హృతిక్ క్రిష్ 4 ఎందుకింత ఆలస్యం?
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటించిన క్రిష్, క్రిష్ 2, క్రిష్ 3 చిత్రాలు సంచలన వసూళ్లతో భారతదేశంలో ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 30 Nov 2025 3:00 PM ISTబాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటించిన క్రిష్, క్రిష్ 2, క్రిష్ 3 చిత్రాలు సంచలన వసూళ్లతో భారతదేశంలో ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు చిత్రాలకు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకనిర్మాత. అయితే క్రిష్ 3 విడుదలై చాలా ఏళ్లు అయినా ఇప్పటికీ క్రిష్ 4 సెట్స్ కి వెళ్లకపోవడంపై అభిమానులు చాలా అసహనంతో ఉన్నారు. చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ పలుమార్లు క్రిష్ 4 ని అధికారికంగా ప్రకటించారు. కానీ ఇది సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. దీనికి కారణం మారిన సాంకేతికత, వీఎఫ్ ఎక్స్ మాయాజాలం కోసం అసాధారణ బడ్జెట్లను కేటాయించాల్సి ఉంటుందని, అంత స్థోమత తన ఒక్కడికే లేదని రాకేష్ రోషన్ బహిరంగంగా వెల్లడించారు. అవెంజర్స్, బ్లాక్ పాంథర్, అవతార్ లాంటి సినిమాలు చూసిన ప్రజలకు సాధాసీదా సినిమా చూపిస్తామంటే కుదరదని, హాలీవుడ్ కి ధీటుగా క్రిష్ 4ని తెరకెక్కించాల్సి ఉంటుందని, దానికోసం బడ్జెట్ సరిపోవడం లేదని రాకేష్ రోషన్ సూటిగా విషయం చెప్పారు.
కేవలం బడ్జెట్ సానుకూలతలో సహకరించకపోవడం వల్లనే నిర్మాత రాకేష్ రోషన్ నాలుగైదేళ్ల పాటు ఎదురు చూసారు. ఎట్టకేలకు హృతిక్ రోషన్ దర్శకనిర్మాతగా యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టు ప్రకటించగా, అది అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు చాలా నిర్మాణ సంస్థలను సంప్రదించినా కానీ ఈ క్రేజీ ప్రాజెక్టుకు బడ్జెట్ పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరిగా యష్ రాజ్ ఫిలింస్ ఈ అతి భారీ బడ్జెట్ చిత్రానికి సహకరించేందుకు ముందుకు వచ్చిందని రాకేష్ రోషన్ చాలా సంతోషం వ్యక్తం చేసారు. పైగా తనయుడు హృతిక్ స్వయంగా కెప్టెన్ గా మారుతుంటే ఆ ఆనందం ఉద్వేగంగా మారింది. రాకేష్ రోషన్, హృతిక్ సోదరి కూడా ఎంతో ఉద్వేగంగా దీనిపై స్పందించారు.
అయితే ఇంత జరిగాక కూడా ఇప్పటికీ క్రిష్ 4 ప్రారంభం కాకపోవడంపై అభిమానులు సీరియస్ గా ఉన్నారు. అసలు ఈ సినిమా సెట్స్ కి వెళుతుందా? లేదా? ఇందులో నటించే కాస్టింగ్ ఎవరు? సాంకేతిక నిపుణులు ఎవరు చేరారు? అంటూ ఆరాలు తీస్తుంటే ఒక్క చిన్న సమాచారం కూడా బయటకు రావడం లేదు. దీనికి కారణం ఇంకా తమను ఆర్థికంగా ఆదుకునే వాళ్లు కరువయ్యారా? అన్న చర్చ సాగుతోంది. ఈ సినిమాను నిర్మించేందుకు హృతిక్ రోషన్ కొంత బడ్జెట్ ని అరేంజ్ చేసినా అది సరిపోదు. దీనికి వందల కోట్లు అవసరం అవుతుంది. ఒక రకంగా అమీర్ ఖాన్, రాజమౌళి ప్రతిపాదించే మహాభారతం బడ్జెట్ లాంటిది అనుకోవచ్చు. అందుకే ఇది అంతకంతకు ఆలస్యమవుతూనే ఉంది. తాజా పరిణామాలను బట్టి యష్ రాజ్ ఫిలింస్ కూడా బడ్జెట్ విషయంలో చేతులెత్తేసిందా? అన్న గుసగుస వేడెక్కిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఏదైనా మాట్లాడుకోవాలంటే, 2026 జనవరి వరకూ వేచి చూడాల్సి ఉంటుంది. దీనిని కొత్త సంవత్సరంలో కొత్తగా అధికారికంగా ప్రకటించేందుకు వీలుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
భారతదేశపు అతిపెద్ద సూపర్ హీరో ఫ్రాంచైజ్ క్రిష్ 4 కి భారత సూపర్ స్టార్ హృతిక్ రోషన్ దర్శకుడిగా మారుతున్నాడు! ఈ భారీ ఫ్రాంచైజీలో గత మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలలో కూడా నటించిన హృతిక్, వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుందని యష్ రాజ్ ఫిలింస్ తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. ఈ భారీ అంచనాల చిత్రానికి నటుడు-దర్శకుడి పాత్రను హృతిక్ పోషిస్తున్నాడని కూడా పేర్కొంది.. ప్రస్తుతానికి అధికారిక వెబ్ సైట్ లో ఈ సమాచారం అందుబాటులో ఉంది గనుక, ఇంకా ఇది ముగింపు కాదని భావించాల్సి ఉంటుంది. మరోవైపు తన కొత్త చిత్రాల ప్రగతి కోసం, క్రిష్ 4ని పట్టాలెక్కించక ముందే దాదాపు 28 కోట్ల పెట్టుబడితో హృతిక్ రోషన్ ముంబైలో భారీ ఆఫీస్ స్పేస్ ని కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
