Begin typing your search above and press return to search.

పవన్ తో 'చిరు' డైరెక్టర్.. ఏంటి కథ?

మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది

By:  M Prashanth   |   8 April 2026 7:46 PM IST
పవన్ తో చిరు డైరెక్టర్.. ఏంటి కథ?
X

టాలీవుడ్‌ లో ఆసక్తికర చర్చలకు దారితీసిన ఓ మీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మెగా 158 ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్న బాబీ, పవన్‌ ను కలిసిన వెంటనే సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్‌ తో కలిసి పనిచేసిన బాబీ, ఆ సమయంలో ఆయనను ఒక నటుడిగా చూసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు అదే పవన్ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన విధానం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. ఆయనను కలిసిన క్షణాన్ని వివరిస్తూ.. లోపలికి వెళ్లగానే చిరునవ్వుతో కనిపించిన పవన్ ఒక రుషిలా అనిపించారంటూ చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులు కూడబెట్టుకున్న నాయకులను తరచూ చూస్తుంటామని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమని బాబీ ప్రశంసించారు. "తనకు ఉన్న విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆయన నాకు ఒక శిఖరంలా కనిపించారు" అని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తనపై చూపిన ఆప్యాయత, ప్రేమ తనను ఎంతో ప్రభావితం చేసిందని కూడా తెలిపారు.

ఇక తన పోస్టులో బాబీ చేసిన పోలిక మరింత చర్చకు దారి తీసింది. జ్ఞానం కోసం రాజభోగాలను వదిలేసి అడవులకు వెళ్ళిన గౌతమ బుద్ధుడు గురించి మనం చరిత్రలో చదువుకున్నామని, కానీ ప్రజల కోసం సుఖాలను త్యాగం చేసి నిరంతరం శ్రమిస్తున్న ఒక కర్మయోగిని ప్రత్యక్షంగా చూసానని పవన్‌ ను కొనియాడారు. చివరగా "జైహింద్.. లవ్ యు ఆల్వేస్ మై పవర్ స్టార్" అంటూ ముగించిన ఆయన వ్యాఖ్యలు పవన్ అభిమానులను ఉత్సాహానికి గురి చేస్తున్నాయి.

ఆ ఎమోషనల్ పోస్ట్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు బాబీ, పవన్ కళ్యాణ్‌ తో మరో సినిమా చేయడానికి స్టోరీ డిస్కషన్ కోసం కలిసి ఉంటారని అంచనా వేస్తున్నారు. పవన్ కోసం ప్రత్యేకంగా ఓ పవర్‌ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారా అంటూ చర్చిస్తున్నారు. ఇంకొందరు ఏప్రిల్ 11న ప్రారంభం కానున్న చిరంజీవి సినిమా పూజ కార్యక్రమానికి పవన్‌ ను ఆహ్వానించడానికే వెళ్లినట్లు భావిస్తున్నారు.

మరికొందరు మెగా 158 చిత్రంలో పవన్ కళ్యాణ్ క్యామియో రోల్ గురించి చర్చించడానికి వెళ్ళి ఉండొచ్చని ఊహిస్తున్నారు. మొత్తానికి బాబీ, పవన్ మధ్య నిజంగా సినిమా ప్లానింగ్ ఉందా? లేక కేవలం మర్యాదపూర్వక భేటీనా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఆ పోస్ట్‌ తో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరి అసలు విషయం ఏంటో వారికే తెలియాలి.