ఉప్పెన బ్యూటీ.. 30 రోజుల్లో 3 సినిమాలు
కృతి శెట్టికి టాలీవుడ్‌లో వచ్చినంత గ్రాండ్ ఎంట్రీ మరే హీరోయిన్‌కి దొరకలేదనే చెప్పాలి. 'ఉప్పెన'తో తొలి సినిమాలోనే సంచలన విజయాన్ని అందుకున్న కృతి ఏకంగా 100కోట్ల హిట్టును చూసింది.
By: M Prashanth | 9 Oct 2025 11:56 AM ISTకృతి శెట్టికి టాలీవుడ్‌లో వచ్చినంత గ్రాండ్ ఎంట్రీ మరే హీరోయిన్‌కి దొరకలేదనే చెప్పాలి. 'ఉప్పెన'తో తొలి సినిమాలోనే సంచలన విజయాన్ని అందుకున్న కృతి ఏకంగా 100కోట్ల హిట్టును చూసింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలకు కొదవ లేకుండా చూసుకుంది. కానీ, ఆమె దురదృష్టం కొద్దీ ఆ తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దీని ఫలితంగా, తెలుగులో ఆమె క్రేజ్ క్రమంగా తగ్గుముఖం పట్టడం మొదలైంది.
ఈ దశలో కృతి శెట్టి తెలివిగా గేర్ మార్చి, తన ఫోకస్‌ను తమిళ సినీ పరిశ్రమ వైపు షిఫ్ట్ చేసింది. దాదాపు మూడేళ్ల క్రితమే ఆమె తమిళంలో అడుగుపెట్టినప్పటికీ, అక్కడ కూడా ఆమెకు అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు కూడా రకరకాల కారణాల వల్ల రిలీజ్‌కు నోచుకోక తీవ్ర జాప్యం ఎదుర్కొన్నాయి. ఈ వెయిటింగ్ పీరియడ్‌లో ఫ్యాన్స్‌తో పాటు, కృతి శెట్టి కూడా నిరాశ చెందింది అనడంలో సందేహం లేదు.
అయితే, ఇప్పుడు ఈ నిరాశకు చెక్ పెడుతూ ఒక ఊహించని బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఏళ్ల తరబడి వేచి చూసిన కృతి తమిళ చిత్రాలు మూడు ఒకేసారి, ఒకే నెలలో విడుదల కాబోతున్నాయి. అవును, డిసెంబర్ నెలలో ఆమె నటించిన మూడు సినిమాలు.. 'వా వాత్తియార్', 'LIK' 'జెనీ' థియేటర్లలోకి రాబోతున్నాయి.
కార్తీ సరసన చేసిన 'వా వాత్తియార్' డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా, 'LIK' డిసెంబర్ 18న షెడ్యూల్ అయింది. 'జెనీ' కూడా CG వర్క్ పూర్తి అయిన వెంటనే డిసెంబర్ రిలీజ్‌ను టార్గెట్ చేసింది. మూడు సంవత్సరాలు ఎదురుచూసిన డెబ్యూ, కేవలం 30 రోజుల్లోనే 'ట్రిపుల్ ధమాకా'గా మారడం నిజంగా ఒక బిగ్ ఛాలెంజ్. ఈ రోజుల్లో ఒకే నెలలో ఒక నటి మూడు సినిమాలు విడుదల అవడం అనేది అరుదు.
కానీ, కృతి శెట్టి విషయంలో, ఇది ఒక అద్భుతమైన కమ్‌బ్యాక్ ఆపర్చునిటీ. వేర్వేరు జానర్‌లు, వేర్వేరు హీరోలతో వస్తున్న ఈ మూడు సినిమాలు సక్సెస్ అయితే, తమిళ ఇండస్ట్రీలో ఆమె స్థానం బలపడుతుంది. తెలుగులో కోల్పోయిన మార్కెట్ వాల్యూను ఆమె తమిళం ద్వారా తిరిగి సంపాదించుకోవచ్చు. 'ఉప్పెన' తర్వాత సరైన బ్రేక్ కోసం ఎదురుచూసిన కృతి శెట్టికి, ఈ ట్రిపుల్ రిలీజ్ స్ట్రాటజీ కచ్చితంగా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఈ 30 రోజులు ఆమె కెరీర్‌ను శాసించనున్నాయని చెప్పవచ్చు. మరి ఈ మూడు సినిమాల బజ్ తో కృతి, పాన్ ఇండియా స్టార్‌గా తన సత్తా చాటుతుందో లేదో చూడాలి.
