‌లిత్ మోదీ నిజ జీవిత పాత్ర‌ అని ర‌ణ్ వీర్ త‌న‌తో అన్నార‌ట‌. అత‌డు అద్భుతమైన నటుడు.. `ధురంధర్` చిత్రంలో ర‌ణ్‌వీర్‌ నటన అద్వితీయం`` అని లలిత్ మోదీ కొనియాడారు. అయితే ప్రస్తుతం రణ్‌వీర్ పెద్ద స్టార్ అయినందున డేట్స్ సర్దుబాటు ఆధారంగా ఈ కాంబినేషన్ కుదురుతుందో లేదో చూడాలన్నారు.

ఈ బయోపిక్ వివరాలతో పాటు లలిత్ మోదీ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకు సంబంధించి కొన్ని షాకింగ్ నిజాలను మొదటిసారిగా బయటపెట్టారు. తాను క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుండి పూర్తిగా తప్పుకోవడానికి అండర్ వరల్డ్ నుండి వచ్చిన బెదిరింపులు, ప్రాణ‌భ‌య‌మే ప్రధాన కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2012లో లండన్‌లో జరిగిన ఒక అర్ధరాత్రి నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ .. ఒక మధ్యవర్తి ద్వారా తెల్లవారుజామున 3:30 గంటలకు తను `బాబా` అనే వ్యక్తి నివాసానికి వెళ్లాల్సి వచ్చిందని.. అక్కడ దావుద్ ఇబ్రహీం సిండికేట్‌కు చెందిన వ్యక్తుల కోసం ఆట‌లోని ఒక ఫ్రాంఛైజీని కేటాయించాల్సి ఉంటుంద‌ని కూడా అండ‌ర్ వ‌ర‌ల్డ్ త‌న‌పై ఒత్తిడి తెచ్చింద‌ని మోదీ తెలిపారు.

నాటి ఘ‌ట‌న‌లో0 మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సదరు మధ్యవర్తి నేరుగా దావుద్ ఇబ్రహీంతో శాటిలైట్ ఫోన్ ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేశాడట. సదరు వ్యక్తి టెర్రస్ పైకి వెళ్లి శాటిలైట్ ఫోన్ లో దావుద్ కు కాల్ చేసి.. ``దావుద్ భాయ్, లలిత్ భాయ్ వచ్చాడు, మాట్లాడండి`` అని ఫోన్‌ను స్పీకర్‌లో పెట్టాడు. కానీ నేను మాట్లాడటానికి నిరాకరించాను. అప్పుడు అవతలి వైపు నుండి దావుద్ స్పందిస్తూ.. నువ్వు అతని స్నేహితుడివి, పాతవన్నీ మర్చిపో.. అంతా అయిపోయింది అని అన్నాడు! అంటూ లలిత్ మోదీ సంచలన విషయాలను రివీల్ చేశారు. తాను వారి డిమాండ్లకు లొంగకపోవడం వల్లే ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు పలు అంతర్జాతీయ చట్టపరమైన రక్షణలు, పోలీసుల నిఘా నడుమ బతకాల్సి వచ్చిందని ల‌లిత్ మోదీ చెప్పుకొచ్చారు.

మొత్తానికి లలిత్ మోదీ బయోపిక్ కేవలం క్రికెట్, గ్లామర్ మాత్రమే కాకుండా అండర్ వరల్డ్ బెదిరింపులు, ఇంటర్నేషనల్ ఫిక్సింగ్స్ - బిలియన్ డాలర్ల బెట్టింగ్ మార్కెట్ చుట్టూ సాగే ఒక మైండ్ బ్లోయింగ్ క్రైమ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ బ‌యోపిక్ రూపొందనుందని స్పష్టమవుతోంది. ఒకవేళ రణ్‌వీర్ సింగ్ ఈ పాత్రను అంగీకరిస్తే గనుక ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది ఒక మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ పవర్‌ఫుల్ బయోపిక్‌గా నిలిచిపోవడం ఖాయం. స్క్రిప్ట్ పనులు పూర్తయితే న‌టీన‌టులు, ద‌ర్శ‌క‌త్వం వగైరా వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.