500 సార్లు ఒంగి స్నానం చేస్తే.. ANR విచిత్రమైన సలహా!
దివంగత నటుడు, లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) గారితో తనకున్న మధురమైన జ్ఞాపకాలను నటుడు కృష్ణుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.
By: Sivaji Kontham | 29 Sept 2026 9:38 AM ISTదివంగత నటుడు, లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) గారితో తనకున్న మధురమైన జ్ఞాపకాలను నటుడు కృష్ణుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ఏఎన్నార్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన తనకు ఇచ్చిన సలహాలను ఈ సందర్భంగా వివరించారు.
ఏఎన్నార్ గారు తనకు ఒక వినూత్నమైన సలహా ఇచ్చారని కృష్ణుడు తెలిపారు. షవర్‌తో స్నానం చేయవద్దని.. బకెట్‌లో నీళ్లు పోసుకొని మగ్గుతో వంగి స్నానం చేయాలని చెప్పేవారన్నారు. అలా రోజుకు 500 సార్లు వంగితే పొట్ట ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందని ఆయన తనకు సూచించారని గుర్తుచేసుకున్నారు.
`మనం` సినిమా సక్సెస్ సమయంలో `అభినందన` ఫంక్షన్‌లో ఏఎన్నార్ గారు తనను ఎంతగానో అప్రిషియేట్ చేశారని కృష్ణుడు చెప్పారు. కృష్ణుడికి వాళ్ళ అమ్మ వెన్నముద్దలు తినిపించి ఉంటుందని.. అందుకే ఆయన చిన్నప్పుడు అంత ముద్దుగా ఉండేవాడని ఏఎన్నార్ అనడం తన జీవితంలో మరువలేని అనుభూతి అని తెలిపారు.
నాగేశ్వరరావు గారు `మాయాబజార్` చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ లోకి మార్చిన సందర్భాన్ని కృష్ణుడు ప్రస్తావించారు. ఆ కలర్ వెర్షన్ షో కోసం గెస్ట్ గా తనను కూడా పిలిచారని.. ఆ ప్లాట్‌ఫామ్‌ను ఆయనతో షేర్ చేసుకోవడం నిజంగా గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. అప్పుడు ఆ సినిమాలో నటించిన వారిలో ఏఎన్నార్ ఒక్కరే జీవించి ఉన్నారు. తాను ఒక్కడినే ఇప్పుడు బతికి ఉండటం, ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం చాలా భావోద్వేగానికి గురిచేస్తుందని ఏఎన్నార్ అన్నారట.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో డిసిప్లిన్ సిస్టమ్ ఉన్న గొప్ప వ్యక్తి ఏఎన్నార్ అని కృష్ణుడు కొనియాడారు. ఆయనతో గడిపిన క్షణాలు, షేర్ చేసిన జ్ఞాపకాలు తన లైఫ్‌లో ఎప్పటికీ మరువలేని ఒక అపురూపమైన అనుభవమని... ఆయనతో కొంతకాలం పాటు ప్రయాణించడం తన అదృష్టమని ఈ ఆడియోలో భావోద్వేగంతో షేర్ చేసుకున్నారు.
నటుడు కృష్ణుడు సినీ, టీవీ కెరీర్ గురించి..
నటుడు కృష్ణుడు `హ్యాపీ డేస్` చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత `వినాయకుడు`, `విలేజ్ లో వినాయకుడు` వంటి విజయవంతమైన సినిమాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. తన విభిన్నమైన బాడీ లాంగ్వేజ్, అమాయకత్వంతో కూడిన నటనతో ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌గా, సహాయ నటుడిగా నటించి తనదైన ముద్ర వేశారు. వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి కొన్ని టీవీ కార్యక్రమాలతోను అలరించారు. `గంగతో రాంబాబు` కామెడీ సీరియల్‌లోను నటించారు. బిగ్ బాస్ షోలోను కృష్ణుడు తన ప్రతిభతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో కృష్ణుడు కనిపించారు. యంగ్ హీరో నాగశౌర్య సినిమా బ్యాడ్ బోయ్ కార్తీక్‌లోను నటించారు. ప్రస్తుతం కృష్ణుడు సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటూ..తనకు సూట్ అయ్యే క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేస్తున్నారు. రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టడం.. అలాగే వ్యక్తిగత వ్యాపారాలు చూసుకుంటుండటం వల్ల సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మంచి పాత్రలు వస్తే కృష్ణుడు నటిస్తున్నారు.
