Begin typing your search above and press return to search.

గాయ‌కుడిని పెళ్లాడుతున్న‌ కృతి స‌నోన్ సోద‌రి

ఈ జంట‌ పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు.. ఈ జంట పెళ్లికి సిద్ధ‌మైంద‌ని తెలిసింది.

By:  Sivaji Kontham   |   23 Dec 2025 10:30 AM IST
గాయ‌కుడిని పెళ్లాడుతున్న‌ కృతి స‌నోన్ సోద‌రి
X

1-నేనొక్క‌డినే బ్యూటీ కృతి స‌నోన్ సోద‌రి నూపుర్ స‌నోన్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కృతి బాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగుతుండ‌గానే, నూపుర్ మోడ‌ల్ గా న‌టిగా త‌న‌ను తాను ఎలివేట్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ కృతి రేంజులో న‌టిగా ఎద‌గ‌డంలో త‌డ‌బ‌డింది. ఇటీవ‌ల ఈ బ్యూటీ ప్ర‌ముఖ గాయకుడు స్టెబిన్ బెన్ తో డేటింగ్ లో ఉందంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి.

ఈ జంట‌ పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు.. ఈ జంట పెళ్లికి సిద్ధ‌మైంద‌ని తెలిసింది. జనవరి 11న ఉదయపూర్‌లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని స‌మాచారం. ఆ మేర‌కు జాతీయ మీడియాలు క‌థ‌నాల్ని ప్ర‌చురించాయి. ప్రీవెడ్డింగ్ వేడుకలు జనవరి 9 నుండి 11 వరకు జరుగుతాయి. జనవరి 11న తాళి క‌ట్టు ముహూర్తం ఫిక్స‌యింది.

మూడు రోజుల పాటు సాగే ఈ వివాహ మ‌హోత్స‌వం కేవ‌లం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగే ఒక ప్రైవేట్ వేడుక అని చెబుతున్నారు. ఆడంబరంగా ఉన్నా కానీ, ప‌రిశ్ర‌మ నుంచి ప‌రిమితంగా స్నేహితులు మాత్ర‌మే హాజ‌ర‌వుతారు. నూపుర్- స్టెబిన్ పెళ్లిని వ్య‌క్తిగ‌తంగా మాత్ర‌మే ఊహ‌స్తున్నారు. ఉద‌య్ పూర్ వేడుక అంతటా భద్రతా ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా ఉంటాయని తెలిసింది. పెళ్లి అనంత‌రం, ఈ జంట ముంబైలో విడిగా ఒక రిసెప్షన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. జనవరి 13న విందును భారీగా ప్లాన్ చేస్తార‌ని తెలిసింది. ముంబై రిసెప్షన్‌లోనే పరిశ్రమకు చెందిన ప్ర‌ముఖుల‌తో పాటు, స్నేహితులు ఈ జంటను అభినందించడానికి హాజరవుతారు.

నిజానికి నూపుర్ సనన్‌తో తన సంబంధంపై గాయ‌కుడు స్టెబిన్ బెన్ ఇటీవ‌ల ఓ కామెంట్ చేసారు. అత‌డు ఓ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానిస్తూ, తాను ఇంకా ఒంటరిగా ఉన్నానని అన్నారు. ఒక‌ కళాకారుడిగా ప్రస్తుతం ఎవరితోను సంబంధంలో కొన‌సాగ‌డానికి, సమయం కేటాయించలేని ప‌రిస్థితి ఉంది. నెలలో 30 రోజులకు 25 రోజులు ప్రయాణంలో ఉన్నప్పుడు ఇతర విషయాల‌పై దృష్టి పెట్టడానికి సమయం ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. త‌న స్నేహితురాలి గురించి చెబుతూ.. నూపుర్ తో నాకు అద్భుతమైన అనుబంధం ఉంది. మేము చాలా సన్నిహితంగా ఉంటాము. నేను త‌న‌తో చాలా సమయం గడిపాను..నాకు మరెవరితోనూ అలాంటి బంధం ఉందని నేను అనుకోను. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? నేను ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాను అని అన్నారు. కానీ ఇంత‌లోనే ఇప్పుడు పెళ్లి బంధంతో ఈ జంట ఒక‌టి కానుంది.