Begin typing your search above and press return to search.

త‌క్కువ‌గా చూస్తే తాట తీసేలా రెడీ అవ్వ‌మంటోన్న సీత‌మ్మ‌!

పరిశ్రమలో సాంకేతికంగా, కథల పరంగా ఎంతో మార్పు వ‌స్తున్నా? లింగ వివక్ష మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందనేది చేదు నిజం. తాజాగా ఇదే విషయంపై జాతీయ అవార్డు గ్రహీత, నటి కృతి సనన్ బహిరంగంగా స్పందించారు.

By:  Srikanth Kontham   |   4 July 2026 9:00 PM IST
త‌క్కువ‌గా చూస్తే తాట తీసేలా రెడీ అవ్వ‌మంటోన్న సీత‌మ్మ‌!
X

పరిశ్రమలో సాంకేతికంగా, కథల పరంగా ఎంతో మార్పు వ‌స్తున్నా? లింగ వివక్ష మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందనేది చేదు నిజం. తాజాగా ఇదే విషయంపై జాతీయ అవార్డు గ్రహీత, నటి కృతి సనన్ బహిరంగంగా స్పందించారు. సెట్స్‌పై మహిళా నటీమణులను చాలా సులువుగా తీసుకుంటారని పురుష నటులతో పోలిస్తే వారిని తక్కువ స్థాయి వ్యక్తులుగా భావించే వాతావరణం నేటికీ పరిశ్రమలో ఉంద‌ని చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో సరికొత్త చర్చకు తెరలేపాయి. ఈ సంద‌ర్భంగా కృతి స‌న‌న్ కెరీర్ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

ఒకే సినిమాలో నటిస్తున్నప్పటికీ హీరోలకు, హీరోయిన్లకు ఇచ్చే ప్రాధాన్యతలో స్పష్టమైన తేడాలున్నాయ‌ని కృతి సనన్ పేర్కొన్నారు. క్యారవాన్ల కేటాయింపు, బస చేసే వసతులు, వ్యక్తిగత సిబ్బందికి ఇచ్చే ప్రాధాన్యతల నుండి పారితోషికాల వరకు ప్రతి విషయంలోనూ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం స్టార్ స్టేటస్ వల్లే కాకుండా సహజంగానే పురుష నటులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనస్తత్వం పరిశ్రమలో ఏళ్ల కాలంగా పాతుకుపోయిందని విమర్శించారు. సినిమా మేకింగ్.. స్క్రిప్ట్ చర్చల సమయంలో మహిళల అభిప్రాయాలకు లభించే గౌరవం చాలా తక్కువగా ఉంటుందని కృతి వెల్లడించారు.

ఒక పురుష నటుడు కథలో మార్పులు చెప్పినా? సృజనాత్మకమైన సలహాలు ఇచ్చినా? దాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకుంటారు. అదే కథానాయిక తన పాత్ర గురించి లేదా కథ గురించి గట్టిగా మాట్లాడితే ఆమెను అతిగా జోక్యం చేసుకుంటుంది అనే ముద్ర వేస్తారని వాపోయారు. మహిళల మేధస్సుకు, వారి సృజనాత్మక ఆలోచనలకు చిత్ర నిర్మాణ ప్రక్రియలో సరైన గుర్తింపు దక్కడం లేదన్నారు. పరిస్థితులు ఇలా ఉన్నా? తానే స్వయంగా నటించిన కొన్ని మహిళా ప్రాధాన్యత చిత్రాలు తన ఆలోచనా విధానాన్ని ..పరిశ్రమ తనను చూసే కోణాన్ని మార్చాయని కృతి సనన్ అభిప్రాయపడ్డారు.

ఒక నటిగా కథను తన భుజాలపై వేసుకుని సినిమాను విజయతీరాలకు చేర్చగలనని నిరూపించుకున్నప్పుడు మాత్రమే సెట్స్‌పై గౌరవం పెరుగుతుందన్నారు. మహిళలు కేవలం గ్లామర్ బొమ్మలుగానే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టగల సత్తా ఉన్నవారిగా మారినప్పుడే వివక్ష తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలో మార్పు అనేది రాత్రికి రాత్రి రాదని కానీ అందుకోసం మహిళా నటీమణులంతా ఏకమై గళం విప్పాల్సిన అవసరం ఉందని కృతి పిలుపునిచ్చారు. హక్కుల గురించి మాట్లాడటం, వివక్ష ఎదురైనప్పుడు ప్రశ్నించడం అనేది కెరీర్‌కు నష్టం కలిగిస్తుందనే భయాన్ని వీడాలన్నారు. ప్రస్తుత తరం నటీమణులు పారితోషికాల విషయం లోనూ, సెట్స్‌పై తమకు దక్కాల్సిన గౌరవప్రదమైన సదుపాయాల విషయంలోనూ రాజీ పడకుండా డిమాండ్ చేయాలని సూచించారు.