థియేటర్లలో యాడ్స్ మోతాదు మించితే వినియోగదారుల ఫోరమ్‌కి ఫిర్యాదు చేయడమెలా?
థియేటర్లలో యాడ్స్ మోతాదు మించి సమయం వృధా చేస్తే.. వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసే విధానం:
By: Sivaji Kontham | 29 Sept 2026 3:36 PM ISTసినిమాకు వెళ్లినప్పుడు ఆన్‌టైమ్‌కు సీట్లో కూర్చున్నా.. తెరపై సినిమా పడటానికి కనీసం ఇరవై నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు చూడాల్సి రావడం నేడు సర్వసాధారణమైపోయింది. టికెట్లు కొనుగోలు చేసి సినిమా సమయానికి థియేటర్‌కు వెళ్లినా యాడ్స్ రూపంలో తమ విలువైన సమయం వృధా అవుతుండటంతో ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇలాంటి చికాకులపై ఒక బాధితుడు కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించడంతో థియేటర్ల నిర్లక్ష్య వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 2025 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో `కుబేర` సినిమా ప్రదర్శన జరగాల్సి ఉంది. రాత్రి 10:35 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం కేవలం కమర్షియల్ యాడ్స్-బ్రాండ్ ప్రమోషన్ల కారణంగా సుమారు 22 నిమిషాలు ఆలస్యంగా స్క్రీన్‌పైకి వచ్చింది. సినిమా సమయాన్ని పూర్తిగా విస్మరించి ఈ విధంగా విపరీతంగా ప్రకటనలు ప్రసారం చేయడంపై విసిగిపోయిన సదరు ప్రేక్షకుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన వినియోగదారుల కోర్టు థియేటర్ యాజమాన్యానికి గట్టి షాకిస్తూ రూ. 75,000 జరిమానా విధించింది. ప్రేక్షకుల సమయాన్ని వృధా చేసినందుకు గాను బాధితుడికి పరిహారంగా రూ. 25వేలు, అలాగే జిల్లా వినియోగదారుల బెంచ్‌కు రూ. 50వేలు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత సినిమా సమయానికి వచ్చి కూడా యాడ్స్ భరించాల్సి వస్తున్న ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలపై కోర్టులు కొరడా ఝుళిపించిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు, `సామ్ బహదూర్` సినిమా ప్రదర్శనకు ముందు సుమారు 25 నిమిషాల పాటు సుదీర్ఘమైన ప్రకటనలు ప్రసారం చేసి ప్రేక్షకుడి సమయాన్ని వృధా చేసినందుకు గాను, బెంగళూరు వినియోగదారుల కోర్టు పాపులర్ మల్టీప్లెక్స్ సంయుక్త యాజమాన్యానికి రూ. 1 లక్ష జరిమానాతో పాటు అదనంగా పరిహార ఖర్చులు చెల్లించాలని తీర్పునిచ్చింది.
భారతదేశంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సినిమా ప్రదర్శనకు ముందు లేదా మధ్యలో ప్రదర్శించే పబ్లిక్ సర్వీస్ లేదా ప్రకటనల సమయం పరిమితంగా.. నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఉండాలి. అయితే కేవలం వాణిజ్య లాభాపేక్షతో కొన్ని థియేటర్లు నిబంధనలను బేఖాతరు చేస్తూ నిరంతరం యాడ్స్ ప్రసారం చేస్తున్నాయి. ప్రేక్షకుల అసహనాన్ని, చట్టపరమైన నిబంధనలను లెక్కచేయని ఇలాంటి థియేటర్ల తీరును తప్పుపడుతూ వినియోగదారుల కమిషన్‌లు తీసుకుంటున్న ఈ చర్యలు సినిమా ప్రేక్షకులకు పెద్ద ఊరటనిస్తున్నాయి.
థియేటర్లలో యాడ్స్ మోతాదు మించి సమయం వృధా చేస్తే.. వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసే విధానం:
సాక్ష్యాలను సేకరించడం: సినిమా టికెట్, షో సమయం, థియేటర్ పేరు, యాడ్స్ కారణంగా సినిమా ఎంత ఆలస్యంగా ప్రారంభమైందో దానికి సంబంధించిన ఆధారాలను (వీలైతే వీడియో రికార్డింగ్ లేదా ఫోటోలు) భద్రపరుచుకోవాలి.
థియేటర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం: ముందుగా థియేటర్ మేనేజర్ లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించి, నిర్దేశిత సమయం కంటే ఎక్కువగా యాడ్స్ ప్రదర్శించడం ద్వారా మీ సమయం వృధా అయినట్లు లిఖితపూర్వకంగా లేదా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలి.
లీగల్ నోటీసు పంపడం: థియేటర్ యాజమాన్యం నుంచి సరైన స్పందన రాకపోతే, మీ సమయాన్ని వృధా చేసినందుకు, సేవా లోపం కింద ఒక లీగల్ నోటీసు పంపవచ్చు.
కన్స్యూమర్ ఫోరమ్‌లో కేసు నమోదు చేయడం: ఆన్‌లైన్ ద్వారా నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ లేదా E-దాఖిల్ పోర్టల్ లేదా నేరుగా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించి.. మీ దగ్గర ఉన్న టికెట్ .. ఇతర సాక్ష్యాలతో ఫిర్యాదును దాఖలు చేయాలి.
కోర్టు విచారణ సమయంలో థియేటర్ల నిర్లక్ష్య వైఖరిని, మానసిక వేదనను, సమయం వృధా అయిన అంశాన్ని వివరించి తగిన నష్టపరిహారాన్ని- కోర్టు ఖర్చులను కోరుతూ వాదనను వినిపించాలి.
