హీరోలకు మాత్రమే అన్ని సౌకర్యాలు.. హీరోయిన్ కీలక వ్యాఖ్యలు
కానీ హీరోకు ఉన్నంత సౌకర్యాలు.. సౌలభ్యాలు తమకు మాత్రం మేకర్స్ ఎప్పుడూ కల్పించరని అప్పుడప్పుడు కొందరు హీరోయిన్స్ బహిరంగంగా ఆరోపిస్తుంటారు.
By: M Prashanth | 2 Sept 2025 4:46 PM ISTఏ సినిమాకు అయినా హీరో- హీరోయిన్ ముఖ్యమే. కానీ హీరోకు ఉన్నంత సౌకర్యాలు.. సౌలభ్యాలు తమకు మాత్రం మేకర్స్ ఎప్పుడూ కల్పించరని అప్పుడప్పుడు కొందరు హీరోయిన్స్ బహిరంగంగా ఆరోపిస్తుంటారు. ఆ సమయంలో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటాయి. హాట్ టాపిక్ గా కూడా మారుతుంటాయి.
ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. రీసెంట్ గా ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్- UNFPA ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపికై మరో ఘనత సాధించిన ఆమె.. లింగ వివక్షపై కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉండే సౌకర్యాలు.. ఇచ్చే గౌరవం హీరోయిన్లకు ఉండవని అన్నారు.
అయితే సౌకర్యాలు కల్పించడంలోనే కాకుండా గౌరవించడంలో కూడా అసమానత చూపుతారని ఆరోపించారు. కథానాయకులకు పెద్ద పెద్ద కార్లు అరేంజ్ చేస్తారని.. లగ్జరీయస్ రూమ్స్ కేటాయిస్తారని అన్నారు. అవి చాలా చిన్న విషయాలు కావొచ్చని, కానీ అలా ఎందుకు చేస్తారని ఎప్పుడు బాధపడుతుంటానని కృతి సనన్ వ్యాఖ్యానించారు.
సౌకర్యాలు పక్కన పెడితే.. మహిళలను తక్కువ చేసి చూస్తుంటారని ఆరోపించారు. అయితే హీరోలతో సమానమైన గౌరవానికి హీరోయిన్స్ కూడా అర్హులేనని తెలిపారు. సినిమా షూటింగ్ సమయంలో హీరోలు సెట్స్ కు చాలా లేటుగా వస్తారని, కానీ హీరోయిన్స్ మాత్రం ముందే అక్కడికి వెళ్లి వెయిట్ చేయాలని కృతి సనన్ విమర్శించారు.
ప్రాజెక్టుకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉండేవారు.. తమకేమో సెట్స్ కు ముందే రావాలని పిలుస్తారని, కానీ హీరోలకు మాత్రం అలా చెప్పరని అన్నారు. అందుకే అలాంటి ఆలోచనా విధానంలో కచ్చితంగా ఛేంజ్ రావాలని అభిప్రాయపడ్డారు. అయితే తాను ఎంతో హార్డ్ వర్క్ చేసి.. ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించారు.
అయితే తన తల్లి స్విమ్మింగ్, డ్యాన్స్ నేర్చుకోవాలని, ఎప్పుడూ కలలు కనేవారని తెలిపారు. కానీ కుదర్లేదని, చదువు కోసం పోరాటం చేశారని, ఇప్పుడు ప్రొఫెసర్ గా జాబ్ చేస్తున్నట్లు చెప్పారు. ఆ స్ఫూర్తితోనే తమను పెంచారని, ఎలాంటి నిబంధనలు పెట్టకుండా స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. మహిళలు అంటే కేవలం వంట గదికే పరిమితం కాదని భావించేవారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
