Begin typing your search above and press return to search.

ఒక్క మూవీకి ఒక్కో తలనొప్పి.. మెగా ప్రొడ్యూసర్ కే ఎందుకిలా?

టాలీవుడ్‌ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌ కు వరుసగా ఎదురవుతున్న అడ్డంకులు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారాయి.

By:  M Prashanth   |   25 April 2026 1:33 PM IST
ఒక్క మూవీకి ఒక్కో తలనొప్పి.. మెగా ప్రొడ్యూసర్ కే ఎందుకిలా?
X

టాలీవుడ్‌ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌ కు వరుసగా ఎదురవుతున్న అడ్డంకులు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారాయి. ఒక సినిమా పూర్తవుతుందంటే మరో సమస్య తలెత్తడం, రిలీజ్ దశలో వివాదాలు చుట్టుకోవడం ఆ బ్యానర్‌ ను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో ఏం జరుగుతుందన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న మెగా 158 చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తోంది. ఆ ప్రాజెక్ట్‌ తో టాలీవుడ్‌ లో స్ట్రాంగ్ ప్లేస్ సంపాదించాలనే టార్గెట్ తో ఉన్న ఆ సంస్థకు వరుస ఇబ్బందులు ఎదురవుతుండటం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆ బ్యానర్‌ లో తెరకెక్కుతున్న పలు చిత్రాలు వివాదాల్లో చిక్కుకున్నాయి.

ముఖ్యంగా దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ చిత్రం సెన్సార్ సమస్యలు, కోర్టు కేసులతో ఆలస్యమవుతూ వచ్చింది. అంతేకాకుండా ఇటీవల సినిమా లీక్ కావడం పెద్ద షాక్‌ గా మారింది. మరోవైపు యష్ హీరోగా రూపొందుతున్న టాక్సిక్ సినిమా కూడా అనుకున్న తేదీకి విడుదల కాలేదు. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఆ చిత్రం వాయిదా పడటం నిర్మాతలకు తలనొప్పిగా మారింది.

ఆ ప్రభావం మెగా 158 ప్రారంభంపై పడినట్లు వార్తలు వచ్చాయి. లాంచింగ్ ఈవెంట్ వాయిదా పడగా, నిర్మాణ బాధ్యతలు చేతులు మారుతున్నాయన్న వార్తలను నిర్మాతలు ఖండించారు. ఇక తాజాగా ధ్రువ్ సర్జా హీరోగా తెరకెక్కిన కేడీ: ది డెవిల్ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. దర్శకుడు ప్రేమ్ రూపొందించిన ఆ చిత్రంలోని ఓ పాటపై ముందు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

లిరిక్స్, డ్యాన్స్ మూమెంట్స్‌ పై విమర్శలు రావడంతో ఆ పాటను అన్ని ప్లాట్‌ ఫామ్స్ నుంచి తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు అదే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ నుంచి మాయం కావడం చర్చకు దారితీసింది. ఏం జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పందించింది. సర్టిఫికేషన్‌ కు తగ్గట్లు లేని కొన్ని సన్నివేశాలు పొరపాటున చేరినట్లు వెల్లడించింది. అందుకే ట్రైలర్‌ ను తొలగించి, ఎడిటెడ్ వెర్షన్ ను విడుదల చేస్తామని తెలిపింది.

"సర్టిఫికేషన్ ప్రక్రియలో పొరపాటు జరిగింది. దానికి మేం సారీ చెబుతున్నాం. అన్ని నిబంధనలు పాటిస్తూ ఎడిటెడ్ ట్రైలర్‌ ను త్వరలో విడుదల చేస్తాం" అని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. మొత్తానికి కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో తెరకెక్కుతున్న ప్రతి సినిమా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటుండటం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక ప్లానింగ్ లో లోపాలా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరేం జరిగిందో వారికే తెలియాలి.