ప్రైవసీ లీక్.. ఫోటోగ్రాఫర్లపై కృతి చిర్రు బుర్రు
అయితే కృతి విముఖత వ్యక్తం చేసినా, ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.
By: Sivaji Kontham | 13 Jan 2026 9:11 PM ISTబాలీవుడ్ లో స్టార్ స్టాటస్ దిశగా దూసుకెళ్లిన కృతి సనన్ ఇటీవల వ్యక్తిగత వ్యవహారాల కారణంగా నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. కృతి ఎయిర్‌పోర్ట్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తన సోదరి నుపుర్ సనన్ పెళ్లి వేడుకల కోసం ఉదయపూర్ వెళ్తున్న క్రమంలో జరిగిన ఒక సంఘటనపై నెటిజన్లు, సెలబ్రిటీలు ప్రైవసీ గురించి గళమెత్తుతున్నారు.
ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజులుగా తన సోదరి నుపుర్ సనన్ వివాహ వేడుకల హడావుడిలో ఉన్న కృతి సనన్, ఎయిర్‌పోర్ట్‌లో తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఫోన్‌లో ఏదో వ్యక్తిగతమైన విషయంలో కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో స్టిల్ ఫోటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టి ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. అది నచ్చని కృతి చాలా అసహనానికి, కోపానికి గురయ్యారు.
అయితే కృతి విముఖత వ్యక్తం చేసినా, ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కృతికి చాలామంది సహచరులతో పాటు నెటిజనుల మద్ధతు దక్కింది. సెలబ్రిటీలైనా సరే వారికి కూడా వ్యక్తిగత భావోద్వేగాలు ఉంటాయి. కుటుంబ వేడుకల సమయంలో ఇలా కెమెరాలతో వెంటపడటం సరికాదు అంటూ ఫోటోగ్రాఫర్లపై విరుచుకుపడ్డారు. గతంలో ఆలియా భట్, అనుష్క శర్మ కూడా ఇటువంటి ప్రైవసీ భంగంపై తీవ్రంగా స్పందించారు. అయితే కొందరు మాత్రం పబ్లిక్ ఫిగర్ విషయంలో ఇవన్నీ తప్పవు అని వాదిస్తున్నారు.
సోదరి నుపుర్ పెళ్లి సందడి:
నుపుర్ సనన్ తన ప్రియుడు స్టెబిన్ బెన్ ని ఉదయపూర్‌లోని ఓ విలాసవంతమైన వేడుకలో పెళ్లాడారు. అయితే కృతికి సంబంధించిన ఈ లీక్డ్ వీడియో మూమెంట్ వైరల్ అవ్వడం తనను మరింత కలవరపెట్టింది.
నిజానికి కృతి సనన్ ప్రశాంత స్వభావం ఉన్న అమ్మాయి. సహజంగా కోపం రాదు. కానీ తన కుటుంబానికి సంబంధించిన విషయంలో ప్రైవసీ దెబ్బతిన్నప్పుడు ఆమె కోపం అదుపు తప్పింది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను ఇలా కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పెట్టడం సరైనదేనా? ప్రజలే దీనికి సమాధానం చెప్పాలి. కృతి సనోన్ టాలీవుడ్ బాలీవుడ్ లో ప్రముఖ నటి కాగా, నుపుర్ సనన్ టాలీవుడ్ లో రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంలో నటించింది.
