Begin typing your search above and press return to search.

మహిళల భద్రత వర్సెస్ దుస్తులపై విమర్శలు!

ఢిల్లీలో ఇటీవల జరిగిన దారుణమైన గ్యాంగ్ రేప్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కృతి ఈ పోస్ట్‌కు మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరిం చుకుంది.

By:  Srikanth Kontham   |   27 Sept 2026 11:00 PM IST
మహిళల భద్రత వర్సెస్ దుస్తులపై విమర్శలు!
X

బాలీవుడ్ నటి కృతి సనన్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన లైక్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మహిళల దుస్తులపై వ్యక్తమయ్యే ఆగ్రహంతో పోలిస్తే వారిపై జరుగుతున్న లైంగిక దాడులపై సమాజ స్పందన ఎంత బలహీనంగా ఉందో ప్రశ్నించే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను ఆమె లైక్ చేశారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన దారుణమైన గ్యాంగ్ రేప్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కృతి ఈ పోస్ట్‌కు మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరిం చుకుంది.

కృతి సనన్ లైక్ చేసిన పోస్ట్‌లో సమాజపు ద్వంద్వ ప్రమాణాలపై ఘాటు విమర్శలున్నాయి. ` పండుగ ప్రకటనలో నటి ధరించిన దుస్తులు లేదా క్లీవేజ్ కనిపించడంపై వ్యక్తమయ్యేంత తీవ్రమైన ఆగ్రహం.. ఈ దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులు, గృహహింస, వరకట్న హత్యలపై వ్యక్తం కాకపోవడం మన సమాజం ప్రాధాన్యతలను తెలియజేస్తోంది` అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ వివాదానికి ప్రధాన కారణం గతంలో కృతి సనన్ నటించిన ఓ యాడ్. `జీవా` అనే జ్యువెలరీ బ్రాండ్ నిర్వహించిన రక్షాబంధన్ ప్రచార చిత్రంలో కృతి డీప్-నెక్, బ్రాలెట్ తరహా దుస్తులు ధరించడాన్ని కొందరు నెటిజన్లు తీవ్రంగా తప్పుపట్టారు. రాఖీ పండుగ ప్రకటనలో అలాంటి దుస్తులు వేసుకోవడం భారతీయ సంస్కృతికి విరుద్ధమంటూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. అనంతరం స్టోర్ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జీవా సంస్థ ఆ యాడ్‌ను ఉపసంహరించుకుంది.

అప్పట్లోనే ఈ ట్రోలింగ్‌పై కృతి సనన్ తీవ్రంగా స్పందించారు. పండుగల విశిష్టత భావోద్వేగాల్లో ఉంటుందని, వేసుకునే దుస్తుల్లో కాదని స్పష్టం చేశారు. `మహిళల సంస్కృతిని, వారిపై ఉన్న గౌరవాన్ని వారి దుస్తుల ఆధారంగా కొలవడం ఎప్పుడు ఆపుతారు? సంస్కృతీ సంప్రదాయాలు అనేవి హృదయంలో ఉంటాయి కానీ దుస్తుల నెక్‌లైన్‌లో ఉండవు` కృతి స‌న‌న్ అప్పట్లో గట్టిగానే నిలదీశారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకున్న లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సౌత్ ఢిల్లీలోని ఆస్తా కుంజ్ పార్క్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై దారుణమైన‌ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘాతుకానికి నిరసనగా లేడీ శ్రీరామ్ కాలేజ్ సహా వివిధ ఢిల్లీ యూనివర్సిటీ కాలేజీల విద్యార్థినులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి క్యాంపస్‌లలో మహిళల భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు.

ఇలాంటి దారుణమైన నేరాలు జరుగుతున్నా? సమాజం మహిళల భద్రత కంటే వారి దుస్తుల పైనే ఎక్కువ దృష్టి పెడుతోందనే నిజానికే కృతి లైక్ చేసిన పోస్ట్ అద్దం పడుతోంది. పండుగ యాడ్‌లోని దుస్తులపై విరుచుకుపడే నెటిజన్లు, నిజ జీవితంలో మహిళలపై జరుగుతున్న హింసపై ఎందుకు అంతే స్థాయిలో స్పందించడం లేదనే ప్రశ్నను ఈ ఘటన మరోసారి తెరపైకి తెచ్చింది. మోరల్ పోలీసింగ్ కంటే మహిళల ప్రాణ రక్షణే ముఖ్యమనే సందేశాన్ని కృతి ఈ చర్య ద్వారా పరోక్షంగా గుర్తుచేశారు.