మహేష్ తో మరో ఛాన్స్ కోసం సీతమ్మ వెయిటింగ్!
సూపర్ స్టార్ మహేష్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి బాలీవుడ్ భామ కృతి సనన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని అమ్మడు స్వయంగా వెల్లడించారు.
By: Srikanth Kontham | 6 Aug 2026 6:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి బాలీవుడ్ భామ కృతి సనన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని అమ్మడు స్వయంగా వెల్లడించారు. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మహేష్‌తో జతకట్టే అవకాశం వస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నానని మనసులోని మాటను బయటపెట్టారు. మహేష్ గనుక ఆమె కోరికను మన్నించి ఛాన్స్ ఇస్తే అది రెండవ సారి అవుతుంది. వివరాల్లోకి వెళ్తే. మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ` 1 నేనొక్కడినే` సినిమాతోనే కృతి సనన్ కథానాయికగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఆ చిత్రంలో అమ్మడి నటనకు మంచి గుర్తింపు వచ్చినా? బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ సమయంలో తానొక నటిగా పరిశ్రమకు పూర్తిగా కొత్త అని కెరీర్ ఆరంభంలో సరైన అవగాహన లేని చిన్న పిల్లను అంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తొలి సినిమా చేసే సమయంలో నటనపై, ఇండస్ట్రీ పద్ధతులపై పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల మహేష్ లాంటి స్టార్ హీరోతో పని చేస్తున్నప్పుడు చాలా విషయాలు గ్రహించలేకపోయానని కృతి తెలిపారు. అప్పట్లో వయసు, అనుభవం తక్కువగా ఉండటం వల్ల పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చిన సువర్ణావకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయానన్నారు.
కానీ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిడం.. జాతీయ స్థాయిలో నటిగా ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నానని కృతి గుర్తు చేస్తున్నారు. నటనపై ఇప్పుడు పూర్తి పట్టు వచ్చిందని, పరిపక్వత సాధించానని ధీమా వ్యక్తం చేసారు. ఇప్పుడు గనుక మహేష్ పక్కన నటించే మరో అవకాశం వస్తే పూర్తి నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగలనని ఆశాభావం వ్యక్తం చేసారు.
పరిణతి చెందిన నటిగా మారినందున మహేష్‌తో మరోసారి జోడీ కట్టాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అప్పట్లో సరైన హిట్ పడకపోయినా? ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయితే స్క్రీన్ మీద అదిరిపోయే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని కృతి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కృతి సనన్ కోరికను టాలీవుడ్ మేకర్స్ ... మహేష్ గుర్తిస్తారా? భవిష్యత్తులో ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం కృతిసనన్ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్. చిన్న వయసులోనే జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుని బాలీవుడ్ లో సరికొత్త రికార్డు కూడా సృష్టించారు. ఆ ఇమేజ్ తో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు సైతం అమ్మడు ప్రమోట్ అవుతున్నారు.
