Begin typing your search above and press return to search.

ఆ బాధ నాకు నిద్ర పట్టనివ్వడం లేదు..

అయితే ఇప్పుడు ఈ ఘటనపై సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సినీ నటి రష్మిక మందన్న ఎమోషనల్ కామెంట్లు చేశారు.

By:  Madhu Reddy   |   25 Oct 2025 10:25 AM IST
ఆ బాధ నాకు నిద్ర పట్టనివ్వడం లేదు..
X

హైదరాబాదు నుండి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్ బస్ కర్నూలుకి 10 కిలోమీటర్ల దూరంలో బైక్ ను ఢీ కొట్టి అత్యంత దారుణంగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఇందులో 42 మంది ప్రయాణికులు ఉండగా ఇద్దరు డ్రైవర్లు ఘటన సమయంలో అక్కడి నుండి పారిపోగా.. 42 మందిలో 19 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. ఇక మిగతావారు కిటికీ అద్దాలు పగలగొట్టుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బస్సు నుండి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషాదకర ఘటనపై విచారణ వ్యక్తం చేస్తున్నారు.

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా పలువురు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా మృతులకు, ఈ ఘటనలో గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఘటనపై సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సినీ నటి రష్మిక మందన్న ఎమోషనల్ కామెంట్లు చేశారు. రష్మిక ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ.. కాలిపోయే ముందు ప్రయాణికులు అనుభవించిన భాధ తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. ఆ బాధ నాకు నిద్ర కూడా పట్టనివ్వడం లేదు అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది.

ఈ ఘటనపై రష్మిక మాట్లాడుతూ.. "కర్నూలు ప్రమాదవార్త నా హృదయాన్ని ముక్కలు చేసింది. ఎంతో బాధపడ్డాను. మండుతున్న బస్సు లోపల ఆ ప్రయాణికులు అనుభవించిన బాధ వర్ణించలేనిది. ముఖ్యంగా మంటలకు తమ శరీరం కాలిపోతున్నప్పుడు వాళ్ళు ఆ బాధ ఎంత అనుభవించారో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇందులో చిన్నపిల్లలతో సహా ఒక కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ రష్మిక ఎమోషనల్ కామెంట్లు చేసింది.

రష్మిక తో పాటు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రియల్ స్టార్ సోనూ సూద్ కూడా ఈ ఘటనపై స్పందించారు. దీనిపై కిరణ్ అబ్బవరం స్పందిస్తూ.. "కర్నూలు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన విని చాలా బాధపడ్డాను. ఈ దురదృష్టకరమైన సంఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులను తలుచుకుంటేనే చాలా బాధ వేస్తోంది. భగవంతుడు వారికి బలాన్ని ఇవ్వాలి అని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను" అంటూ కిరణ్ అబ్బవరం తెలిపారు.

అలాగే సోనూసూద్ కూడా స్పందిస్తూ... "ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాలలో రెండు వారాల్లోనే దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు చూసిన ప్రమాదాలు చాలు.. ఇప్పటికైనా కఠిన నిబంధనలు అమలు చేయండి" అంటూ ప్రభుత్వాలను కోరారు హీరో సోనూ సూద్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.