లాలో : అప్పుడు రూ.50 లక్షలు, ఇప్పుడు 60 కోట్లు..!
నార్త్ ఇండియన్ సినిమాలు అనగానే హిందీ సినిమాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి.
By: Ramesh Palla | 20 Nov 2025 4:13 PM ISTనార్త్ ఇండియన్ సినిమాలు అనగానే హిందీ సినిమాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. అయితే నార్త్ ఇండియాలో మరాఠీ, పంజాబీ, గుజరాతీ భాషల్లోనూ సినిమాలు రూపొందుతాయి. అయితే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఆయా భాషల్లో సినిమాలు రూపొందుతూ ఉంటాయి. ఆయా భాషల్లో రూపొందిన సినిమాలు హిందీ భాషలోనూ డబ్ కావడం జరుగుతుంది. దాంతో ప్రత్యేకంగా ఆ భాష చిత్రంగా ప్రచారం జరగదు. కానీ కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పుడు, అందరి దృష్టి ఆకర్షించినప్పుడు మాత్రం ఇది ఫలానా భాష చిత్రం అని అంతా అనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం గుజరాతి భాషలో రూపొంది సూపర్ హిట్ అయిన లాలో సినిమా గురించి నార్త్ ఇండియాతో పాటు మొత్తం పాన్ ఇండియా ఫిల్మ్ మేకర్స్ మాట్లాడుకుంటున్నారు. సినిమాలో మ్యాటర్ ఏంటా అనే విషయాలను గూగుల్ చేసి మరీ తెలుసుకుంటున్నారు.
గుజరాతీ సినిమాలకు ప్రేక్షకాదరణ..
చాలా మందికి గుజరాతీలోనూ సినిమాలు తీస్తారా అనే అనుమానం ఉంది. ఇప్పటి వరకు చాలా తక్కువ సినిమాలు మాత్రమే గుజరాతి నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాయి. అందుకే గుజరాతీ సినిమాలకు ఎక్కువగా మీడియా పబ్లిసిటీ దక్కలేదు. కానీ తాజాగా వచ్చిన లాలో : కృష్ణ సదా సహాయతే సినిమా మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంకిత్ సఖియా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కరణ్ జోహి ప్రధాన పాత్రలో నటించాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం లాలో సినిమా కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో దర్శకుడు అంకిత్ సఖియా రూపొందించాడు. ఆయన పబ్లిసిటీ ఖర్చులు, ఇతర మొత్తం ఖర్చులు కలిపి కూడా కోటి రూపాయలు ఖర్చు చేయలేదు. అలాంటి చిన్న సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోరు. లాలో సినిమాకు సైతం అదే అనుభవం ఎదురైంది.
గత నెలలో వచ్చిన లాలో సినిమా...
లాలో సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారం రోజులు సినిమా గురించి పెద్దగా చర్చ జరగలేదు. దాంతో థియేటర్లు ఖాళీగా ఉండేవి. మెల్ల మెల్లగా మౌత్ టాక్ రావడం, సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చ జరగడం, చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ చేయడం, సినిమాలోని క్లిప్స్ సోషల్ మీడియాలో రావడం వంటి కారణాలతో లాలో సినిమా ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చింది. రెండు వారాల తర్వాత సినిమా వసూళ్లు పెరగడం మొదలైంది. విడుదలైన నెల రోజుల్లో సినిమాకు ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపుగా రూ.60 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ నెంబర్ రూ.100 కోట్లు చేరినా ఆశ్చర్యం లేదని గుజరాతీ ఫిల్మ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన లాలో..
ఈ సినిమాలో లాలో అనే ఒక ఆటో రిక్షా డ్రైవర్ పేదరికం కారణంగా ఈజీ మనీ కోసం ప్రయత్నాలు చేస్తాడు. మద్యానికి బానిస అయిన అతడు అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం అనుకోకుండా ఒక ఫామ్ హౌస్‌లోకి వెళ్లి చిక్కుకు పోతాడు. ఆ సమయంలో అతడి మానసిక పరిస్థితి ఎలా మారింది, అతడు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలకు ఆ ఫామ్ హౌస్‌లో ఎలాంటి పరిష్కారం లభించింది, చివరకు శ్రీకృష్ణుడు అతడికి కనిపించి ఏం చెప్పాడు అనేది సినిమా కథ. ఒక వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే సమస్యలను చూపిస్తూనే వాటిని పరిస్కరించుకోవడానికి ఉన్న మార్గాలను సైతం ఈ సినిమాలో చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే విధంగా లాలో జీవితం, అతడి యొక్క జర్నీ సాగుతుంది. అందుకే సినిమా కేవలం రూ.50 లక్షలతో రూపొంది ఏకంగా రూ.60 కోట్ల వసూళ్లు సాధించింది. ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మంచి సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆధరణ ఉంటుందని మరో సారి నిరూపితం అయ్యింది.
