Begin typing your search above and press return to search.

సెట్లో హీరోల‌కు ఉన్న గౌర‌వం హీరోయిన్‌ల‌కు ఉండ‌దు.. కృతి స‌న‌న్ ఆరోప‌ణ‌!

సినీ పరిశ్రమలో గ్లామర్ వెలుగులతో పాటు అస‌మాన‌త‌లు, అణ‌చివేత‌కు సంబంధించిన కొన్ని చీకటి కోణాలు కూడా దాగి ఉన్నాయి.

By:  Sivaji Kontham   |   6 July 2026 6:00 AM IST
సెట్లో హీరోల‌కు ఉన్న గౌర‌వం హీరోయిన్‌ల‌కు ఉండ‌దు.. కృతి స‌న‌న్ ఆరోప‌ణ‌!
X

సినీ పరిశ్రమలో గ్లామర్ వెలుగులతో పాటు అస‌మాన‌త‌లు, అణ‌చివేత‌కు సంబంధించిన కొన్ని చీకటి కోణాలు కూడా దాగి ఉన్నాయి. ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న యంగ్ హీరోయిన్ కృతి సనన్ ఇటీవల ఇంటర్వ్యూలో పురుషాధిక్య ప్రపంచంపై సూటిగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ సమయంలో ఒక మేల్ స్టార్ తనను కావాలనే పక్కకు తోసేయడానికి ప్ర‌య‌త్నించాడ‌ని.. తాను ఏ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొనాలో ఆయనే నిర్ణయించడానికి ప్రయత్నించాడని కృతి వ్యాఖ్యానించారు. ఇది తనకు తీవ్ర అవమానంగా అనిపించిందని.. ఒకవేళ ప్రమోషన్స్‌లో నా అవసరం లేదనుకుంటే ఆ హీరోనే ఒంటరిగా ప్రమోట్ చేసుకోవాలంటూ తాను వెనక్కి తగ్గానని కృతి సనన్ బోల్డ్‌గా చెప్పుకొచ్చారు.

కృతి సనన్ తన కెరీర్ ప్రారంభంలో (2014) ఎదుర్కొన్న వివక్షను గుర్తు చేసుకుంటూ.. సినిమా సెట్స్‌పై ఒక పురుషుడికి ఇచ్చే గౌరవానికి.. ఒక మహిళకు ఇచ్చే ప్రాధాన్యతకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో మేల్ యాక్టర్స్‌కు పెద్ద రూమ్‌లు, లగ్జరీ కార్లు ఇస్తూ.. మహిళా నటీమణులకు మాత్రం చిన్న రూమ్‌లు, చిన్న కార్లను కేటాయించేవారని తెలిపారు. వాహనాలు, గదుల సైజుల గురించి తనకు పట్టింపు లేకపోయినా... అవి తమను తక్కువ చేసి చూపేలా ఉంటాయని కృతి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్ స్టార్ల‌ విషయంలో అది సమంజసమే అయినా... అంతగా అనుభవం లేని హీరోల విషయంలో కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు హీరో టైమింగ్స్‌కు భయపడి, హీరోయిన్లను ముందే పిలిచి సెట్స్‌పై వేచి చూసేలా చేస్తారని కృతి మండిపడ్డారు.

సెట్స్‌పై ఒక మహిళ తన గళాన్ని వినిపిస్తే ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా కృతి వివరించారు. తాను నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోకపోవడం వల్ల డైరెక్టర్లను ఏవైనా ప్రశ్నలు అడిగితే లేదా సలహాలు ఇస్తే.. ``నువ్వు ఎక్కువగా అనలైజ్ చేస్తున్నావ్`` అంటూ కొట్టిపారేసేవారని చెప్పారు. అదే సలహాను ఒక మేల్ నటుడు ఇస్తే మాత్రం ``అవును, అలాగే చేద్దాం`` అంటూ చాలా గొప్పగా స్వీకరిస్తారని.. మ‌గాళ్లు ప్రశ్నిస్తే అది వారి `ఇన్వాల్వ్‌మెంట్` అని, మహిళలు ప్రశ్నిస్తే మాత్రం `అతి`గా చూస్తారని కృతి విమర్శించారు. ఒక వర్కింగ్ ఎన్విరాన్‌మెంట్‌లో సమాన గౌరవం లభించనప్పుడు.. జెండర్ వివక్షకు వ్యతిరేకంగా తను గొంతు ఎత్తకపోతే ఆ బాధ తనను రోజురోజుకూ పీడిస్తుందని.. అందుకే తాను ఎదురుతిరగడం నేర్చుకున్నానని కృతి స్పష్టం చేశారు.

గతంలో కూడా బాలీవుడ్‌లో కంగనా రనౌత్, దియా మీర్జా వంటి పలువురు కథానాయికలు ఇండస్ట్రీలోని మేల్ డామినేషన్‌ను, పితృస్వామ్య వ్యవస్థను తీవ్రంగా దూషించారు. హాలీవుడ్‌లో సైతం పాపులర్ హోస్ట్ లిల్లీ సింగ్ 2011 నాటి ఒక సినిమా షూటింగ్ అనుభవాన్ని గుర్తు చేస్తూ... నటి సోనమ్ కపూర్ వాష్ రూమ్‌కు వెళ్తానంటే హీరో అక్షయ్ కుమార్ వచ్చే వరకు 20 నిమిషాల పాటు వెయిట్ చేయమన్నారని... అప్పుడు సోనమ్ ``ఇది మగవాళ్ల ప్రపంచం`` అని ఆవేదన చెందిందని పేర్కొన్నారు. అయితే అప్పట్లో అలా ఉన్నా... ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని... మహిళా నటులు తమ హక్కుల కోసం గట్టిగా నిలబడుతున్నారని కృతి సనన్ అభిప్రాయపడ్డారు.

2014లో టాలీవుడ్‌లో మహేష్ బాబు సరసన `1: నేనొక్కడినే` చిత్రంతో ఎంట్రీ ఇచ్చి... ఆ తర్వాత బాలీవుడ్‌లో `హిరోపంతి`, `దిల్‌వాలే`, `మిమి` (జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం), `క్రూ` వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన కృతి సనన్.. నేటి తరం హీరోయిన్లకు ఒక రోల్ మోడల్‌గా నిలిచారు. ఒకప్పుడు కేవలం గ్లామర్ డాళ్స్‌ లాగా కేవలం హీరో పక్కన ప్రేయ‌సి పాత్రలకే పరిమితమైన హీరోయిన్లు.. ఇప్పుడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న పాత్రలను ఎంచుకుంటూ పురుషాధిక్య ప్రపంచానికి సవాల్ విసురుతున్నారని భావించ‌వ‌చ్చు.