టాలీవుడ్ లోకి KVN.. ప్లాన్ ఎలా ఉండాలంటే..
కన్నడలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న బ్యానర్.. ఇప్పుడు భారీ చిత్రాలు నిర్మిస్తూ పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది.
By: M Prashanth | 25 Sept 2026 12:00 AM ISTకన్నడలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న బ్యానర్.. ఇప్పుడు భారీ చిత్రాలు నిర్మిస్తూ పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది. అదే KVN ప్రొడక్షన్స్. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్లు, భారీ కథలతో వరుస ప్రాజెక్టులు చేస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లోనూ స్ట్రాంగ్ గా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ KVN ప్లాన్ ఎలా ఉండాలన్నది హాట్ టాపిక్ గా మారింది.
KVNకు సినిమా బిజినెస్ కొత్త కాదు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ లో ఆ సంస్థకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్, యానిమల్, కల్కి 2898 ఏడీ, దేవర వంటి సినిమాలను కర్ణాటకలో విడుదల చేసి మంచి ఫలితాలు అందుకుంది. సినిమా మార్కెట్ ఎలా పనిచేస్తుంది, రిలీజ్ ఎలా ప్లాన్ చేయాలి అనే విషయంలో KVNకు ఇప్పటికే అవగాహన ఉంది.
అయితే ప్రొడక్షన్ లోకి వచ్చాక లెక్కలు కాస్త మారాయి. భారీ బడ్జెట్ తో వచ్చిన కొన్ని సినిమాలు అంచనాలకు తగ్గ రిజల్ట్స్ ఇవ్వలేదు. జననాయగన్, టాక్సిక్, కేడీ: ది డెవిల్, హైవాన్ వంటి సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేదు. అదే సమయంలో బాలన్: ది బాయ్ మాత్రం మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక్కడి నుంచి KVNకు ఒక విషయం క్లియర్ గా కనిపిస్తుంది.
భారీ సినిమా అంటే భారీ బడ్జెట్ మాత్రమే కాదు. కథకు తగ్గ ఖర్చు, హీరో మార్కెట్ కు తగ్గ ఇన్వెస్ట్మెంట్, రిలీజ్ కు తగ్గ ప్లాన్ కూడా అంతే ముఖ్యం. వందల కోట్లు ఖర్చు పెట్టడమే పెద్ద సినిమా కాదు. పెట్టిన డబ్బుకు తగ్గ స్క్రీన్ పై కంటెంట్ ఉండటం అసలు విషయం. టాలీవుడ్ లోకి వస్తున్నప్పుడు అది మరింత మెయిన్. తెలుగు ప్రేక్షకులు స్టార్ హీరోలను ఆదరిస్తారు.
అదే సమయంలో కథ, పాటలు, యాక్షన్, ఎమోషన్ ఇలా ప్రతి విషయంలోనూ అంచనాలు పెంచుకుంటారు. అందుకే తెలుగు దర్శకులు, రైటర్లతో కలిసి ఇక్కడి నేటివిటీకి దగ్గరగా ఉండే కథలపై ఫోకస్ పెట్టడం KVNకు ఉపయోగపడొచ్చు. అలాగే లైనప్ లో కూడా బ్యాలెన్స్ అవసరం. వరుసగా వందల కోట్ల బడ్జెట్ సినిమాలు చేయడం కంటే.. ఒకటి రెండు పెద్ద చిత్రాలతోపాటు మంచి కథ ఉన్న మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మించొచ్చు.
దీనివల్ల బ్యానర్ నుంచి భిన్నమైన సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. KVNకు ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పీరియన్స్ మరో పెద్ద ప్లస్ పాయింట్. ఏ సినిమా ఏ మార్కెట్ లో ఎలా రిలీజ్ చేయాలి, థియేటర్లను ఎలా ప్లాన్ చేయాలి, ప్రమోషన్ ఏ స్థాయిలో చేయాలనే విషయంలో ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. నిర్మాణంతో పాటు రిలీజ్ బిజినెస్ ను కూడా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకోవచ్చు.
హీరోల విషయంలోనూ స్టార్ పవర్ ఒక్కటే లెక్క కాకూడదు. హీరో ఇమేజ్ కు సరిపోయే కథ, ఆ కథను చెప్పగల దర్శకుడు, అందుకు తగ్గ బడ్జెట్.. ఆ మూడు కుదిరితేనే కాంబినేషన్ కు స్ట్రెంత్ వస్తుంది. ప్రస్తుతం చిరంజీవితో కాకా వంటి భారీ ప్రాజెక్ట్ తో KVN టాలీవుడ్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఫ్యూచర్ లో మరిన్ని తెలుగు ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.
