Begin typing your search above and press return to search.

ఇంద్రజ ఫాదర్ లవ్.. స్టేజ్‌ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కన్నీళ్లు

సినిమా ఈవెంట్ లో సాధారణంగా సినిమా సక్సెస్, హీరో, హీరోయిన్ గురించి మాట్లాడుతుంటారు.

By:  M Prashanth   |   6 Oct 2026 9:51 PM IST
ఇంద్రజ ఫాదర్ లవ్.. స్టేజ్‌ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కన్నీళ్లు
X

సినిమా ఈవెంట్ లో సాధారణంగా సినిమా సక్సెస్, హీరో, హీరోయిన్ గురించి మాట్లాడుతుంటారు. కానీ అనకాపల్లి సక్సెస్ మీట్‌ లో నిర్మాత లగడపాటి శ్రీధర్ మాత్రం సీనియర్ నటి ఇంద్రజ గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ఆమె తన తండ్రిని చూసుకున్న తీరును గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన అనకాపల్లి సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సక్సెస్ అవ్వడంతో థాంక్యూ మీట్‌ నిర్వహించింది మూవీ టీమ్. ఆ సమయంలో నిర్మాత లగడపాటి శ్రీధర్ సినిమాలో ఇంద్రజ పోషించిన రోల్ తో పాటు ఆమె పర్సనాలిటీ గురించి కూడా మాట్లాడారు. అనకాపల్లి సినిమాకు అసలైన బిగ్గెస్ట్ స్టార్ ఇంద్రజ అని లగడపాటి శ్రీధర్ అన్నారు.

తెలుగు స్క్రీన్ పై జయసుధ తర్వాత అంతటి హుందాతనం, మంచి ఇమేజ్ ఉన్న నటి ఇంద్రజ అని ప్రశంసించారు. ఇప్పటికీ ఆమె హీరోయిన్‌ లాగే అందంగా కనిపిస్తున్నారని చెప్పారు. అలాంటి గ్లామర్, యాక్టింగ్ స్టామినా ఉన్న ఇంద్రజ ఇప్పటి జనరేషన్ హీరోలకు తల్లి పాత్రలు చేయడం తనకు కొంత బాధగా అనిపిస్తోందని లగడపాటి శ్రీధర్ అన్నారు. ఆమెకు ఇంకా మంచి లీడ్ రోల్స్ చేసే సత్తా ఉందని చెప్పారు.

అయితే కథకు, నటనకు ఆమె ఇచ్చే గౌరవం వల్లే అనకాపల్లిలో తల్లి పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంద్రజకు మరిన్ని మంచి తల్లి పాత్రలు రావాలని లగడపాటి కోరుకున్నారు. సౌత్ ఇండియన్ సినిమాల్లో జయసుధ తర్వాత గుర్తుండిపోయే తల్లి పాత్రలు చేసే స్థాయిలో ఇంద్రజ ఉన్నారని అన్నారు. ఇక ఇంద్రజ గురించి మాట్లాడిన సమయంలో లగడపాటి శ్రీధర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

గతంలో చెన్నై ఎయిర్‌ పోర్టులో ఇంద్రజ తన వృద్ధ తండ్రిని చూసుకున్న ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. వయసు మీద పడిన తండ్రిని ఆమె ఎంతో ప్రేమగా, చిన్నపిల్లాడిలా చూసుకున్నారని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తున్నాయని, అలాంటి సమయంలో ఇంద్రజ తన తండ్రిపై చూపించిన ప్రేమ తనను కదిలించిందని లగడపాటి తెలిపారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ స్టేజ్‌ పైనే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఒక నటిగా ఇంద్రజ ఎంత గొప్పవారో, ఒక కూతురిగా కూడా ఆమె అంతే గొప్ప వ్యక్తి అని లగడపాటి శ్రీధర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో తన పర్సనల్ లైఫ్ లోని హ్యూమన్ యాంగిల్ గుర్తు చేసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అనకాపల్లి విషయానికి వస్తే.. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఆ సినిమాలో విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించారు. త్రినాథరావు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో ఇంద్రజ కీలక పాత్రలో కనిపించారు. సినిమా విజయంతో మూవీ టీమ్ ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పింది.