బాప్ రే! రెండేళ్లలో 400 కోట్ల కంపెనీ సృష్టికర్త ఈ నటి!!
ఇప్పుడు యువనటి కృతి సనోన్ వంతు. కృతి తెలుగు, తమిళం, హిందీ చిత్రసీమలలో కథానాయికగా సుపరిచితురాలు.
By: Sivaji Kontham | 1 Aug 2025 8:00 AM ISTగ్లామర్ రంగంలో దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలని అంటారు. అద్భుతమైన అందం, నటనా ప్రతిభతో ఆకట్టుకుంటున్న చాలా మంది కథానాయికలు వ్యవస్థాపక రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా కథానాయికలు రకరకాల వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెడుతూ, సొంత బ్రాండ్లను అభివృద్ధి చేస్తూ, భారీగా లాభాలార్జిస్తున్నారు. సోనమ్ కపూర్, అనుష్క శర్మ, సమంత, కాజల్ అగర్వాల్, దీపిక పదుకొనే, ఆలియా భట్, నయనతార, సన్నీలియోన్ .. లాంటి చాలామంది కథానాయికలు వ్యాపార రంగంలో ప్రవేశించి భారీగా ఆర్జిస్తున్నారు.
ఇప్పుడు యువనటి కృతి సనోన్ వంతు. కృతి తెలుగు, తమిళం, హిందీ చిత్రసీమలలో కథానాయికగా సుపరిచితురాలు. ఇటీవల ఈ ట్యాలెంటెడ్ నటి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. మరోవైపు కమర్షియల్ సినిమాలతో బాక్సాఫీస్ హిట్లను సొంతం చేసుకుంటోంది. 1-నేనొక్కడినే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైనప్పుడు కృతిలోని స్పార్క్ ని పరిశ్రమ గుర్తించింది. తెలుగు తమిళంలో కొన్నేళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది. మరోవైపు తనదైన నట ప్రతిభతో బాలీవుడ్‌లో క్రేజీ సినిమాల్లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో అవకాశాలు అందుకుంటూ, కెరీర్ పరంగా అత్యుత్తమ దశకు చేరుకుంది. ఇదే సమయంలో ఈ భామ వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. స్టార్టప్ కంపెనీలో తెలివైన పెట్టుబడులతో తన బ్రాండ్ ని విస్తరిస్తోంది. పరిశ్రమలో నేము, ఫేము ఉండగానే కృతి వేగంగా ఎదిగేందుకు ప్రణాళికల్ని అమలు చేస్తూ, సాటి నటీమణుల్లో స్ఫూర్తిని నింపుతోంది.
40లక్షల కస్టమర్లతో వ్యాపారం పీక్స్:
తాజా సమాచారం మేరకు.. కృతి చర్మ సౌందర్య ఉత్పత్తుల రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్ గా వేగంగా ఎదిగేస్తోంది. ఈ బ్యూటీ HYPHEN అనే పేరుతో చర్మ ఉత్పత్తుల కంపెనీని ప్రారంభించింది. హైఫెన్ ప్రారంభమైన కేవలం రెండేళ్లలోనే దాదాపు 400 కోట్ల టర్నోవర్‌తో వేగంగా విస్తరించింది. అతి తక్కువ సమయంలో వ్యాపార సంస్థను ఈ స్థాయికి చేర్చడం నిజంగా కృతి సనోన్, ఆమె టీమ్ గొప్పతనం. దేశవ్యాప్తంగా 19,000 పిన్ కోడ్‌లకు సేవలందిస్తున్న ఈ కంపెనీ వినియోగదారుల బేస్ అద్భుతమైన 4X వృద్ధిని సాధించింది. గత సంవత్సరం 10 లక్షల (1 మిలియన్) కస్టమర్ల నుండి ఈ సంవత్సరం 40 లక్షల (4 మిలియన్ల) మంది కస్టమర్ల రేంజుకు విస్తరించింది. స్వతహాగానే ఇంజినీర్ అయిన కృతి సనోన్ మరో ఆరుగురు ఇంజినీర్లతో కలిసి వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేస్తోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న D2C బ్రాండ్‌కు కృతి సృష్టికర్త. 60 శాతం రిపీట్ కస్టమర్లతో బ్రాండ్ వేగంగా అభివృద్ధి చెందుతోందనేది కంపెనీ నివేదిక.
బ్రాండ్ పాపులారిటీకి కారణం?
సౌందర్య ఉత్పత్తుల రంగంలో నమ్మకమైన వినియోగదారులు చాలా ముఖ్యం. HYPHEN తమ ఉత్పత్తుల విషయంలో ఈ నమ్మకాన్ని సాధించింది. పూర్తిగా ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో రూపొందించే ఉత్పత్తులను అందించే సంస్థగా హైఫెన్ పాపులరైంది. దీనికి తోడు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా సరసమైన ధరలతో ఆకర్షించడం బ్రాండ్ వృద్ధికి దోహదపడింది. నటిగా, వ్యవస్థాపకురాలిగా అత్యుత్తమ స్థితికి చేరుకున్న కృతి సనోన్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఇది తనకు ప్రత్యేకమైన పుట్టినరోజు అంటూ ఈ భామ ఆనందం వ్యక్తం చేసింది.
నటిగా ప్రయాణం ఇలా..
కెరీర్ మ్యాటర్ కి వస్తే, కృతి సనోన్ ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ సరసన `డాన్ 3`లో కథానాయికగా ఎంపికైందని కథనాలొచ్చాయి. ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రానికి దర్శకనిర్మాత. కానీ కృతి ఎంపిక గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
