Begin typing your search above and press return to search.

'దురంధ‌ర్' ఫీమేల్ వెర్ష‌న్‌ 3000 కోట్లు తెచ్చేస్తుంద‌ట‌!

సినీ పరిశ్రమలో నటీమణుల విష‌యంలో వివక్ష ఉందనే ఆరోపణలు నిన్న మొన్నటివి కావు.

By:  Sivaji Kontham   |   2 Nov 2026 1:00 AM IST
దురంధ‌ర్ ఫీమేల్ వెర్ష‌న్‌ 3000 కోట్లు తెచ్చేస్తుంద‌ట‌!
X

సినీ పరిశ్రమలో నటీమణుల విష‌యంలో వివక్ష ఉందనే ఆరోపణలు నిన్న మొన్నటివి కావు. మేల్ స్టార్స్‌తో పోలిస్తే వారికి దక్కే సౌకర్యాలు, పారితోషికాలు, సినిమాల బడ్జెట్లు చాలా పరిమితంగా ఉంటాయనేది కాదనలేని వాస్తవం. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే సత్తా కేవలం స్టార్ హీరోలకు మాత్రమే ఉందనే సాంప్రదాయ భావనలో మేకర్స్ ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిస్థితి మారాలని, మహిళా నటులకు కూడా సరైన గుర్తింపు, సమానమైన ప్రాధాన్యత దక్కాలని సినీ రంగంలోని పలువురు కథానాయికలు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ నటి కృతి సనన్ లేవనెత్తిన ఒక ఆలోచన ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పఠాన్, ధురంధర్ వంటి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలను మహిళా ప్రధాన పాత్రలతో తెరకెక్కించినా ప్రేక్షకులు ఆదరిస్తారని ధైర్యంగా వ్యాఖ్యానించారు. నిర్మాతలు కాస్త తెగించి మగ నటులతో తీసే చిత్రాలకు సమానంగా బడ్జెట్, క్వాలిటీ మేకింగ్, భారీ ప్రమోషన్లు కేటాయిస్తే.. మహిళా నటీమణులు కూడా భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్లను తమ భుజస్కంధాలపై విజయవంతంగా నడిపించగలరని కృతి అభిప్రాయ‌ప‌డ్డారు.

నాయికా ప్ర‌ధాన చిత్రాల‌పై పరిశ్రమ చూపిస్తున్న బడ్జెట్ వ్యత్యాసాన్ని ఈ వ్యాఖ్యలు ప్రముఖంగా ఎత్తిచూపుతున్నాయి. సాధారణంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్, పవర్ ఫుల్ యాక్షన్ కొరియోగ్రఫీ, ప్రైమ్ థియేట్రికల్ రిలీజ్ వంటివి ఎక్కువగా స్టార్ హీరోల చిత్రాలకే దక్కుతుంటాయి. నాయికా ప్రాధాన్యత ఉన్న సినిమాలకు తక్కువ బడ్జెట్లు కేటాయించడం వల్ల అవి విజువల్ ప్రమాణాల్లో వెనుకబడిపోతున్నాయనే అభిప్రాయం ఉంది. మగ హీరోలతో సమానమైన కాన్వాస్ ఇస్తే మహిళా నటులు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయం సాధించగలరని కృతి ధీమా వ్యక్తం చేశారు.

అయితే మహిళా ప్రాధాన్యత ఉన్న యాక్షన్ సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు పరిశ్రమకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. రాజీ, క్రూ, స్త్రీ, స్త్రీ 2 వంటి చిత్రాలు కమర్షియల్‌గా సంచలన విజయాలు సాధించినా.. ఇటీవల ఆలియా భట్, శార్వ‌రి నటించిన అత్యంత భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం `అల్ఫా` బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచింది. `అల్ఫా` చేదు అనుభవం కళ్లముందే ఉన్నప్పటికీ కృతి సనన్ ఈ స్థాయిలో మాట్లాడటం గమనార్హం. మగ హీరోల సినిమాలు వరుసగా విఫలమైనా నిర్మాతలు వారిపై మళ్లీ మళ్లీ వందల కోట్లు పెడతారని, అదే మహిళా చిత్రాలు ఒక్కటి పరాజయం పాలైనా వెంటనే బడ్జెట్లకు కోతలు విధిస్తారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే `దురంధ‌ర్` ఫీమేల్ వెర్ష‌న్‌ 3000 కోట్లు తెచ్చేస్తుందా? అంటూ కూడా కొంద‌రు నెటిజ‌నులు కృతిని ఎదురు ప్ర‌శ్నించ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

ఏదేమైనా మహిళా ప్రధాన యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవాలంటే పరిశ్రమలో నిలకడైన నమ్మకం, ధైర్యమైన పెట్టుబడులు చాలా అవసరం. కేవలం ఒకరిద్దరి ప్రయత్నంగా కాకుండా మంచి కథలు, అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రఫీ, భారీ విజువల్స్‌తో సినిమాలను రూపొందించినప్పుడే మహిళా యాక్షన్ చిత్రాలకు సరైన మార్కెట్ ఏర్పడుతుంది. నిర్మాతలు కృతి సనన్ చెప్పినట్లుగా రిస్క్ తీసుకుని ధైర్యమైన నిర్ణయాలు ముందుకు తీసుకెళ్తే.. మునుముందు భారతీయ సినిమాలో ఒక కొత్త శకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.