Begin typing your search above and press return to search.

ప‌దేళ్ల త‌ర్వాతా అలా పిలుస్తున్నార‌ని హీరో ఎమోష‌న‌ల్

వ్యక్తిగతంగా తాను పరివర్తన చెందిన అద్బుత‌ ప్రదేశంగా బ‌నార‌స్ ని ధ‌నుష్‌ అభివర్ణించాడు.

By:  Sivaji Kontham   |   28 Nov 2025 9:28 AM IST
ప‌దేళ్ల త‌ర్వాతా అలా పిలుస్తున్నార‌ని హీరో ఎమోష‌న‌ల్
X

ఏదైనా పాత్ర ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింది అన‌డానికి సింబాలిక్ ఏది? అంటే.. ద‌శాబ్ధం గ‌డిచాక కూడా అదే పాత్ర పేరును గుర్తు పెట్టుకుని ఆ ప్రాంతంలోకి వ‌చ్చిన న‌టుడిని ఆ పేరుతో పిలిస్తే, అది క‌చ్ఛితంగా బ‌ల‌మైన ముద్ర వేసిన‌ పాత్ర అని చెప్పొచ్చు. ఇప్ప‌టికీ రాంజానా (ధ‌నుష్ న‌టించిన తొలి హిందీ సినిమా) చిత్రంలోని `కుంద‌న్` పేరును మ‌ర్చిపోకుండా ప‌దేళ్ల త‌ర్వాత కూడా వార‌ణాసి వీధుల్లో కుంద‌న్ అనే పేరుతో ఆ న‌టుడిని పిల‌వ‌డం నిజంగా గొప్ప విష‌యం. `తేరే ఇష్క్ మే` ప్ర‌మోష‌న్స్ లో ఉన్న ధ‌నుష్ ఇదే విష‌యాన్ని చెబుతూ, త‌న‌కు వార‌ణాసి ప్ర‌జ‌ల‌తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. అక్క‌డ త‌న‌ను ప‌దేళ్ల త‌ర్వాతా `కుంద‌న్` అని పిలుస్తున్నార‌ని, ఇది మ‌ర‌పురాని జ్ఞాప‌కం అని ధ‌నుష్ ఎమోష‌న‌ల్ అయ్యారు. రాంజానా విడుద‌లైన ప‌దేళ్ల‌కు అదే ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్ రాయ్ తెర‌కెక్కించిన తేరే ఇష్క్ మే రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా వార‌ణాసిలో మ‌హ‌దేవ్ ని సంద‌ర్శించిన ధ‌నుష్ ఎంతో ఎమోష‌న‌ల్ గా ఆ న‌గ‌రం గురించి, అక్క‌డ ప్ర‌జ‌ల అభిమానం గురించి మాట్లాడాడు.

ధనుష్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో వార‌ణాసి ప‌ర్య‌ట‌న ఫోటోల‌ను కూడా షేర్ చేసారు. గంగానది ప‌రిస‌రాల్లో నిశ్శబ్ద క్షణాలు గడుపుతూ, సూర్యాస్తమయాన్ని చూస్తూ, భక్తిలో మునిగిపోయిన ధ‌నుష్ ఫోటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. ఈ సందర్శన సమయంలో వార‌ణాసి- బనారస్ తో తనకున్న ఆధ్యాత్మిక సంబంధం , మహాదేవ్ పై తనకున్న విశ్వాసం గురించి ధనుష్ మాట్లాడారు. బ‌నార‌స్ న‌గ‌రం త‌న‌కు ఆధ్యాత్మిక మేల్కొలుపు అని మ‌హ‌దేవ్‌కు త‌న‌ను తాను అర్పించుకున్నాన‌ని అన్నారు.

వ్యక్తిగతంగా తాను పరివర్తన చెందిన అద్బుత‌ ప్రదేశంగా బ‌నార‌స్ ని ధ‌నుష్‌ అభివర్ణించాడు. అత‌డు మాట్లాడుతూ-''వారణాసి నాకు కేవలం ఒక నగరం మాత్రమే కాదు.. అది ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు.. నేను ప్రతి వీధితో, ప్రతి ఘాట్‌తో, ప్రతి ఆలయంతో కనెక్ట్ అయ్యాను. మ‌హ‌దేవ్ కారణంగా నాలో ఒక మేల్కొలుపు వచ్చింది. నన్ను నేను మహాదేవ్‌కు అర్పించాను`` అని ధ‌నుష్ ఎమోష‌న‌ల్ అయ్యారు.

తేరే ఇష్క్ మెయిన్ వివ‌రంలోకి వెళితే... ధనుష్ తో కలిసి నటించిన రాంఝనా (2013) 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంలో శంకర్ (ధ‌నుష్‌) తో ప్రేమలో పడే ముక్తి అనే యువతి పాత్రలో కృతి సనన్ నటించారు. శంకర్ ను తీవ్రమైన, అనూహ్యమైన తిరుగుబాటుదారుడిగా ఈ చిత్రంలో చూపించారు. పరిస్థితులు ప్రేమికుల‌ను వేరు చేసినప్పుడు, శంకర్ ఆ బాధను తట్టుకోవడానికి కష్టపడతాడు. ఆ స‌మ‌యంలో దీనికి కార‌ణ‌మైన దిల్లీపై ఎలాంటి శ‌ప‌థం చేసాడ‌నేది తెర‌పైనే చూడాలి.

ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, టి-సిరీస్ - కలర్ యెల్లో ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించారు. ఈరోజు(28న‌వంబ‌ర్) ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. దీనికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.