Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్ 1 కోటి.. వ‌సూళ్లు 100కోట్లు.. అంతా కృష్ణ మాయ‌!

ఇప్పుడు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో గుజ‌రాతీ సినీప‌రిశ్ర‌మ‌లో ఒక రికార్డు న‌మోద‌వుతోంది.

By:  Sivaji Kontham   |   25 Nov 2025 10:31 AM IST
బ‌డ్జెట్ 1 కోటి.. వ‌సూళ్లు 100కోట్లు.. అంతా కృష్ణ మాయ‌!
X

ఈరోజుల్లో సినిమా ఆడ‌టానికి ప్రామాణిక‌త‌లు ఏమిటి? అంటే.. మొద‌ట‌గా క‌థాబ‌లం గురించి నిపుణులు మాట్లాడుతున్నారు. స్టార్ ప‌వ‌ర్ ని లీడ్ చేసేది క‌థాబ‌లం మాత్ర‌మే. మంచి క‌థ‌, క‌థ‌నం, దానికి త‌గ్గ పాత్ర‌లు కుదిరితే, ఎమోష‌న్స్ పండితే, మంచి సంగీతం జోడిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మాయాజాలం సృష్టిస్తోంది. ఇప్పుడు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో గుజ‌రాతీ సినీప‌రిశ్ర‌మ‌లో ఒక రికార్డు న‌మోద‌వుతోంది. ప‌రిశ్ర‌మ‌ మొద‌టి 100కోట్ల క్ల‌బ్ ని అందుకోబోతోంది. ఏడు వారాల్లో 70 కోట్లు సంపాదించిన ఈ చిత్రం `లాలో: కృష్ణ సదా సహాయతే`.

ఈ గుజరాతీ చిత్రం 10 అక్టోబర్ 2025న విడుదలైంది. ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత కూడా చాలా గుజ‌రాతీ సినిమాలు వ‌చ్చి వెళ్లాయి. కానీ లాలో అన్ స్టాప‌బుల్ గా అద్భుత వ‌సూళ్ల‌తో ముందుకు సాగుతోంది. నిజానికి ఈ సినిమా మొద‌టి వారంలో కేవ‌లం ల‌క్ష‌ల్లో ఆర్జించింది. మూడు నాలుగు వారాల వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి. కానీ నాలుగో వారంలోనే అస‌లు క‌థ మొద‌లైంది. మంచి ప‌బ్లిక్ టాక్ తో ఈ సినిమా నెమ్మ‌దిగా వ‌సూళ్ల‌లో పుంజుకుంది. నెమ్మ‌దిగా వేగం పుంజుకుని గుజరాతీ సినిమా చరిత్ర రికార్డులను బద్దలు కొట్టింది.

గుజరాతీ సినిమా 'లాలో: కృష్ణ సదా సహాయతే' నేడు గుజరాతీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. లాలో సినిమా 3 ఫిబ్రవరి 2019న విడుదలైన `చాల్ జీవి లయే` సినిమా సాధించిన 50కోట్ల వ‌సూళ్ల రికార్డును బ్రేక్ చేసింది. లాలో గుజరాతీ బాక్సాఫీస్ వద్ద 52 కోట్ల రికార్డును అధిగ‌మించింది.

గుజరాతీ బాక్సాఫీస్ వద్ద లాలో సినిమా వసూళ్లు వ‌రుస క్ర‌మాన్ని ప‌రిశీలిస్తే.. మొదటి వారంలో - కేవలం 35 లక్షలు మాత్రమే ఆర్జించ‌గా, రెండవ వారంలో - 65 లక్షలు వ‌సూలు చేసింది. మూడవ వారంలో - 1 కోటి కంటే ఎక్కువ సంపాదించింది. నాలుగవ వారంలో - 10 కోట్లు వ‌సూలైంది. ఐదవ వారంలో లాలో సినిమా మరో రికార్డును బద్దలు కొట్టి 40 కోట్లు ఆర్జించింది. కేవ‌లం 7రోజులలో 40కోట్లు. ఇది నిజంగా హిందీ సినిమా వ‌సూళ్ల కంటే ఎక్కువ‌. అంటే సినిమా 3 వారాలలో నెమ్మదిగా కొన‌సాగినా, నాలుగో వారం తర్వాత కృష్ణుడి ఆశీస్సులు పొంది కోట్లు కొల్ల‌గొట్టింద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఐదు వారాల్లో 52 కోట్లకు పైగా వ‌సూలు చేసింది. లాలో: కృష్ణ సదా సహాయతే గుజరాత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఏడో వారంలో 70కోట్లు వ‌సూలు చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆ త‌ర్వాత కూడా ఇది అన్ స్టాప‌బుల్ గా ముందుకు సాగుతోంది. ఇది నెమ్మ‌దిగా వ‌సూళ్ల‌ను పెంచుకుంటూ 100 కోట్ల వ‌సూళ్ల దిశ‌గా సాగుతోందని గుజ‌రాతీ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది.

'లాలో: కృష్ణ సదా సహాయతే` సినిమాను నిర్మించడానికి నిర్మాతలు చాలా రిస్కులే చేయాల్సి వ‌చ్చింది. కేవ‌లం 1 కోటి బడ్జెట్‌తో నిర్మించిన ఈ గుజరాతీ చిత్రం ఐదు వారాల్లో 50 కోట్ల మార్కును దాటుతుందని చిత్రనిర్మాతలు కలలో కూడా ఊహించలేరు. ప్రభుత్వం లాలో సినిమాను పన్ను మిన‌హాయింపులు ఇవ్వ‌క‌పోయినా, ఇప్పుడు ఈ చిత్రం అద్భుత లాభాల‌ను అందించడానికి కృష్ణుడే స‌హ‌క‌రించాడ‌ని గుజ‌రాతీ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంది. .

ఈ చిత్రానికి అంకిత్ స‌ఖియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇది హిందీ సహా దేశ‌వ్యాప్తంగా ఈ నెల 28న‌ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఒక ఆటో రిక్షా డ్రైవ‌ర్ జీవితంలో వెత‌ల గురించి దిగులుగా ఉంటాడు. అత‌డు ఒక‌సారి ఒంట‌రిగా ఫామ్ హౌస్ లో చిక్కుకుపోయిన క్ర‌మంలో అత‌డికి అక్క‌డ కృష్ణుడి లీల‌లు ఆవిష్కృత‌మ‌వుతాయి. ఆ త‌ర్వాత అత‌డిలో ఎలాంటి మార్పు వ‌చ్చింది? అన్న‌దే ఈ సినిమా క‌థాంశం. దీనిని టెక్నిక‌ల్ గా తెర‌పై ఆవిష్క‌రించిన విధానం ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట‌యింది.